Telangana News : పేద మైనార్టీలకూ రూ. లక్ష - గుడ్ న్యూస్ చెప్పిన హరీష్ రావు
మైనార్టీలకూ లక్ష సాయం అందిస్తామని హరీష్ రావు ప్రకటించారు. హైదరాబాద్‌లో మైనార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఈ ప్రకటన చేశారు.
Telangana News : తెలంగాణలోని మైనార్టీలకు మంత్రి హరీశ్‌రావు గుడ్‌న్యూస్ చెప్పారు. పేద మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందిస్తుందని తెలిపారు. బ్యాంకులతో సంబంధం లేకుండా దీన్ని అందజేస్తామని చెప్పారు. ఆర్థికసాయంపై ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారన్నారు. దీనిపై రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ అవుతాయని హరీశ్ తెలిపారు. ఇప్పటికే బీసీ వర్గాలకు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఎస్సీ వర్గాలకు దళిత బంధు కింద రూ.పది లక్షలు ఇస్తున్నారు. దీంతో మైనార్టీ వర్గాలు కూడా తమకేదీ సాయం అని ప్రశ్నిస్తూండటంతో ప్రభుత్వం ఈ సాయం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికీ బీసీ కులవృత్తి దారులకు రూ. లక్ష సాయం
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బీసీ కులవృత్తిదారులకు రూ. లక్ష ఆర్థిక సాయం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయం పంపిణీని ప్రారంభించారు. ఈ పథకం కింద భారీగా దరఖాస్తులు రావడంతో వాటిని పరిశీలించి ప్రతి నెలా 15వ తేదీన విడతల వారీగా సాయం పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా తొలివిడత కింద జూలై 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానిక శాసనసభ్యుల చేతుల మీదుగా ఆర్థిక సాయానికి ఎంపికైన వారికి చెక్కులు పంపిణీ చేశారు.
ఐదు లక్షల మందికిపైగా దరఖాస్తు
బీసీ కులవృత్తిదారులకు ఆర్థిక సాయం కింద రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని మండల స్థాయిలో పరిశీలించి అర్హతలను నిర్ధారించాలని ప్రభుత్వం సంబంధిత అధికారు లను ఆదేశించింది. ఈ క్రమంలో అధికారులు వీలైనన్ని దరఖాస్తులను పరిశీలించి జాబితాలను జిల్లా కలెక్టర్లకు అందించారు. తొలివిడత కార్య క్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభు త్వం రూ.400 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ డబ్బుతో ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకు సగటున 335 మంది లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున సాయం ఆదించవచ్చని అంచనా వేశారు.
వచ్చే నెలలోనే మైనార్టీలకు రూ. లక్ష సాయం పథకం ప్రారంభమయ్యే అవకాశం
దళితులకు దళిత బ ంధు కింద రూ. పది లక్షలు ఇస్తూండటంతో బీఆర్ఎస్‌లోని మైనార్టీ ప్రజా ప్రతినిధులు కూడా ఎన్నికలు వస్తున్నందున తమ వర్గానికి కూడా ఇలాంటి పథకం అమలు చేయాలని కోరారు. చివరికి కేసీఆర్ పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విధి విధానాలను ఖరారు చేస్తున్నారు. మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేస్తామని హరీష్ రావు ప్రకటించారు. వచ్చే నెలలోనే పథకం అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.