Former DSP Nalini: సీఎం రేవంత్‌ను కలిసిన మాజీ డీఎస్పీ నళిని- ఎవరూ బాధపడొద్దు, సాయం చేయాలని రిక్వెస్ట్
Telangana News : వేద ప్రచారానికి సాయం చేయాలని మాజీ డీఎస్పీ నళిని సీఎం రేవంత్ ను కోరారు. తనకు ఉద్యోగం అవసరం లేదని స్వయంగా కలిసి చెప్పారు.
Former DSP Nalini met CM Revanth : మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు. నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు. నళిని మాత్రం తిరిగి ఉద్యోగంలో చేరేందుకు సుముఖంగా లేరు.
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తరవాత మాజీ డీఎస్పీ నళిని మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పుడు తనకు ఉద్యోగం అవసరం లేదని స్పష్టం చేశారు. డబ్బు, భౌతిక ప్రపంచం నుంచి బయట పడ్డాను… ఇప్పుడు తనది ఆధ్యాత్మిక మార్గమని తెలిపారు. వేద కేంద్రాలకు ప్రభుత్వ సహకారం అడిగాను.. సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలోనే వేదం, యజ్ఞం పుస్తకాలు పూర్తి చేస్తున్నా. సనాతన ధర్మ ప్రచారానికి పనిచేస్తా.. గతంలో నేను, తోటి ఉద్యోగులు.. డిపార్ట్మెంట్‌లో ఎదుర్కొన్న సమస్యలపై సీఎంకు రిపోర్ట్ ఇచ్చానని తెలిపారు. తనలా ఎవరూ బాధపడవద్దన్నదే తన అభిప్రాయమన్నారు.
ఇప్పుడు బ్యురొక్రసి మీద నమ్మకం పోయింది… అందుకే ఆధ్యాత్మిక బాటలో నడుస్తున్నా.. నాకు జరిగిన అన్ని విషయాలు.. సీఎం దృష్టికి తీసుకెళ్లాను. నా మనసుకు నచ్చిన సేవ చేస్తున్నాను. ఇన్నాళ్ల నా మనొవ్యధను ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషంగా ఉందని నళిని తెలిపారు. గతంలో ఆమె రెండు సార్లు సోషల్ మీడియాలో స్పందించారు. జీవితంలో సర్వస్వం కోల్పోయిన తాను.. ఇప్పుడు మరో మార్గం ఎంచుకున్నానని దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడని చెప్పుకొచ్చారు. వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారని అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నానన్నారు.
వేద ప్రచారకురాలిగా, వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం. ఉద్యోగం అవసరం లేదు కానీ ధర్మ ప్రచారానికి ఉపయోగ పడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాన్నారు. ఆ సాయం కోసం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నళిని తెలంగాణ ఉద్యమ సమయంలో డీఎస్పీగా ఉన్నారు. ఉద్యమంలో భాగంగా ఉద్యమానికి రాజీనామా చేశారు. తర్వాత రోశయ్య హయాంలో ఉద్యోగం ఇచ్చినా అనేక రకాల వేధింపులకు గురి కావడంతో రాజీనామా చేశారు. తర్వాత బీజేపీలో చేరారు కానీ.. రాజకీయంగా కూడా కలసి రాకపోవడంతో ఆమె అధ్యాత్మిక మార్గంలోకి వెళ్లారు. రేవంత్ సీఎం అయ్యాక ఉద్యమకారులందరూ ఆమెను గుర్తు చేసుకోవడంతో మళ్లీ వెలుగులోకి వచ్చారు. అధ్యాత్మక మార్గంలో ఉన్నట్లుగా అందరికీ వివరించారు.