News
News
X

Khasim Rizvi:హైదరాబాద్ రాజ్యం ఇండియాలో కలిశాక ఖాసీం రజ్వీ ఏమయ్యాడు ?

హైద్రాబాద్ రాజ్యం ఇండియాలో విలీనం అయ్యాక ఖాసీం రజ్వి నాయకత్వంలోని రజాకార్లు చేసిన దురాగతాలు,స్వయంగా రజ్వి పాల్గొన్న నేరాలపై విచారణ ప్రారంభమైంది.

FOLLOW US: 
1947 ఆగస్టు 15 న స్వాతంత్య్రం వచ్చాక కూడా నిజాం రాజ్యం భారత దేశంలో విలీనం కావడానికి సిద్ధం కాలేదు. సొంత రాజ్యంగా ఉండడానికి ప్రయత్నించాడు. చివరకు ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ చర్య తీసుకుంది అప్పటి ప్రభుత్వం. దీంతో నిజాంను లొంగదీసి 1948లో  ఇండియాలో విలీనం అయ్యేలా హైద్రాబాద్ రాజ్యాన్ని ఒప్పించడం ఇదంతా చరిత్ర. అయితే స్వాతంత్య్రం రావడానికి ..హైద్రాబాద్ రాజ్యం .. ఇండియాలో విలీనం అయ్యే మధ్యకాలంలో నిజాం సైన్యంలో ఉంటూ రజాకార్లు సాగించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. వాటిని కథలు కథలుగా చెప్పేవారు నాటి హైదరాబాద్ వాసులు. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాదులతోపాటు, భారతదేశంలో విలీనాన్ని కోరుకునే ప్రతీ ఒక్కరిపై రజాకార్లు సాగించిన రాక్షస కాండ చరిత్రలో నిక్షిప్తమైంది. ఇప్పటికీ రాజకీయ పార్టీలు తమ ప్రత్యర్థులను తిట్టడానికి మీరు రజాకార్ల వంటి వారు అనే పోలికలను తెస్తూ ఉంటారంటే వారి మెదళ్లలో రజాకార్ల అకృత్యాలు ఏ స్థాయిలో నిలిచిపోయాయో  తెలుస్తోంది. అలాంటి  భయంకర మూక రజాకార్ల నాయకుడే ఖాసీం రజ్వీ . అయితే , అతనెవరు ? హైదరాబాద్ రాజ్య విలీనం తరువాత అతనేమయ్యాడు  అనేది చాలామంది ప్రజలకు తెలియదు . 
 
ఉత్తరప్రదేశ్‌లో పుట్టి నిజాం రాజ్యంలో సెటిల్ అయిన ఖాసీం రజ్వి ;
 
అప్పట్లో యునైటెడ్ ప్రావినెన్స్ గా పిలువబడిన ఉమ్మడి  ఉత్తరప్రదేశ్ లో 1902లో పుట్టాడు ఖాసీం రజ్వి . తన అసలు పేరు సయ్యద్ ఖాసీం రజ్వి . అక్కడే అలీఘర్ యూనివర్సిటీలో లా చదువుకున్న ఖాసీం రజ్వి  నాటి హైదరాబాద్ రాజ్యంలోని లాతూర్ (ఇప్పటి మహారాష్ట్ర )లో లా ప్రాక్టీస్ మొదలెట్టాడు. తన మామగారైన అబ్దుల్ హై  నాటి నిజాం రాజ్యంలో డీఎస్పీగా పనిచేసి ఉండడంతో ఆయనకున్న కాంటాక్ట్స్ ద్వారా పెద్దపెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడ్డాయి. అప్పట్లో మజ్లీస్ పార్టీ నాయకుడు బహదూర్ యార్ జంగ్ సమక్షంలో ఆ పార్టీలో చేరాడు రజ్వి. ఆ పార్టీ నిజాంను సపోర్ట్ చేసేది. తనకున్న ఆస్తి మొత్తాన్ని పార్టీకే  అప్పజెప్పేయ్యడంతో హైదరాబాద్ రాజ్యంలోనూ .. మజ్లీస్ -ఇ -ఇత్తహైదుల్  -ముస్లిమీన్ పార్టీ లోనూ ఖాసీం రజ్వీ పేరు మారుమోగిపోయింది.
అదే సమయంలో మజ్లీస్ నేత, నిజాంతో సమానమైన పలుకుబడి కలిగిన నేత అని పేరున్న నవాబ్ బహదూర్ యార్ జంగ్ అకాల మరణం పాలవ్వడంతో మజ్లీస్‌కు కొత్త నాయకుడిగా ఖాసీం రజ్వి ఎదగాలని చూశాడు. అయితే అప్పటి మజ్లీస్‌లోని అంతర్గత పోరాటాల వల్ల అది సాధ్యపడలేదు. దీంతో లాతూరులో తన సొంతపార్టీ గా మజ్లీస్- ఈ-ఇషా-నిజాం-ఓ -నస్క్ అనే పార్టీ స్థాపించాడు. ఈ లోపు 1946లో మజ్లీస్ పార్టీలో జరిగిన గొడవలు, నిజాంతో వచ్చిన విభేదాల కారణంగా మజ్లీస్ లీడర్‌గా ఉన్న వ్యక్తి ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో చక్రం తిప్పిన ఖాసీం రజ్వి మజ్లీస్‌కు నాయకుడు అయ్యాడు . 
 
మొదలైన ఛాందసం -రజాకార్ల ఏర్పాటు :
 
విచిత్రంగా అప్పటి వరకూ కొంత ఉదారవాదిగా పేరుబడ్డ ఖాసీం రజ్వి మజ్లీస్ నాయకుడు అయ్యాక చాంధసుడిగా మారాడు అంటారు చరిత్రకారులు. దానికి కారణం అప్పటికే భారత దేశానికి స్వాతంత్య్రం రాక తప్పదని తెలియడం మరోవైపు హైదరాబాద్ ఇండియాలో విలీనం  చేసి తీరతారనే నమ్మకం ప్రజల్లో చర్చ జరిగేది. నిజానికి నిజాం రాజ్య ప్రజలు కూడా కోరుకున్నది అదే. అయితే దీనిని ఖాసీం రజ్వి తట్టుకోలేక పోయాడు. అధికారం అంటూ ఉంటే తమదే అని బలంగా భావించిన ఖాసీం ఒక ప్రత్యేక మిలీషియా దళాన్ని ఏర్పాటు చేసాడు. దానిపేరు "రజాకార్ ". దాని అర్ధం స్వచ్చందంగా చేరిన కార్యకర్తలు అని. హైదరాబాద్ రాజ్యం బయట నుంచి అంటే ఇండియాలోని ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కాంగ్రెస్ బృందాలను, రాజ్యంలో ఎదుగుతున్న  కమ్యూనిస్ట్ లను ఎదుర్కోవడానికే ఈ రజాకార్లు అని ఖాసీం సమర్ధించుకున్నా ..వారు సామాన్య జనంపై  కూడా దాడులు చేసేవారని చరిత్ర చెబుతోంది.
 
తమకు ఎదురుతిరిగిన వారిని పూర్తిగా అణిచివేయ్యడానికే రజాకార్‌ దళాన్ని వాడేవారట రజ్వీ. వీరి సంఖ్య లక్షల్లో ఉండేదని రజ్వి తరువాతి కాలంలో చెప్పగా.. అంత ఉండదని నిజాంకు ప్రధానమంత్రి (దివాన్ )గా పనిచేసి పాకిస్తాన్ పారిపోయిన మీర్ లాయక్ ఆలీ తరువాతి కాలంలో విభిన్న వాదనలు వినిపించారు. అయితే,వారు ఖాకీ బట్టలు,ఆయుధాలు ధరించి హైద్రాబాద్ రాజ్యంలో యథేచ్ఛగా తిరిగేవారనీ, నిజాం పోలీస్ బృందాలు కూడా వారు చేసే అరాచకాలను చూస్తూ ఉండిపోయేవారని నాటి ప్రజలు ఆ చీకటి రోజులను గుర్తు చేసుకుంటూ ఉంటారు .
 
పోలీస్ చర్య మొదలు - పోరాటానికి రజాకార్ల రెడీ 
 
ఈలోపు హైదరాబాద్‌తో ఢిల్లీ చర్చలు సఫలం కాకపోవడంతో 1948, సెప్టెంబర్‌లో పోలీస్ చర్య మొదలు పెట్టింది భారత ప్రభుత్వం. పర్వాలేదు మనమే గెలుస్తామంటూ ఖాసీం రజ్వీ లేనిపోని భరోసా నిజాంకు కలిగించి యుద్దానికి సిద్ధపడ్డాడు. కానీ భారత సైన్యం నిజాం రాజ్యంలో అడుగుపెట్టగానే ప్రజల నుంచి వారికి వచ్చిన మద్దతు చూసి రజాకార్లు తోక ముడిచారు. ఎక్కడికక్కడ భారత సైన్యానికి లొంగిపోవడం లేదా పారిపోవడం వంటివి చేసారు. దానితో దిక్కు తోచని ఖాసీం రజ్వి రేడియా ద్వారా ప్రజలతో ఆఖరిసారి మాట్లాడి లొంగిపోయాడు . 
 
మొదలైన విచారణ -ఖరారైన శిక్ష 
 
హైద్రాబాద్ రాజ్యం ఇండియాలో విలీనం అయ్యాక ఖాసీం రజ్వి నాయకత్వంలోని రజాకార్లు చేసిన దురాగతాలు,స్వయంగా రజ్వి పాల్గొన్న నేరాలపై విచారణ ప్రారంభమైంది. అయితే, రజాకార్లలో అరాచక మూకలు చేరిపోయాయనీ వారిని రజ్వి అదుపుచెయ్యలేక పోయారని ఆయన  మద్దతుదారులు అంటుంటారు. ఏదేమైనా ఖాసిం రజ్విపై ప్రధానంగా జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ హత్య, బేబీ నగర్ దోపిడీ సహా మరో హత్య కేసులో పాత్రపై విచారణ జరిగింది. వీటిలో షోయబుల్లా ఖాన్  హత్యకేసులో యావజ్జీవ శిక్ష పడింది రజ్వికి. ఈ తీర్పు 1950లో విలువడింది .  దీన్ని పైకోర్టుల్లో మళ్ళీ అప్పీల్ చేసుకున్నాడు రజ్వి. ప్రభుత్వం మాత్రం మరణ శిక్ష వెయ్యాలని వాదించింది అంటారు. అయితే హత్య కేసును కొట్టేసిన కోర్టు దోపిడీకేసులో మాత్రం 7 ఏళ్ల జైలు శిక్షను విధించింది. ఖాసీంను పూణే లోని ఎరవాడ జైలుకు తరలించారు.
 
పాకిస్తాన్ కు వెళ్లిపోవాలనే కండీషన్ మీద 7 ఏళ్ళ జైలు శిక్ష తర్వాత  విడుదలైన ఖాసీం రజ్విని చూడ్డానికి ఆయన మిత్రుడు మినహా ఒక్కరూ రాలేదు. రజాకార్లు అనే పేరు చెప్పుకోవడానికి గానీ, ఖాసీం రజ్వి సన్నిహితులం అని గానీ చెప్పుకోవడానికి ఎవరూ రెడీగా లేరు. మిత్రుడి కారులోనే హైదరాబాద్ చేరుకున్న తర్వాత మజ్లీసస్‌కి తన వారసుడిగా అబ్దుల్ వాహీద్ ఒవైసీని నియమించారు ఖాసీం రజ్వి. తరువాత ముంబై మీదుగా పాకిస్తాన్ వెళ్ళిపోయాడు. 
 
అనామక మరణం 
 
తాను పాకిస్తాన్‌లో అడుగుపెడుతూనే తనకు పెద్దఎత్తున స్వాగతాలు లభిస్తాయని భ్రమించిన ఖాసీం రజ్వికి అలాంటివేమీ దక్కలేదు . ఓవిధంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఆయనను పక్కనబెట్టేసింది. చివరకు అక్కడ లాయర్ ప్రాక్టీస్ మళ్ళీ మొదలెట్టాడు కానీ.. వయస్సు సహకరించలేదు. చివరకు అనామకుడిగా 1970లో కరాచీలో మరణించాడు ఖాసీం రజ్వీ. హైదరాబాద్ రాజ్యాన్ని పాకిస్తాన్‌లో కలపాలని లేదా స్వాతంత్య్రంగా ఉంచాలనే వెర్రి ఆలోచనతో ఛాందస భావాలతో ఎన్నో దారుణాలకు తెగబడ్డ రజాకార్ల మూకకు నాయకుడు ఖాసీం రజ్వి చరిత్ర అలా ముగిసిపోయింది.
Published at : 17 Sep 2022 10:43 AM (IST) Tags: SEPTEMBER 17 Liberation of Telangana Merger of Hyderabad State Merger of Telangana Kasim Razvi

సంబంధిత కథనాలు

Breaking News Live Telugu Updates: ప్రధానిపై దాడికి పీఎఫ్ఐ కుట్ర, ఆ పార్టీని నాశనం చేయాల్సిందే: బీజేపీ

Breaking News Live Telugu Updates: ప్రధానిపై దాడికి పీఎఫ్ఐ కుట్ర, ఆ పార్టీని నాశనం చేయాల్సిందే: బీజేపీ

IND Vs AUS Match: Hydలో నేడు భారీ ట్రాఫిక్ ఆంక్షలు, మీరు క్రికెట్ మ్యాచ్‌కి వెళ్తున్నారా? పార్కింగ్ వివరాలివీ

IND Vs AUS Match: Hydలో నేడు భారీ ట్రాఫిక్ ఆంక్షలు, మీరు క్రికెట్ మ్యాచ్‌కి వెళ్తున్నారా? పార్కింగ్ వివరాలివీ

Vijayawada Traffic: విజయవాడ మీదుగా వెళ్తున్నారా? నగరంలోకి నో ఎంట్రీ - మళ్లింపులు ఇలా: పోలీసులు

Vijayawada Traffic: విజయవాడ మీదుగా వెళ్తున్నారా? నగరంలోకి నో ఎంట్రీ - మళ్లింపులు ఇలా: పోలీసులు

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Special Trains: దసరా కోసం తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ట్రైన్స్ ఇవే, ఈ మార్గాల్లో రైళ్లు క్యాన్సిల్

Special Trains: దసరా కోసం తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ట్రైన్స్ ఇవే, ఈ మార్గాల్లో రైళ్లు క్యాన్సిల్

టాప్ స్టోరీస్

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'

Lok Sabha Election 2024: సోనియా గాంధీతో నితీశ్, లాలూ భేటీ- టార్గెట్ 2024పై చర్చ!

Lok Sabha Election 2024: సోనియా గాంధీతో నితీశ్, లాలూ భేటీ- టార్గెట్ 2024పై చర్చ!