Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, కేంద్రం కీలక వ్యాఖ్యలు
Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదాపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది.
Kaleshwaram Project : తెలంగాణకు కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా అర్హత లేదని తేల్చిచెప్పింది. కాళేశ్వరానికి పెట్టుబడుల అనుమతులు కూడా లేవని కేంద్రం స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్ కోరారని కేంద్ర సహాయ మంత్రి తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టుకు ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ లేదన్నారు.
ఇన్వెస్టిమెంట్ క్లియరెన్స్ లేదు
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. అయితే ఈ ప్రాజెక్టుపై కేంద్రం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని వీలుదొరికప్పుడల్లా కేంద్రం దృష్టికి తీసుకెళ్లేది. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలంటే హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాలి. హైపవర్ కమిటీ అనుమతిస్తేనే జాతీయ హోదా ప్రకటించే అవకాశం ఉంటుంది. కాళేశ్వరానికి పెట్టుబడుల క్లియరెన్స్ కూడా లేదని కేంద్రం తెలిపింది. జాతీయ ప్రాజెక్టుల జాబితాలో కాళేశ్వరం ప్రాజెక్టును చేర్చే అవకాశం లేదని అని కేంద్రజలశక్తిశాఖ సహాయకమంత్రి బిశ్వేశ్వర్ తుడు లోక్ సభలో గురువారం తెలిపారు.
ప్రాజెక్టుపై విమర్శలు
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. గోదావరి నది నీటి ఎత్తిపోస్తూ లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ప్రపంచంలో ఇలాంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు ఎక్కడా లేదని చాలా సందర్భాల్లో తెలిపింది. ఇటీవల వరదలకు కాళేశ్వర ప్రాజెక్టులోని పంప్ హౌస్ మునిగిపోయింది. దీనిపై ప్రతిపక్షాలు మళ్లీ విమర్శలు చేశారు. తప్పుడు డిజైన్ల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించాయి. వరదలో మునిగిపోయిన పంపు హౌస్ లు తిరిగి పనిచేయాలంటే వందల కోట్ల ఖర్చు అవుతుందని విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలను రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపడేసింది. పంప్ హౌజ్‌ల మరమ్మతులకు ఖర్చు రూ.20 కోట్లకు మించదని తెలిపింది. మరమ్మతు బాధ్యత ప్రాజెక్టు కాంట్రాక్టర్లదే అని తేల్చిచెప్పింది. ప్రభుత్వం పై ఎటువంటి భారం పడదని తెలిపింది.