Vijayashanti: రాజకీయాల్లో ద్విపాత్రాభినయం సాధ్యపడదు, ఒక పార్టీకి మాత్రమే పనిచేస్తా!: విజయశాంతి
Telangana Elections 2023: దుర్మార్గ కేసిఆర్ పరిపాలన పరిస్థితుల నుంచి కొట్లాడి మన ఉద్యమకారులం తెచ్చుకున్న రాష్ట్రానికి మేలు కొరకు మాత్రమే తన పోరాటమని విజయశాంతి స్పష్టం చేశారు.
ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పనిచేయగలుగుతాం: విజయశాంతి
Telangana Assembly Election 2023: బీజేపీ నుంచి సీటు ఆశించి భంగపడిన నేతలు ఒక్కొక్కరుగా మళ్లీ పాత పార్టీలోకి వెళ్తున్నారు. బీజేపీ నుంచి సీట్ల జాబితా రాకపోవడం, సీట్లు తమకు ఇస్తారా అనే సందేహం, అసంతృప్తితో కొందరు ఇప్పటికే వేరే పార్టీకి జంప్ అయ్యారు. బీజేపీ కీలక నేత విజయశాంతి (BJP Leader Vijayashanti) సైతం పార్టీకి గుడ్ బై చెబుతారని ప్రచారం ఊపందుకున్న సమయంలో రాములమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ దుర్మార్గాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోనికి కాంగ్రెస్ నుండి పోరాడాలి అన్నారు. 7 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జెండా మోసిన వ్యక్తి రాములమ్మ అని కొందరు అంటున్నారని పేర్కొన్నారు.
బీజేపీని విధాన పూర్వకంగా 1998 నుండి విశ్వసించి దక్షిణ భారతంతో పాటు మిగతా అనేక రాష్ట్రాలలో దశాబ్ధ కాలం పైగా పనిచేసిన నేతగా, స్పష్టమైన హిందూత్వవాదిగా బీజేపీ వైపు నిలబడాలని మరెంతో మంది బిడ్డలు ఇంకోవైపు ఉన్నారు. రెండు అభిప్రాయాలు ఉన్నప్పటికీ.. నిజానికి ఇయ్యాల తెలంగాణాల ఉన్న సీఎం కేసిఆర్ పరిపాలన పరిస్థితుల నుంచి కొట్లాడి మన ఉద్యమకారులం తెచ్చుకున్న రాష్ట్రానికి మేలు కొరకు మాత్రమే అని స్పష్టం చేశారు. కానీ సినిమా తీరుగా పోలీస్ లాకప్, రౌడీ దర్బార్, నాయుడమ్మ లెక్క ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాలలో సాధ్యపడదు అని, ఏదైనా ఒక పార్టీ కి మాత్రమే పని చేయగలుగుతామని విజయశాంతి ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ చేశారు. హర హర మహాదేవ, జై శ్రీరామ్, జై తెలంగాణ అని పోస్ట్ ను ముగించారు.
విజయశాంతి రాజకీయ పయనం ఎటువైపు సాగుతుందోనని చర్చ జరుగుతున్న సమయంలో మంగళవారం మరో ట్వీట్ (Vijayashanti Tweet) చేశారని తెలిసిందే. 25 సంవత్సరాల నా రాజకీయ ప్రయాణం , అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణ మాత్రమే తనకు ఇస్తూ వచ్చిందన్నారు. ఏ పదవి ఏనాడు కోరుకోకున్న... ఇప్పటికీ అనుకోకున్న కూడా... ప్రస్తుతం ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం అన్నారు. మన పోరాటం నాడు దశాబ్ధాల ముందు తెలంగాణ ఉద్యమ బాట నడిచినప్పుడు, మొత్తం అందరూ తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప, ఇయ్యాల్టి బీఆర్ఎస్ కు వ్యతిరేకం అవుతాం అని కాదన్నారు. కానీ ఈ వ్యాఖ్యలకు బీజేపీ శ్రేణులు ఆమె రూట్ మార్చుతారా అని ఆలోచింపంజేశాయి.
నా పోరాటం నేడు సీఎం కేసీఆర్ (Telangana CM KCR) కుటుంబ దోపిడి, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వంపై మాత్రమే. నాతో కలిసి తెలంగాణా ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదు అని విజయశాంతి పేర్కొన్నారు. రాజకీయ పరంగా ఏ విషయాన్నైనా విభేదించినప్పటీకి, అన్ని పార్టీల మొత్తం తెలంగాణ బిడ్డలు సంతోషంగా, సగౌరవంగా ఎన్నటికే ఉండాలనీ మనఃపూర్వకముగా కోరుకోవటం మీ రాములమ్మ ఒకే ఒక్క ఉద్దేశ్యం అని నిన్నటి పోస్టులో పేర్కొన్నారు.
Also Read: Telangana Elections 2023: బీజేపీకి వరుస షాకులు- పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి రాజీనామా