Gouravelli Project : గౌరవెల్లి నిర్వాసితులపై లాఠీఛార్జ్, డీజీపీని నివేదిక కోరిన హెచ్ఆర్సీ
Gouravelli Project : గౌరవెల్లి రిజర్వాయర్ నిర్వాసితులపై లాఠీఛార్జ్ ఘటనపై రాష్ట్ర హెచ్ఆర్సీ సీరియస్ అయింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి ఆగస్టు 4 లోపు నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించింది.
Gouravelli Project : గౌరవెల్లి రిజర్వాయర్ భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీఛార్జ్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. బీజేపీ లీగల్ సెల్ నాయకుడు, న్యాయవాది కరుణా సాగర్ ఆధ్వర్యంలో బుధవారం గౌరవెల్లి బాధితుల పిటిషన్ దాఖలు చేశారు. గౌరవెల్లి ఘటనపై సమగ్ర విచారణ జరపాలని మానవహక్కుల సంఘం డీజీపీని ఆదేశించింది. ఆగస్టు 4వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని సూచించింది. పిటీషనర్లకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు అందిన నేపథ్యంలో వారికి పూర్తి రక్షణ కల్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
అసలేం జరిగింది?
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవెల్లి, గండిపేల్లి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులపైన పోలీసులు అక్రమ లాఠీ ఛార్జ్ చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. జూన్ 13వ తేదీ (సోమవారం) అర్ధరాత్రి దాటిన తర్వాత 3 గంటల ప్రాంతంలో దాదాపు 500 మంది బలగాలతో గుడాటిపల్లిలో ప్రవేశించిన పోలీసులు ఆ గ్రామంలో కరెంట్ కట్ చేసి ప్రతి ఇంటిలోకి దౌర్జన్యంగా దూరి విచక్షణా రహితంగా లాఠీఛార్జ్ చేశారన్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులు అని చూడకుండా పోలీసులు దాడి చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. స్తీలు, ఆడపిల్లలపై మగ పోలీసులు అసభ్యంగా ప్రవర్తిచారని, స్త్రీలను అరెస్టు చేసే విషయంలో మహిళా పోలీసులు ఉండాలన్న కనీస నిబంధనను పాటించలేదని తెలిపారు. పోలీసుల దాడిలో చాలా మంది గాయపడ్డారని గ్రామస్థులు తెలిపారు. మరుసటి రోజు అంటే 14.06.2022 నాడు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే టీఆర్ఎస్ కార్యకర్తల్ని ఉసిగొల్పారని, పోలీసులు వచ్చి కాపాడాల్సింది పోయి తమ పైనే మళ్లీ లాఠీ ఛార్జ్ చేశారని బాధితులు వాపోయారు. పోలీసుల దాడిలో చాలా మంది గాయపడ్డారన్నారు.
‘‘మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తే మేము ప్రాజెక్ట్ కు వ్యతిరేకం కాదు. మాకు దక్కాల్సిన పరిహారం మాకు ఇప్పించాలని ఆ గ్రామ ప్రజలు చెప్పిన పోలీసులు పట్టించుకోకుండా విచక్షణ రహితంగా కొట్టారు. భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ వర్తింప చేసిన తర్వాతనే ట్రయల్ రన్ చేయాలని గౌరవ హైకోర్టు కూడా ఆదేశించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై గ్రీన్ ట్రిబ్యునల్ కూడా స్టే ఇచ్చింది. నిర్వాసితులకు రావాల్సిన పరిహరం ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని పోలీసు దాడులతో బెదిరించి గ్రామాలను ఖాళీ చేయించాలని అనుకుంటోంది. దాదాపు వెయ్యి మందికి పైగా భూ నిర్వాసితులకు న్యాయం కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద కొంత మంది మైనర్లు.. మేజర్లు అయ్యారు, వృద్ధులకు అందవాల్సిన ప్యాకేజ్ లు అందలేదు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాలేదు. ఇలా భూ నిర్వాసితుల సమస్యలు ఇంకా పరిష్కరం కాలేదు.’’ గ్రామస్థులు
గవర్నర్ కు ఫిర్యాదు
ఈ విషయాన్ని బీజేపీ నాయకులు గవర్నర్ తమిళి సై దృష్టికి తీసుకెళ్లారు. భూ నిర్వాసితులపైన లాఠీ ఛార్జ్ చేసిన పోలీస్ అధికారులను గుర్తించి వారి పైన చర్యలు తీసుకునేలాగా రాష్ట్ర డీజీపీని ఆదేశించాలని విజ్ణప్తి చేశారు. అదేవిధంగా భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇచ్చి వారి సమస్యలను పరిష్కరించి గౌరవెల్లి, గండిపెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని తెలంగాణ బీజేపీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.