Bhadrachalam: మంత్రి కేటీఆర్ పర్యటనలో విషాదం- నాలాలో పడి మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి
Bhadrachalam: మంత్రి కేటీఆర్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఓ మహిళా హెడ్ కానిస్టేబుల్ డ్యూటీ పూర్తైన తర్వాత తిరిగి వెళ్తుండగా నాలాలో పడి మృతి చెందింది.
Bhadrachalam: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనలో విషాదం చోటుచేసుకుంది. కేటీఆర్ పర్యటనలో విధులు నిర్వర్తించి తిరిగి వెళ్తూ మహిళా హెడ్ కానిస్టేబుల్ మృతి చెందింది. శ్రీదేవి అనే మహిళా హెడ్ కానిస్టేబుల్ కొత్తగూడెంలో విధులు నిర్వహిస్తోంది. అయితే కేటీఆర్ పర్యటన సందర్బంగా భద్రతా చర్యల్లో భాగంగా ఆమె డ్యూటీ చేసేందుకు భద్రాచలం వచ్చారు. విధులు ముగిసిన అనంతరం భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. అనంతరం దేవాలయం దగ్గర ఉన్న అన్నదాన సత్రంలో భోజనం చేసేందుకు వెళ్తుండగా ప్రమాదవశాత్తూ నాలాలో పడి శ్రీదేవి మరణించారు.
అన్నదాన సత్రం ఎదురుగా ఉన్న నాలాలో శ్రీదేవి పడిపోగా.. వెంటనే స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెస్కూ ఆపరేషన్ చేపట్టారు. అలాగే పోలీసలు కూడా రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఘటనా స్థలం నుంచి కొద్ది దూరంలో ఉన్న వరద కాలువలో ఆమె మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. శ్రీదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భద్రాచలంలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం పూర్తైన తర్వాత శ్రీదేవి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందించారు.
శ్రీదేవి మృతితో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమెతో విధులు నిర్వర్తించిన తోటి ఉద్యోగులు ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పటివరకు తమతో కలిసి డ్యూటీ చేసిన హెడ్ కానిస్టేబుల్.. ఇక లేరనే విషయాన్ని తెలుసుకుని బాధపడ్డారు. శ్రీదేవి భర్త రామారావు కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే పనిచేస్తున్నారు. స్పెషల్ పార్టీ కానిస్టేబుల్‌గా ఆయన ఉన్నారు. భార్య మరణం భర్త రామారావుకు తీరని విషాదాన్ని మిగిల్చింది. శ్రీదేవి మృతికి పోలీసులు సంతాపం ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం శ్రీదేవి కొత్తగూడెం పోలీస్ కంట్రోల్ రూంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. తోటి ఉద్యోగులు ఆమె మృతితో దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీకి వెళ్లిన ఆమెకు ఇలా జరుగుతుందని ఊహించలేదని చెబుతున్నారు.
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్
ఇవాళ ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లాకారం ట్యాంక్‌బండ్‌పై రూ.1.37 కోట్లతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించగా.. దీనిని ఇవాళ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం అక్కడ జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం తనకు దక్కడం నిజంగా అదృష్టమని వ్యాఖ్యానించారు. తారకరామారావు పేరులోనే పవర్ ఉందని, తనకు ఆ పేరు పెట్టడం సంతోషకరంగా ఉందని అన్నారు. ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ సత్తాను దేశానికి తెలియజేసేలా చేశారని అన్నారు. తెలుగువారు ఉన్నారని దేశానికే తెలియచేసేలా ఎన్టీఆర్ చేశారని కొనియాడారు. అలాగే విగ్రహాం వద్ద ఎన్టీఆర్ పార్కును కూడా కేటీఆర్ ప్రారంభించారు. తెలుగువారందరికీ ఎన్టీఆర్ ఆరాధ్యదైవమని, ప్రజల మనస్సుల్లో చెరగమని ముద్ర వేశారని ప్రశంసించారు. ఎన్టీఆర్ లాంటి మహానీయుల స్థానం చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా ఉంటుందని, తెలుగుజాతి ఉన్నతకాలం ఆయన మన మధ్యలోనే ఉంటారని అన్నారు.