(Source: ECI/ABP News/ABP Majha)
Rains In Telugu States: నిన్నటి వరకు వెలవెల- నేడు కళకళ- తెలుగు రాష్ట్రాల్లో నిండు కుండల్లా జలాశయాలు
గోదావరి బేసిన్‌లో వరద ఉదృతి గంట గంటకు పెరుగుతోంది. కడెం నుంచి సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) బ్యారేజీ వరకు అన్ని ప్రాజెక్టులు, బ్యారేజీల గేట్లు ఎత్తి నీటిని నదిలోకి వదులుతున్నారు.
పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతన్నాయి. మరో రెండు రోజుల వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వర్షాల ఎఫెక్ట్‌తో దేశంలో నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, గోదావరి బేసిన్‌లోని అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. కృష్ణానదిలో వరదతో కర్నాటకలోని ఆల్మట్టి ప్రాజెక్టు మంగళవారం ఉదయానికే 60 శాతం నిండింది. 129.72 టీఎంసీల కెపాసిటీ ఉన్న ఈ ప్రాజెక్టులో 74.22 టీఎంసీల నీళ్లు చేరాయి. ప్రస్తుతం ఆల్మట్టిలోకి 1.16 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. తుంగభద్రకు 72 వేల క్యూసెక్కులు, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల్లోకి 9 వేల క్యూసెక్కుల చొప్పున ప్రవాహం వస్తోంది. బుధవారానికి ఈ ప్రాజెక్టు మూడు వంతులు నిండనుంది.
శ్రీరాం సాగర్‌కు పెరిగిన వరద
గోదావరి బేసిన్‌లో వరద ఉదృతి గంట గంటకు పెరుగుతోంది. కడెం నుంచి సమ్మక్క సాగర్ (తుపాకులగూడెం) బ్యారేజీ వరకు అన్ని ప్రాజెక్టులు, బ్యారేజీల గేట్లు ఎత్తి నీటిని నదిలోకి వదులుతున్నారు. శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. ఈ ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 90.31 టీఎంసీలు కాగా ఇప్పటి వరకు 65 టీఎంసీల నీరు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 40 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. మేడిగడ్డ వద్ద 5.72 లక్షల క్యూసెక్కులు, తుపాకులగూడెం దగ్గర 7.29 క్యూసెక్కులు వస్తోంది. దుమ్ముగూడానికి అత్యధికంగా 7.55 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. గోదావరి బేసిన్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో భద్రాచలం దగ్గర మళ్లీ నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నదీ తీర ప్రాంతానికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలని సూచిస్తున్నారు.
బీమా నది నుంచి జూరాలకు వరద
ప్రియదర్శని జూరాల ప్రాజెక్టుకు మంగళవారం భీమ నది నుంచి స్వల్పంగా వరద ప్రారంభమైంది. కర్ణాటక చిత్తాపూర్ తాలూకా భీమానది పై ఉన్న సనత్ బ్యారేజ్ నుంచి 7 వేల క్యూసెక్కుల నీరు జూరాలకు చేరుతోంది. వర్షాల కారణంగా మరో 3 వేల క్యూసెక్కులు చేరి మొత్తంగా జూరాలకు 10 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు వద్ద వాటర్ లెవెల్ 318.01 ఉండగా.. నెట్టెంపాడు లిఫ్ట్‌కు 750 క్యూసెక్కులు, బీమా లిఫ్టు–1కి 1300 క్యూసెక్కులు, బీమా లిఫ్టు–2కి 750 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ కు 640 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు..
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు నాలుగు రోజులు ఇదే పరిస్థితి కొనసాగ నుంది. తెలంగాణలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు వాతవరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలెర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.
ఏపీ విషయానికొస్తే అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.