telugu states weather: మరో రెండు రోజులు జాగ్రత్త... ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక
ఒక రోజు గ్యాప్ ఇచ్చిన వరుణుడు మళ్లీ కమ్మేసేందుకు సిద్ధమయ్యాడు. రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది.
తెలుగు రాష్ట్రాలపై వరుణుడు కరుణించాడు. శనివారం కాస్త విరామం ఇచ్చాడు. శుక్రవారం వరకు కురిసిన వర్షాలు చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పోయారు. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు వర్షాలు దంచికొట్టాయి. కుండపోత వర్షాలతో చాలా జిల్లాలు నీట మునిగాయి. గంటలు గడుస్తున్నా కొన్ని ఊళ్లు నీళ్లలోనే ఉన్నాయి.
తెలంగాణలో శుక్రవారం వరకు 9 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఇప్పుడు మరో మూడు జిల్లాలు చేర్చారు. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ను ఈ లిస్టులో కొత్తగా చేర్చారు. ఇంకా ముప్పు తొలగిపోలేని ప్రజలు అప్రమతంగా ఉండాలని సూచించారు.
అల్పపీడన ప్రభావంతో ఇంకో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటోంది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి.
అసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆదివారం ఉదయం 8.30 వరకు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ఈ 5 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. గడిచిన 16 గంటల్లో ఆసిఫాబాద్ జిల్లా రవీంద్రనగర్‌లో అత్యధికంగా 25.5 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వంకులంలో 17, కౌతాలలో 14.8 మిల్లీమీటర్ల వాన పడింది.
ALSO READ: ఐసీఎస్ఈ పదో తరగతి, ఐఎస్ సీ 12వ తరగతి ఫలితాలువిడుదల
ఏపీలోనూ భారీ వర్షాలు కుమ్మేస్తున్నాయి. గోదావరి చాలా మహోగ్రంగా ప్రవహిస్తోంది. లోతట్టు గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. దేవీపట్నంలో పోచమ్మ ఆలయం నీట మునిగింది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ఉరకలేస్తోంది. పరిసరప్రాంతాల ప్రజలను భయపెడుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాల్లోని 36 గ్రామాలకు రాకపోకలు లేవు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3 లక్షల 20 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. కృష్ణానదికి కూడా వరదనీరు పోటెత్తుతోంది.
ఇప్పటికే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో విస్తారంగా వర్షాలు పడుతుంటే.. 28న మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందంటోంది వాతావరణ శాఖ. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షపాతం పడే ఛాన్స్ ఉందని చెప్పింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తోంది.
ALSO READ: నీట మునిగిన పోలవరం నిర్వాసిత గ్రామాలు