BRS Delhi Office : దేశం కోసం కేసీఆర్ అంటూ దిల్లీలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, 14న కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం
BRS Delhi Office : దేశ రాజధాని వేదిక బీఆర్ఎస్ కార్యకలాపాలకు రంగం సిద్ధం అయింది. డిసెంబర్ 14న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
BRS Delhi Office : భారత రాష్ట్ర సమితి తన కార్యకలాపాలను స్పీడప్ చేసింది. పలు రాష్ట్రాల్లో కార్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. దిల్లీలో కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈనెల 14న దిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఆదివారం పరిశీలించారు. ఈనెల 14న దేశ రాజధాని దిల్లీ లోని సర్దార్ పటేల్ మార్గ్ లో సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించనున్నారు. కార్యాలయ ప్రారంభోత్సవం,యాగం కోసం చేపట్టవలసిన ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమారు ఆదివారం పరిశీలించారు. యాగం కోసం ప్రత్యేకంగా నిర్మించాల్సిన యాగశాల స్థలంతో పాటు ఆఫీస్ భవనంలో చేపట్టవలసిన మరమ్మత్తులు, కార్యాలయ ఫర్నిచర్ ఇతర పనులను ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజతో కలిసి పరిశీలించారు.
దిల్లీలో కేసీఆర్ ఫ్లెక్సీలు
దేశ రాజధాని దిల్లీలో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశం కోసం కేసీఆర్ అనే నినాదంతో ఆ పార్టీ నాయకుడు అలిశెట్టి అరవింద్ వీటిని ఏర్పాటు చేశారు. తక్కువ కాలంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన తమ అభిమాన నేత కేసీఆర్ దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నందుకు తాను ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రైతు బంధు, దళిత బంధు లాంటి పథకాలకు వ్యూహరచన చేసి సమర్థవంతంగా అమలు చేస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. మరెన్నో పథకాలను దేశంలోని రైతులందరికీ, అణగారిన వర్గాలకు అందాలంటే ఎంతో ముందు చూపు ఉన్న కేసీఆర్ నాయకత్వం అవసరమని అన్నారు.
ఫస్ట్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్న కేసీఆర్
తెలంగాణలో చక్రం తిప్పిన ప్రాంతీయ పార్టీ ఇప్పుడు జాతీయ రాజకీయల్లో కీలక పాత్ర పోషించేందుకు నడక ప్రారంభించింది. నిన్నటివరకు ప్రాంతీయ పార్టీకి లీడర్ గా ఉన్న కేసీఆర్ ఇక నుంచి జాతీయ నేతగా దిల్లీ రాజకీయాల్లో కీ రోల్ పోషించబోతున్నారు. ఇప్పటికే టార్గెట్ ఫిక్స్ అయ్యింది. ఇక ప్లాన్ ని అమలు పరచడమే తరువాయి కాషాయానికి కళ్లు బైర్లు కమ్మడం ఖాయమంటోంది గులాబీ దళం. దిల్లీ గద్దెపై గులాబీ జెండా రెపరెపలాడాలన్న లక్ష్యంతో జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన కేసీఆర్ రైతు రాజ్యం తెస్తామని పార్టీ ఆవిర్భావం రోజునే ప్రకటించి విధివిధాలు ఎలా ఉంటాయోనన్న ఉత్కంఠ రేపారు. అంతేనా కర్నాటకలో తొలి అడుగు పెట్టి పార్టీని నిలబెట్టడమే కాదు కుమారస్వామిని తిరిగి సీఎం చేస్తానని ధీమాతో చెప్పారు.
బీఆర్ఎస్‌పైనే దృష్టి పెట్టనున్న కేసీఆర్
రేపు పక్క రాష్ట్రం, ఎల్లుండి ఆపక్క..ఇలా పక్క నుంచి నరుకొస్తూ మోదీ-షాలకు పక్కలో బల్లెంలా తయారవ్వాలన్నదే కేసీఆర్ లక్ష్యమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు అనుకున్నది సాధించే వరకు విశ్రమించని మొండోడని గుర్తుచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి వ్యూహంతో వెళ్తున్నారో ఎవరికి అంతుచిక్కకుండా ప్లాన్ లు వేసిన కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ కీలక నేతగా ఎదిగేందుకు అంతకుమించిన వ్యూహంతో ముందుకెళ్తాడని భావిస్తున్నారు. దిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ప్రారంభోత్సవం తర్వాత కేసీఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాల్లోనే బిజీ అవుతారని పార్టీ శ్రేణుల నుంచి అందుతున్న సమాచారం. ఈ లోపు బీఆర్‌ఎస్ పార్టీని తిరిగి తెలంగాణ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా పార్టీ క్యాడర్ ని సిద్ధం చేసి ఎన్నికల బరిలోకి దిగాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారట.