Telangana Elections: తెలంగాణలో అన్ని పార్టీలకు రెండోసారి ఈసీ నోటీసులు, బుధవారంతో ముగియనున్న డెడ్ లైన్!
Telangana Elections 2023: తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం రెండోసారి నోటీసులు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు సమర్పించేందుకు బుధవారంతో తుది గడువు యుగియనుంది.
EC Notice to All Parties: హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్ల పరిశీలననను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ పూర్తిచేసింది. పనిలో పనిగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India) నోటీసులు ఇచ్చింది. అన్ని పార్టీలు తమకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను సమర్పించాలని ఈసీ నోటీసులు జారీ చేసింది. నవంబర్ 15వ తేదీ (బుధవారం) సాయంత్రం 5 గంటల్లోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను సీల్డ్ కవర్‌లో తమకు అందించాలని ఈసీ ఆదేశించింది. ప్రతి ఎన్నికల సందర్భంగా పార్టీలకు ఎన్నికల బాండ్లు వస్తుంటాయని తెలిసిందే.
ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల అధ్యక్షులు, కోశాధికారులు, ప్రధాన కార్యదర్శులు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు సమర్పించాలని సుప్రీంకోర్టు నవంబర్ 2న ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈసీ నవంబర్ 3న అన్ని పార్టీల అధినేతలు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులకు నోటీసులు ఇచ్చింది. తాజాగా మంగళవారం రెండోసారి అన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు సమర్పించాలని ఈసీ నోటీసులలో పేర్కొంది.
ఎన్నికలలో రాజకీయ పార్టీల అభ్యర్థుల ఖర్చుకు సంబంధించి ఈసీ నిబంధనలు విధిస్తుంది. పొలిటికల్ పార్టీల నిధుల సమీకరణలో పారదర్శకత కోసం ఈసీ ఎన్నికల బాండ్ల పథకం కొనసాగిస్తోంది. అభ్యర్థులకు, పార్టీకి ఎంత విరాళం ఎవరిచ్చారు అనేది తెలుసుకోవడంతో కొందరి విషయంలో గోప్యత, విశ్వసనీయత పరిమితం అవుతుందని సుప్రీంకోర్టు ఇటీవల అభిప్రాయపడింది. అభ్యర్థులు సైతం తమ పేరిట కొత్త బ్యాంక్ ఖాతాలను ఇటీవల తెరిచి, తమ ఎన్నికల ఖర్చులను చూపించాల్సి ఉంటుంది.
తెలంగాణలో నామినేషన్ల పరిశీలన పూర్తి (Telangana Election Nominations 2023)
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. పూర్తి వివరాలు లేని నామినేషన్లను తొలగించిన తరువాత 2,898 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 4,798 నామినేషన్లు దాఖలు కాగా, ఏకంగా 1900 నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. నామినేషన్ల పరిశీలన అనంతరం అత్యధికంగా సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ ( Gajwel) బరిలో 114 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అత్యల్పంగా నారాయణపేటలో ఏడుగురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నామినేషన్ల తిరస్కరణకు గురైన వాటిలో ఎక్కువగా నిబంధనలు పాటించనివి, డమ్మీ అభ్యర్థులవే ఉన్నాయని తెలుస్తోంది. అయితే నామినేషన్ల ఉపసంహరణ తుది గడువు నవంబర్ 15తో ముగియనుంది.