Telangana మెడికల్ కాలేజీలపై ఇప్పుడు కమిటీ వేయడం హాస్యాస్పదం: రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శలు
Medical Colleges in Telangana | తెలంగాణలోని మెడికల్ కాలేజీలపై సీఎం రేవంత్ రెడ్డి నేడు కమిటీ వేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు సెటైర్లు వేశారు. కాలేజీలను భ్రష్టు పట్టించారని విమర్శించారు.

Telangana Medical Colleges | హైదరాబాద్: చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవితవ్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రశ్నార్థకంగా మారడం అత్యంత శోచనీయం అన్నారు. 26 మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు, వసతులు నిబంధనలకు అనుగుణంగా లేవని జూన్ 18 న హెల్త్ సెక్రటరీ, డిఎంఇ నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలని నోటీసులు ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం అన్నారు.
‘ఇంత ముఖ్యమైన విషయంపై ఆలస్యంగా మేల్కొన్న సీఎం రేవంత్ రెడ్డి నేడు కమిటీ వేయడం హాస్యాస్పదం. పరిపాలన గాలికి వదిలేసి ప్రతీకార రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. 26 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో చదువుతున్న వందల మంది విద్యార్థుల భవిష్యత్తుకు ఎవరు భరోసా? ఇస్తారు. మీ పరిపాలన వైఫల్యం మెడికల్ విద్యార్థులకు శాపంగా మారుతోంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ తెలంగాణ ప్రభుత్వానికి పంపిన లేఖను మీకు పంపిస్తున్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరిచి 26 మెడికల్ కాలేజీల భవితవ్యాన్ని కాపాడండి. తక్షణమే మెడికల్ కళాశాలలకు కావాల్సిన నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి . ఎంతో శ్రమించి డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకునే విద్యార్థులు జీవితాలను నిలబెట్టండి’ అని తెలంగాణ ప్రభుత్వాన్ని హరీష్ రావు కోరారు.
చేతులు కాలినంక ఆకులు పట్టిన చందంగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు.
— Harish Rao Thanneeru (@BRSHarish) June 16, 2025
బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవితవ్యం @revanth_anumula పాలనలో ప్రశ్నార్థకంగా మారడం అత్యంత శోచనీయం.
26 మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు, వసతులు నిబంధనలకు అనుగుణంగా లేవని,… pic.twitter.com/sFvsGPBYxa
కళాశాలల్లో క్షేత్ర స్థాయి పరిశీలనకు అధికారులతో కమిటీ
హైదరాబాద్: తెలంగాణలో 34 మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయి వసతులతో పని చేయాలని, ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను వెంటనే తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ ప్రతి కళాశాలను సందర్శించి అక్కడ ఏం కావాలి... నిధులు ఎంత కావాలి.. తక్షణమే పూర్తి చేయాల్సిన పనులు... సర్కార్ అందించాల్సిన సహాయం వివరాలతో నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
వైద్యారోగ్య శాఖపై సీఎం ఏ.రేవంత్ రెడ్డి ఐసీసీసీలో సోమవారం ఆ శాఖ అధికారులతో సమీక్షించారు. జాతీయ వైద్య మండలి (NMC) రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలకు సంబంధించి లేవనెత్తిన పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నియామకాలు, బోధన సిబ్బందికి ప్రమోషన్లు, వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో పడకల పెంపు, అవసరమైన వైద్య పరికరాలు, ఖాళీల భర్తీపై సమగ్ర నివేదిక రూపొందించి అందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సిన నిధులను వెంటనే విడుదల చేస్తామన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి నిధులు, అనుమతులకు సంబంధించిన అంశాలుంటే వెంటనే తెలియజేయాలని, కేంద్ర మంత్రి నడ్డా, ఆ శాఖ అధికారులను సంప్రదించి వాటిని పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
నర్సింగ్ కళాశాలల్లో జపాన్ భాషను ఒక ఆప్షనల్‌గా నేర్పించాలని, మన నర్సింగ్ సిబ్బందికి జపాన్‌లో డిమాండ్ ఉందని సీఎం తెలిపారు. మనకు మద్దతు ఇచ్చేందుకు జపాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారిని పరీక్షించే వైద్యులు, ఆసుపత్రుల సమయాల పర్యవేక్షణకు ఒక యాప్‌ను తీసుకురావడంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి నెలా మూడో వారంలో విద్యా, వైద్య రంగాల శాఖలపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు.






















