Telangana Paddy Cultivation: తెలంగాణలో తగ్గిన వరిసాగు, ఎంత శాతం తగ్గిందంటే?
Telangana Paddy Cultivation: రాష్ట్రంలో వానాకాలం సీజన్ లో వరి 59 లక్షల ఎకరాల్లో సాగు అవుతోంది.
Telangana Paddy Cultivation: తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్ లో వరిసాగు తగ్గుముఖం పట్టింది. సాధారణ వరి సాగు విస్తీర్ణానికి గాను 119 శాతం పెరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపినప్పటీ.. గత సంవత్సరంతో పోలిస్తే తగ్గినట్లు చెప్పారు. వానాకాలం సీజన్ లో రాష్ట్రంలో పంటల సాగు 120.50 లక్షల ఎకరాలకు చేరిందని బుధవారం వ్యవసాయ శాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 124.28 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని లక్ష్యంగా పెట్టుకోగా.. అందులో 97 శాతానికి పంటల సాగు చేరుకుంది. 49,86,634 ఎకరాల సాధారణ విస్తీర్ణానికి గాను 59,66,886 ఎకరాల్లో అంటే 119 శాతం ఎక్కువగా వరినాట్లు పడ్డట్లు అధికారులు వెల్లడించారు.
గత సంవత్సరం 61,30,584 ఎకరాల్లో వరి సాగు కాగా.. ఈ సంవత్సరం 1,63,698 ఎకరాలు తక్కువగా సాగు అయినట్లు అధికారులు తెలిపారు. పత్తి 50,59,225 ఎకరాల లక్ష్యానికి గాను 44,78,724 ఎకరాల్లో సాగు అవుతోంది. అంటే 88 శాతమే పత్తి సాగులోకి వచ్చింది. మెదక్, మహబూబాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, జనగామ, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, యాదాద్రి, సంగారెడ్డి, సిద్దిపేట, భద్రాద్రి, వికారాబాద్, నారాయణపేట జిల్లాలు సాగు లక్ష్యాన్ని అధిగమించాయని వ్యవసాయ శాఖ తెలిపింది.
జగిత్యాల జిల్లాలో ఈ సీజన్ లో రికార్డు స్థాయిలో వరిపైరు సాగులోకి వచ్చింది. రాష్ట్రంలోని జిల్లాల పరంగా జగిత్యాల జిల్లా వరిసాగులో 5వ స్థానంలో నిలిచిందని డీఏవో సురేష్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సాధారణం కన్నా 40 శాతం ఎక్కువగా వర్షాలు కురిశాయి. తొలిదశలోని పత్తి, సోయా, మక్క తదితర ఆరుతడి పంటలను కోల్పోయిన చాలా మంది రైతులు ఆరుతడి పంటలను తీసి వేసి మళ్లీ వరి నాట్లు వేశారు. సమృద్ధిగా వర్షాలు కురవడం, భూగర్భ జలమట్టం పైకి రావడం, శ్రీరాంసాగర్ కాలువ నీరు రావడం, వరద కాల్వలో నిండుగ నీరు ఉండటంతో ఈ నెల మొదటి వారం వరకు కూడా వరినాట్లు వేశారు. పరిస్థితులు అనుకూలించడంతో అన్ని పంటల విస్తీర్ణం గత సంవత్సరం వానాకాలంతో సమానంగా గరిష్ఠానికి చేరడంతో పరిస్థితులు అనుకూలించాయి.
Also Read: Tomato Price: భారీగా పడిపోతున్న టమాటా ధర, కిలో రూ.2 మాత్రమే
రాష్ట్రంలో 24.75 శాతం సజ్జలు, 18.48 శాతం రాగులు, 15.59 శాతం ఉలవలు, 13.35 శాతం బొబ్బర్లు, 6.009 శాతం పొద్దు తిరుగుడు, కొర్రలు, సామలు వంటి చిరు ధాన్యాలు 10.98 శాతం సాగు అయినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. మెదక్ లో 122.8 శాతం మహబూబాబాద్ లో 111.99 శాతం, ఆసిఫాబాద్ 109.46 శాతం, జగిత్యాల జిల్లాలో 106.84 శాతం, జనగామలో 106.42 శాతం, నిజామాబాద్ లో 105.60 శాతం, ఆదిలాబాద్ లో 104.49 శాతం, నిర్మల్ లో 103.02 శాతం, యాదాద్రి 103.99 శాతం, సంగారెడ్డిలో 102.56 శాతం, సిద్దిపేటలో 101.31 శాతం, భద్రాద్రిలో, వికారాబాద్ లో 100.. ఇలా ఈ జిల్లాలన్నీ 100 శాతానికి పైగా లక్ష్యాన్ని సాధించాయి. రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లాలు 75 శాతం లక్ష్యం చేరగా.. మిగతావి వంద శాతానికి చేరువగా ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ఆగస్టులో చివరి నాటికి 208.4 మిల్లీ మీటర్ల వర్షపాతానికి 79.7 మిల్లీ మీటర్ల వర్షమే పడింది. గత నెలలో 62 శాతం లోటుగా ఉందని తెలిపింది.