Corona Vaccination: 135 దేశాల్లో డెల్టా వేరియంట్.. మాస్కులు లేకుండా రోడ్లపై కరోనా పేషెంట్లు: డాక్టర్ శ్రీనివాస్
కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకోవాలంటే కచ్చితంగా కోవిడ్19 నిబంధనలు పాటించాలని డా. శ్రీనివాస్ సూచించారు. డెల్టా వేరియంట్ కేసులు నమోదైన వారిలో అధిక కాలం ఆ వేరియంట్ ప్రభావం చూపిస్తుందని చెప్పారు.
దేశంలో కరోనా కేసులు గత నెలన్నర రోజులుగా ప్రతిరోజూ దాదాపు 40 వేల వరకు నమోదవుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే కేరళ, మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సైతం దీనిపై స్పందించి నిపుణులతో కూడిన ప్రత్యేక టీమ్‌ను కేరళకు పంపించింది. తెలంగాణ విషయానికొస్తే 9 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా కసులు ప్రస్తుతానికి అదుపులోనే ఉన్నాయని పేర్కొన్నారు.
నేటి ఉదయం కోఠిలోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా కేసులు అదుపులో ఉన్నప్పటికీ, కరోనా సేకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గలేదని స్పష్టం చేశారు. కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పాజిటివ్ కేసులు అధికంగా నమోదువుతున్నాయని, కరోనా పేషెంట్లు సైతం కొందరు మాస్కులు కూడా ధరించకుండానే రోడ్లపై తిరుగుతున్నారని.. అలాంటి వారిని గుర్తిస్తే కచ్చితంగా చర్యలు ఉంటాయన్నారు. అందరూ ప్రమాదకరమని భావిస్తున్న డెల్టా వేరియంట్ భారత్ సహా 135 దేశాల్లో ప్రభావం చూపిందని తెలిపారు. మే నెలలో డెల్టా వేరియంట్ కేసులు నమోదు కాగా, బాధితులు పూర్తిగా కోలుకున్నారు. తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ రాకూడదంటే అది మన చేతుల్లో పని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9 జిల్లాల్లో కరోనా కేసులు ఈ మధ్యకాలంలో అధికంగా నమోదవుతున్నట్లు గుర్తించామని తెలిపారు.
కరోనా వైరస్ బారి నుంచి తప్పించుకోవాలంటే కచ్చితంగా కోవిడ్19 నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాదకర డెల్టా వేరియంట్ కేసులు నమోదైన వారిలో అధిక కాలం ఆ వేరియంట్ ప్రభావం చూపిస్తుందని చెప్పారు. రోగ నిరోధక సామర్థ్యాన్ని తగ్గించేందుకు డెల్టా వేరియంట్ ప్రయత్నిస్తుందని.. ఇదివరకే రాష్ట్రంలో రెండు డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డీహెచ్ స్పష్టం చేశారు. కరోనా కేసులలో పెరుగుదల కొనసాగితే షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, హోటల్స్ లాంటి ప్రదేశాలకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారినే అనుమతించే అవకాశం ఉందన్నారు.
తెలంగాణలో 1.12 కోట్ల మంది సింగిల్ డోసు వ్యాక్సిన్ తీసుకున్నారని, మొత్తం 2.2 కోట్ల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులని తెలిపారు. రెండో డోసు తీసుకోవడానికి సైతం ప్రజలు ఆసక్తి చూపుతున్నారని, ఇప్పటికే 33.79 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారని వెల్లడించారు. రాష్ట్రానికి 9.5 లక్షల కరోనా డోసులు అధికంగా వచ్చాయని.. రెండో వ్యాక్సిన్‌కు సైతం అధిక ప్రాధాన్యం ఇస్తుందని డాక్టర్ శ్రీనివాస్ చెప్పారు. రాష్ట్రంలో 12 లక్షల మందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసు ఇవ్వగా, 3లక్షల మందికి కొవాగ్జిన్ రెండో డోస్ ఇవ్వాల్సి ఉంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.