Telangana Govt Vs Governer : ఎంపీ అర్వింద్‌కు ఫోన్ చేసి దాడిపై వాకబు చేసిన గవర్నర్ తమిళిశై ! ప్రభుత్వంతో పెరుగుతున్న దూరం.. బెంగాల్ తరహా పరిస్థితులు వస్తాయా ?
దాడికి గురైన ఎంపీ అర్వింద్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు గవర్నర్ తమిళిశై. రాజ్ భవన్ లో గణతంత్ర వేడుకల్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఇప్పుడు బీజేపీ ఎంపీకి గవర్నర్ ఫోన్ చేసి పరామర్శించడం కొత్త చర్చకు కారణం అవుతోంది.
తెలంగాణ ప్రభుత‌్వం, గవర్నర్ మధ్య దూరం అంతకంతకూ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా గవర్నర్ తమిళిశై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు ఫోన్ చేశారు. రెండు రోజుల కిందట తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఎంపీ అర్వింద్‌పై దాడి జరిగింది. ఈ దాడి ఘటనపై ఆరా తీశారు. దాడి వివరాలతో పాటు నిజామాబాద్ సీపీ, పోలీస్ ల తీరును గవర్నర్ కు ఎంపీ వివరించారు. పోలీసుల పర్యవేక్షణలో తన హత్యకు ప్లాన్ జరిగిందని, ముందస్తు సమాచారం ఇచ్చినా రౌడీ మూకలను అదుపు చేసే ప్రయత్నం జరగలేదని అర్వింద్ వివరించినట్లుగా తెలుస్తోంది. సొంత నియోజకవర్గంలో పోలీసులు కనీస భద్రత కల్పించలేదని గవర్నర్ కు ఎంపీ అర్వింద్ ఆరోపిస్తున్నారు.
బీజేపీ ఎంపీకి గవర్నర్ నేరుగా ఫోన్ చేసి దాడి ఘటనపై ఆరా తీయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే రిపబ్లిక్ డే రోజున గవర్నర్‌తో కలిసి వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. కనీసం మంత్రులను కూడా పంపలేదు. సాధారణంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్ని పరేడ్ గ్రౌండ్ లేదా పబ్లిక్ గార్డెన్‌లో నిర్వహిస్తూ ఉంటారు. ఈ సారి మాత్రం రాజ్‌భవన్‌కే పరిమితం చేశారు. సాధారణంగా రాష్ట్ర ప్రగతిపై ప్రభుత్వం అందించే గణాంకాలను గవర్నర్ చదువుతుంటారు. ప్రతీ చోటా అదే జరుగుతుంది. ఏపీలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ప్రసంగించిన గవర్నర్ బిశ్వభూషణ్.. కొత్త జిల్లాల గురించీ కూడా ప్రస్తావించారు. కానీ తెలంగాణ గవర్నర్ ప్రసంగం మాత్రం భిన్నంగా సాగింది.
గవర్నర్ తన ప్రసంగంలో ప్రధాని మోదీని రెండు సార్లు పొగిడారు. మోదీ దూరదృష్టి కారణంగా దేశం వివిధ రంగాల్లో దూసుకెళుతోందని ప్రశంసించారు. ప్రధాని నిరంతర శ్రమ వల్ల ప్రపంచంలోనే భారత్‌ను ఒక ముఖ్యమైన శక్తిగా పరిగణిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గురించి పెద్దగా ప్రస్తావించలేదు. రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకలకు మంత్రుల్ని కూడా పంపకపోవడం రాజ్‌భవన్‌తో తెలంగాణ సర్కార్‌కు పెరిగిన దూరానికి సాక్ష్యంగా అంచనా వేస్తున్నారు.
బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లు రాజకీయంగా యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఇంత కాలం తమిళిశై మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడా వ్యాఖ్యలు చేయలేదు. రెండు , మూడు సార్లు అభినందించారు కూడా. ఇప్పుడు బీజేపీతో యుద్ధం అనే స్ట్రాటజీని ఎంచుకున్న కేసీఆర్ దూరం పాటిస్తున్నట్లుగా భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే గవర్నర్ రాజకీయ దాడుల విషయంలో పరామర్శలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ముందు ముందు విభేదాలు తీవ్రమైతే గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా మారే పరిస్థితి రావొచ్చంటున్నారు.