Niranjan Reddy : గోధుమల సేకరణ అంటే గోధుమ పిండి సేకరిస్తారా?- కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై మంత్రి నిరంజ్ రెడ్డి ఫైర్
Niranjan Reddy On Piyush Goyal : తెలంగాణ రైతుల పట్ల కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన ఆరోపణలపై మంత్రి స్పందించారు.
Niranjan Reddy On Piyush Goyal : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారపూరితంగా మాట్లాడారని తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. షీయూష్ గోయల్ తో సమావేశం అనంతరం దిల్లీలోని తెలంగాణ భవన్ లో మంత్రులు, ఎంపీలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రం తీరుపై మండిపడ్డారు. సమావేశానికి ముందే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియా ముందుకు వచ్చి తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారన్నారు. తెలంగాణ రైతులను తప్పుదారి పట్టించేందుకు పీయూష్ గోయల్ ప్రయత్నించారన్నారు. రాష్ట్రంలో పండిన పంట కొనుగోలు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని మంత్రి అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై కేంద్రానికి అవగాహన లేదన్నారు. ధాన్యం సేకరణకు, పప్పు దినుసుల సేకరణకు కూడా కేంద్రానికి తేడా తెలియడం లేదన్నారు. వడ్డను వడ్ల రూపంలో సేకరించాలని డిమాండ్ చేశారు. గోధుమల సేకరణ అంటే గోధుమ పిండి సేకరిస్తారా? అని మంత్రి ప్రశ్నించారు.
ప్రధాని క్షమాపణలు చెప్పిన విషయం మర్చిపోయారా?
కేంద్రం దేశ రైతులను రోడ్డు మీద నిలబెట్టి, దాదాపు 700 మంది చావుకు కారణమైందని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఆఖరికి రైతులకు ప్రధాని క్షమాణలు చెప్పి చట్టాలు వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ బీజేపీ నేతలు కొనిపిస్తాం మీరు వరి వేయండని రైతులను మోసం చేశారన్నారు. తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేసి 50 లక్షల ఎకరాల వరి సాగును 30 లక్షలకు తగ్గించామన్నారు. కేంద్రంలో పేదల ప్రభుత్వం కాదని, వ్యాపారాత్మక ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులకు నీళ్లు, కరెంటు ఇచ్చి, రైతుబంధు, రైతు బీమా పథకాలు ద్వారా పంటల సాగును ప్రోత్సహిస్తుందన్నారు. ఇవన్నీ చేస్తున్నందుకు రైతు వ్యతిరేక ప్రభుత్వమా? అని ప్రశ్నించారు.
నాన్ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బంది పెడుతోంది
2022కి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న కేంద్రం కనీసం పండించిన ధాన్యాన్ని కొనడంలేదని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రైతాంగానికి కేంద్రం క్షమాపణలు చెప్పే పరిస్థితి త్వరలోనే వస్తుందని మంత్రి అన్నారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సమాఖ్య స్ఫూర్తి లేదని, కేంద్రం వివక్ష చూపుతుందని 2013లో రైతులతో సమావేశం పెట్టిన విషయం మర్చిపోయారా అని మంత్రి ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక సమాఖ్య స్ఫూర్తి మర్చిపోయారని విమర్శించారు. జీడీపీ పెంపుదలలో కేంద్రం పూర్తిగా విఫలమైందన్నారు. నిరుద్యోగాన్ని నియంత్రించడంలోనూ కేంద్రం విఫలమైందన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. బీజేపీ అధికారంలో లేనిచోట ఇతర పార్టీల ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులు పెడుతున్నది వాస్తవం అని మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.