Kishan Reddy : తెలంగాణలో అధికారంలోకి వస్తే మతపర రిజర్వేషన్లు ఎత్తేస్తాం- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
Kishan Reddy : తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోసి బీజేపీ ప్రభుత్వం వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
Kishan Reddy : ఉద్యమాల పురిటి గడ్డ ఓరుగల్లు గడ్డ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హనుమకొండలో నిర్వహించిన బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందన్నారు. సీఎం కేసీర్ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం అని విమర్శించారు. తెలంగాణకు ఎప్పటికప్పుడు కేంద్రం నిధులిస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని వేల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. తెలంగాణలో రహదారుల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు. వరంగల్ నుంచి జగిత్యాల వరకు 4 వరుసల రహదారుల నిర్మాణం కోసం రూ.4 వేల కోట్ల పైగా ఖర్చు చేస్తున్నామన్నారు. వరంగల్ నుంచి ఖమ్మం వరకు 4 వరుసల రహదారుల నిర్మాణం కోసం రూ.3360 కోట్లు కేటాయించామన్నారు. రూ.20,000 కోట్ల పైగా కేవలం రోడ్ల నిర్మాణం కోసమే బీజేపీ ఖర్చు చేస్తోందని కిషన్ రెడ్డి అన్నారు.
వరంగల్ లో గిరిజన విశ్వవిద్యాలయం
"రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని మోదీదే. వేయి స్తంభాల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నాం. వేయి స్తంభాల గుడిలో మంటపం కూలిపోతే... ఇప్పటి వరకు కేసీఆర్ పట్టించుకోలేదు. డిసెంబర్ లోపు వేయి స్తంభాల గుడిలో మంటపం నిర్మిస్తాం. వరంగల్ పోర్టుకు రూ.5 కోట్లు కేటాయించాం. కాజీపేటలో రైల్వే ఒరాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటు కోసం కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకూ భూమి కేటాయించలేదు. తెలంగాణలో డిఫెన్స్ కు సంబంధించిన సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నాం. రూ.800 కోట్లతో వరంగల్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం. హెరిటేజ్, స్మార్ట్, అమృత్ సిటీ లను ఈ ప్రాంతానికి ఇచ్చాం. రూ.200 కోట్లతో 'MSME Technical Center' ఏర్పాటు చేస్తాం అంటే.. గత 3 సంవత్సరాలుగా భూమి కూడా ఇవ్వలేదు. "- కిషన్ రెడ్డి , కేంద్ర మంత్రి
కేసీఆర్ ఫామ్ హౌజ్ ను వీడింది లేదు.. వరంగల్ ను అభివృద్ధి చేసింది లేదు. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ ఏమైందో అందరికీ తెలుసు.
— BJP Telangana (@BJP4Telangana) August 27, 2022
- శ్రీ @kishanreddybjp #JPNaddaInOrugallu
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు
వరంగల్ జిల్లాకు కేసీఆర్ ఎంత ఖర్చు పెట్టారో సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం ఇస్తున్న నిధులపై చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. కేసీఆర్ కళ్లుంటే చూడు, చెవులు ఉంటే విను, కాళ్లు ఉంటే తిరుగు కేంద్రం చేసిన అభివృద్ధి తెలుస్తోందన్నారు. కేసీఆర్ నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోస్తే... బీజేపీ ప్రభుత్వం వస్తుందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజనులకు 10% రిజర్వేషన్లు ఇస్తామన్నారు. మతపరమైన రిజర్వేషన్లు ఎత్తేస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి, ఆ కుటుంబాన్ని ఫార్మ్ హౌజ్ కే పరిమితం చేస్తామన్నారు.
Also Read : JP Nadda : కేసీఆర్ నయా నిజాం, వచ్చే ఎన్నికల్లో చుక్కలు చూపిస్తాం - జేపీ నడ్డా
Also Read : Praja Samgrama Yatra : ముగిసిన బండి సంజయ్ పాదయాత్ర, జేపీ నడ్డాతో కలిసి భద్రకాళి అమ్మవారి దర్శనం