Bhadrachalam Danger Zone : భద్రాచలం వద్ద 75 అడుగులకు చేరనున్న గోదావరి - ఇదే జరిగితే ఏమవుతుందంటే ?
భద్రాచలం వద్ద గోదావరి 75 అడుగులకు చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే భద్రాచలానికి ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది.
Bhadrachalam Danger Zone : గోదావరి పరిధిలో భారీ వర్షాల కారణంగా వరద అంతకంతకూ పెరుగుతూనే ఉంది. శుక్రవారం మధ్యాహ్నం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 70 అడుగులు దాటింది. రాత్రికి 75 అడుగుల స్థాయికి చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
నిజానికి 70 అడుగులు దాటటమే చాలా అరుదు. 36 ఏళ్ల తర్వాత మొదటిసారి రికార్డు స్థాయిలో 70 అడుగులు దాటి వరద నీరు ప్రవహిస్తోంది. ఈ కారణంగా ఇప్పటికే భద్రాచలం మొత్తం నీటి ముంపులో ఉంది. ఇప్పటికే భద్రాచలంలో పలు కాలనీలు నీటమునిగాయి. రామాలయం ప్రాంతంలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. 2వేల కుటంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే మరో ఐదు అడుగుల ప్రవాహం పెరిగితే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించడం కష్టం.
The #IndianArmy (@adgpi) sent its personnel to flood-hit #Bhadrachalam town of #Telangana for rescue and relief operations. pic.twitter.com/7QwPexYUMb
— IANS (@ians_india) July 15, 2022
గత 50 ఏళ్లలో మూడు సార్లు మాత్రమే గోదావరి నీటి మట్టం 70 అడుగులు దాటింది. ప్రస్తుతం గోదావరిలోకి 24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, అధికారులు భద్రాచలం గోదావరి కరకట్టను డేంజర్ జోన్‌గా ప్రకటించారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కడెంవాగు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఉప్పెనలా గోదావరి వరదతో విరుచుకుపడుతోంది.
#Godavari is flowing beyond the dangerous level in Bhadrachalam. The water level is rising rapidly due to heavy flooding. At present it has reached a record level of 70 feet. #godavarifloods #GodavariRiver #Bhadrachalam pic.twitter.com/uijErIgLoH
— Medi Samrat (@Journo_Samrat) July 15, 2022
వరద ఉధృతి ధాటికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం వరకూ ఉన్న తొమ్మిది ప్రాజెక్టుల గేట్లను పూర్తిగా ఎత్తేశారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పార్వతి, లక్ష్మీ, సరస్వతి బ్యారేజ్‌లను గోదావరి వరద ముంచెత్తింది. ఇక ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఆర్మీని కూడా రంగంలోకి దింపుతోంది. ఈ రాత్రి గడిస్తే భద్రచలానికి ముప్పు తప్పినట్లేనని భావిస్తున్నారు.