Harish Rao Irrigation Department Challenge: 3 నెలలు ఇరిగేషన్ శాఖ అప్పగించు నీళ్లు ఎలా తేవాలో చూపిస్తా - సీఎం రేవంత్‌కు హరీష్ రావు సవాల్
Harish vs Revanth Kaleshwaram Row: కాళేశ్వరం వివాదంపై బీఆర్ఎస్ హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని కౌంటర్ సవాల్ విసిరారు. మూడేళ్లు అవసరం లేదని మూడు నెలల పాటు ఇరిగేషన్ శాఖ అప్పగించాలన్నారు.

Telangana Assembly BRS Joint Session Debate: కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు, సవాళ్లకు బీఆర్ఎస్ పక్షాన మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీష్ రావు అంతే ఘాటుగా తిరుగులేని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలను, మిడిమిడి జ్ఞానంతో కూడిన ఆరోపణలను సాంకేతిక ఆధారాలతో కడిగిపారేశారు. రేవంత్ రెడ్డి ప్రజా భవన్ వేదికగా విసిరిన సవాల్‌ను స్వీకరిస్తూనే, ఒక సంచలన ఆఫర్‌ను సీఎం ముందుంచారు. "రేవంత్ రెడ్డి.. నీకు ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడటానికి కేసీఆర్ దాకా అవసరం లేదు. కేవలం మూడు నెలల పాటు ఇరిగేషన్ శాఖను నాకు అప్పగించు. నిబంధనల ప్రకారం, క్షేత్రస్థాయి ఇంజనీరింగ్ పద్ధతుల్లో నీళ్లు ఎలా ఎత్తిపోయాలో, రైతులకు నీళ్లు ఎలా తేవాలో నేను ప్రాక్టికల్‌గా చూపిస్తా" అంటూ హరీష్ రావు ఛాలెంజ్ విసిరారు.
తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేవని సిడబ్ల్యూసీ లేఖ
కాంగ్రెస్ హయాంలోని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ఆనాడు తుమ్మిడిహట్టి వద్దే బ్యారేజీ ఎందుకు కట్టలేదో వివరిస్తూ కేంద్ర జల సంఘం రాసిన అధికారిక లేఖలను ఆయన మీడియా ముందుంచారు. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర తదితర ప్రాంతాల నీటి అవసరాలు, వినియోగం నేపథ్యంలో తుమ్మిడిహట్టి వద్ద తగినంత నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం ఆనాడే అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టంగా మూడు లేఖలు రాసిందని హరీష్ రావు గుర్తుచేశారు. ఆ లేఖల ఆధారంగానే అక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే నీరు రాదని తేలిపోయిందని, కేంద్ర ప్రభుత్వమే ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పిన తర్వాత కూడా ఇంకా తుమ్మిడిహట్టి జపం చేయడం కాంగ్రెస్ నేతల అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్..🔥
— YSR (@ysathishreddy) July 8, 2026
నీకు కేసీఆర్ అవసరం లేదు..
నేను చాలు… pic.twitter.com/3Spqpck8Mg
కిరణ్ కుమార్ రెడ్డికి మహారాష్ట్ర నో
ఆనాడు ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డికి.. తుమ్మిడిహట్టి దగ్గర 148 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ కట్టడానికి తాము ఎంతమాత్రం ఒప్పుకోబోమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా లేఖ రాశారు. ఆ చారిత్రక సత్యాలను దాచిపెట్టి రేవంత్ రెడ్డి ఇంకా ఎంతకాలం అబద్ధాలు చెప్తారు అని హరీష్ రావు నిలదీశారు. కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు చేసుడు మానుకోవాలని హరీష్ రావు హితవు పలికారు. కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో, రీసెర్చ్ చేసి మేడిగడ్డ వద్ద నీటి లభ్యత పుష్కలంగా ఉంటుందని నిర్ధారించుకున్న తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టును రీడిజైన్ చేసిందని సమర్థించుకున్నారు. కట్టిన ఏడాది నుంచే సమస్యలు వచ్చాయని సీఎం అనడం హాస్యాస్పదమని, వరద తీవ్రత వల్ల సాంకేతిక లోపాలు వస్తే వాటిని యుద్ధప్రాతిపదికన రిపేర్ చేసి రైతులకు నీరివ్వాల్సింది పోయి.. ప్రాజెక్టును పూర్తిగా పక్కనబెట్టేసి రాజకీయం చేయడానికే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తోందని ధ్వజమెత్తారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టును నిలబెట్టాలనే చిత్తశుద్ధి రేవంత్ సర్కార్‌కు ఉంటే.. ఎన్డీఎస్ఏ గైడ్‌లైన్స్ సాకుతో కాలయాపన చేయకుండా వెంటనే పంపింగ్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ సిద్ధం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అసెంబ్లీ జాయింట్ సెషన్ చర్చకు బీఆర్ఎస్ పూర్తిగా సిద్ధంగా ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. మేము పారిపోయేవాళ్లం కాదు. నువ్వు స్పీకర్‌కు లేఖ రాసి రేపే తేదీ ఖరారు చేయి. అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన మోసాలను, అబద్ధాలను ఆధారాలతో సహా తెలంగాణ ప్రజల ముందు ఉంచుతాం అని తేల్చి చెప్పారు. తాము చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నేతలు తమను ఆర్థిక ఉగ్రవాదులు అంటూ నీచమైన పదజాలంతో దూషిస్తున్నారని, కానీ ప్రజల హృదయాల్లో కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయని హరీష్ రావు ముగించారు. ఈ కౌంటర్ ఛాలెంజ్‌తో తెలంగాణలో ఇరిగేషన్ పాలిటిక్స్ మరింత హీటెక్కాయి.
ట్రెండింగ్ వార్తలు






















