Raja Shyamala Yagam : మళ్లీ అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్న కేసీఆర్! కానీ చిన్న మార్పు!
Raja Shyamala Yagam : తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి తనకు అచ్చొచ్చిన సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. కానీ ఈసారి వేదిక మాత్రం మారింది. అసలు ఆ సెంటిమెంట్ ఏంటి? మారిన వేదిక ఏంటి?
Raja Shyamala Yagam : ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం సాయంత్రం దిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. వారం రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారు. అయితే ప్రతి పర్యటన లాంటిది కాదు ఇది. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సరిగ్గా నాలుగేళ్ల క్రితం అంటే 2018 డిసెంబర్ 13నే ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణం చేశారు కేసీఆర్. అంటే రేపటికి నాలుగేళ్లు పూర్తై.... రెండో టర్మ్ లో ఆఖరి ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇవాళ దిల్లీకి వెళ్తున్న కేసీఆర్... రేపు,ఎల్లుండి అక్కడే రాజశ్యామల యజ్ఞం చేయబోతున్నారు. 2018 నవంబర్ లో అంటే ముందస్తు ఎన్నికలకు సుమారు 2 వారాల ముందు కేసీఆర్ తన ఫాంహౌస్ లో ఇదే యజ్ఞాన్ని నిర్వహించారు. అప్పుడు 88 సీట్లతో గెలిచి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత కొన్ని చేరికలతో కలుపుకుని అసెంబ్లీలో బలాన్ని 104కు పెంచుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఏడాదికి అంటే డిసెంబర్ 2019లో 5 రోజుల పాటు సహస్ర మహాచండి యజ్ఞాన్ని నిర్వహించారు.
జాతీయ రాజకీయాలకు సిద్ధం
ఇప్పుడు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాలకు సిద్ధమవుతుండటమే కాక... ఎన్నికలకు ఇంకో సంవత్సరం ఉందనగా మరోసారి ఈ యజ్ఞం నిర్వహిస్తున్నారు. ఇది కేసీఆర్ కు సెంటిమెంట్ లాంటిదని, ఈసారి కూడా అధికారంలోకి రావడం కోసమే ఈ యజ్ఞం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే జాతీయ రాజకీయాలను, BRS విస్తరణను దృష్టిలో పెట్టుకుని ఈసారి యజ్ఞ వేదికను దిల్లీకి మార్చినట్టు తెలుస్తోంది. 2018లో అసెంబ్లీ ఎన్నికలకు రెండు వారాల ముందు కేసీఆర్ రాజశ్యామల యజ్ఞం నిర్వహించారు. ఇప్పుడు గత కొన్ని రోజులుగా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు మరోసారి వెళ్తారని విపక్ష నాయకులు, రాజకీయ విశ్లేషకులు కొందరు చర్చించుకుంటున్నారు. 2018లో ఎన్నికలకు ముందు యజ్ఞం చేసినట్టుగానే ఇప్పుడూ చేస్తున్నారని, అంటే త్వరలోనే ఎన్నికలు వచ్చినా ఆశ్చర్యం లేదని అంతా అనుకుంటున్నారు.
స్వార్థం కోసం యాగమని ప్రతిపక్షాల విమర్శలు
అయితే కేసీఆర్ చేయబోతున్న ఈ రాజశ్యామల యాగంపై అప్పుడే ప్రతిపక్షాలు విమర్శలకు దిగుతున్నాయి. ఇది స్వార్థం కోసం చేస్తున్న యాగం అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ముందుగా తెలంగాణ ఎన్నికలు పూర్తి చేసుకుంటే ఆ తర్వాత దేశంలో మిగతా రాష్ట్రాలపై దృష్టి పెట్టొచ్చనేది కేసీఆర్ ప్రణాళికగా చెప్పుకుంటున్నారు. మరో 4-5 నెలల్లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ జేడీఎస్ కు BRS మద్దతు తెలపడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇంతే కాక ఆంధ్రప్రదేశ్ లోనూ BRS విస్తరణపై కాన్సట్రేట్ చేశారని, విజయవాడలో కార్యాలయం కోసం భూముల కోసం చూస్తున్నట్టు సమాచారం. సో ఓవరాల్ గా చూసుకుంటే రేపు, ఎల్లుండి దిల్లీలో చేయబోతున్న రాజశ్యామల యాగం పూర్తైన తర్వాత ఎన్నికల దిశగా పరిణామాలు వేగంగా మారే అవకాశాలు లేకపోలేదు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ రాజశ్యామల యాగం ఏర్పాట్లను పర్యవేక్షించారు.