Medaram Hundi: మేడారం జాతర హుండీ లెక్కింపు ప్రారంభం - అంబేడ్కర్ ఫోటోతో కరెన్సీ నోట్లు, అవాక్కైన అధికారులు
Medaram News: మేడారం జాతర హుండీల లెక్కింపు తొలి రోజే ఫేక్ కరెన్సీ కలకలం రేగింది. అంబేడ్కర్ ఫోటోతో ముద్రించిన కరెన్సీ నోట్లను చూసిన అధికారులు అవాక్కయ్యారు.
Fake Currency in Medaram Hundi: గిరిజన కుంభమేళా మేడారం (Medaram) మహా జాతర హుండీల లెక్కింపును అధికారులు గురువారం ప్రారంభించారు. పటిష్ట భద్రత మధ్య హనుమకొండ కేంద్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో దేవాదాయ సిబ్బంది, రెవెన్యూ, పోలీసులు, మేడారం పూజారుల సమక్షంలో హుండీ ఆదాయం కౌంటింగ్ చేపట్టారు. ఈ క్రమంలో తొలి రోజే హుండీలో నకిలీ కరెన్సీ నోట్ల కలకలం రేగింది. మొదట ఓపెన్ చేసిన హుండీలో అంబేడ్కర్ ఫోటోతో ముద్రించిన నకిలీ కరెన్సీని చూసిన సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇలా పదుల సంఖ్యలో అంబేడ్కర్ ఫోటోతో ముద్రించిన రూ.100 నోట్లు భారీగా బయటపడ్డాయి. ఇప్పటివరకూ 20కి పైగా నకిలీ కరెన్సీని గుర్తించి వాటిని పక్కన పెట్టారు. కాగా, మేడారం జాతరలో మొత్తం 518 హుండీలు ఏర్పాటు చేయగా అవన్నీ నిండిపోయాయి. అయితే, గత జాతరలో కొంత మంది భక్తులు విచిత్రంగా వారి కోరికలను పేపర్ పై రాసి హుండీలో వేశారు. ఈసారి ఫేక్ కరెన్సీ బయటపడింది.
వారం నుంచి 10 రోజులు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ నెల 21 నుంచి 24 వరకు మేడారం సమ్మక్క సారలమ్మల జాతర ఘనంగా జరిగింది. దాదాపు 1.40 కోట్ల మంది భక్తులు వన దేవతలను దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. భక్తులు కానుకలను సమర్పించేందుకు దేవాదాయ శాఖ 518 హుండీలను ఏర్పాటు చేసింది. గురువారం హుండీల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా.. 350 మంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటున్నారు. 150 మంది దేవాదాయ శాఖ సిబ్బంది. 200 మంది స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు హుండీలు లెక్కిస్తున్నారు. నోట్లు, కాయిన్స్, బియ్యం వేరు చేయడం కోసం అధికారులు ప్రత్యేకంగా రెండు మిషన్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ లో నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండేలా చర్యలు చేపట్టారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కౌంటింగ్ కొనసాగుతుంది. హుండీల లెక్కింపు పూర్తయ్యే సరికి వారం నుంచి పది రోజులు పడుతుందని మేడారం ఈఓ రాజేందర్ తెలిపారు.
మేడారం పరిసరాల్లో దుర్గంధం
అటు, జాతర ముగిసిన అనంతరం మేడారం పరిసరాల్లో దుర్గంధం వెదజల్లుతోంది. నాలుగు రోజుల పాటు జరిగిన జాతరకు కోటికి పైగా భక్తులు తరలివచ్చి వన దేవతలను దర్శించుని మొక్కులు సమర్పించుకున్నారు. భక్తులు వదిలి వెళ్లిన వ్యర్థాలతో జాతర పరిసరాల్లో ఈగలు, పురుగుల, క్రిమి కీటకాలు వ్యాపిస్తున్నాయి. ఓ వైపు దుర్వాసన, మరోవైపు ఈగల ప్రభావంతో మేడారం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండలేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రశాంతమైన అటవీ ప్రాంతం చెత్త, ప్లాస్టిక్, కోళ్లు, మేకల వ్యర్ధాలతో పాటు మలమూత్ర విసర్జనలతో నిండిపోయింది. మేడారం పరిసర ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా భక్తులు వదిలిన ఫుడ్ వేస్ట్, ప్లాస్టిక్, కోళ్లు, మేకల వ్యర్ధాలు కనిపిస్తున్నాయంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. మేడారం, రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి గ్రామాల ప్రజలు తాత్కాలికంగా ఊర్లను ఖాళీ చేసి వెళ్తున్నారని, అనేక మంది రోగాల బారిన పడుతున్నారని మేడారం వాసి రాజ్ కుమార్ తెలిపారు. 75 శాతం పారిశుధ్య పనులు పూర్తయ్యాయని, ఒకటి రెండు రోజుల్లో సాధారణ స్థితికి వస్తుందని జిల్లా పంచాయతీ రాజ్ అధికారి వెంకయ్య తెలిపారు.
Also Read: Karimnagar News: శభాష్ పోలీస్ - రైతును 2 కి.మీ భుజాన మోసి కాపాడిన కానిస్టేబుల్, ఎక్కడంటే?