Google Map: గౌరవెల్లి ప్రాజెక్టులోకి దారి చూపిన గూగుల్ మ్యాప్-తృటిలో తప్పించుకున్న డీసీఎం డ్రైవర్
గూగుల్ మ్యాప్ కొంపముంచింది. డీసీఎంను నేరుగా గౌరవెల్లి ప్రాజెక్టులోకి తీసుకెళ్లింది. గ్రామస్తుల సాయంతో బయటపడ్డారు డీసీఎం డ్రైవర్, క్లీనర్.
Google Map Problems: డిజిటల్ యుగం.. చేతిలో స్మార్ట్ ఫోన్... ఇంకేముంది... ఏది కావాలన్న, ఏది తెలియకపోయినా గూగుల్ ఇట్ అంటున్నారు. క్షణాల్లో సమాచారం రాబట్టుకుంటున్నారు. దారి తెలియకపోయినా... గూగుల్ మ్యాప్ (Google Map) ఉందన్న ధీమాతో రయ్యి రయ్యి మంటూ ఎక్కడికైనా వెళ్లిపోతున్నారు. లోకేషన్ పెట్టుకోవడం... గూగుల్ మ్యాప్ చూపించిన దారిలో గుడ్డిగా వెళ్లిపోవడం. ఇది చాలా సార్లు సక్సెస్ అయినా... ప్రాణాల మీదకు తెచ్చిన సంఘటనలు కూడా లేకపోలేదు. తాజాగా... డీసీఎం డ్రైవర్ (DCM Driver)కు జరిగిన అనుభవమే దీనికి నిదర్శనం.
డీసీఎం డ్రైవర్‌ను ఏకంగా గౌరవెల్లి ప్రాజెక్టులోకి తీసుకెళ్లింది గూగుల్ మ్యాప్. అదెలా... ముందు నీళ్లు ఉన్నాయని తెలుసుకోకుండానే వెళ్లిపోయాడా...? అన్న సందేహం వస్తుంది కదా. అసలు ఏం జరిగిందంటే...? సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లిలోని ములకనూరు స్వకృషి మహిళా పాల డెయిరీకి సంబంధించిన పాల కవర్ల లోడ్‌తో... శనివారం (డిసెంబర్ 9న) రాత్రి డీసీఎంలో లోడ్ చేసుకుని హైదరాబాద్‌కు బయలుదేరాడు డ్రైవర్. ములకనూరు నుంచి వయా హుస్నాబాద్, రామవరం, కొమురవెల్లి మీదుగా హైదరాబాద్ వెళ్లేందుకు గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాడు. మ్యాప్ చూపించ విధంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. హుస్నాబాద్ దాటిన తర్వాత గౌరవెల్లి ప్రాజెక్టు బైపాస్ రోడ్డు దగ్గరలోని.... నందారం క్రాస్ రోడ్డు దగ్గర... దారి అర్థం కాలేదు. రాత్రి సమయం కావడం... చుట్టూ చీకటి.. ముందు ఏముందో కూడా సరిగా కనిపించని పరిస్థితి. దీంతో డ్రైవర్ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఎడమవైపు వెళ్లాల్సి ఉండగా... కుడివైపునకు వాహనం తిప్పేశాడు. ఇక... అక్కడి నుంచి తిప్పలు మొదలయ్యాయి.
ఎడమవైపు వెళ్లుంటే.. గూగుల్ మ్యాప్ కూడా సరిగానే దారి చూపించేదేమో.... తెలియక వాహనాన్ని కుడివైపు తప్పేయడంతో... గూగుల్ మ్యాప్ కూడా ఆ రూట్‌లోనే హైదరాబాద్‌కు దారి చూపించింది. గూగుల్ మ్యాప్ దారి చూపిస్తుండటంతో... అదే సరైన రోడ్డు అనుకొని ముందుకు వెళ్లారు డీసీఎం డ్రైవర్. చీకట్లో ముందు ఏముందో కూడా కనిపించని పరిస్థితిలో డ్రైవింగ్ చేశారు. దీంతో వ్యాన్ నేరుగా గౌరవెళ్లి ప్రాజెక్టు నీటిలోకి వెళ్లింది. నీళ్ల లోపలికి వెళ్లాడు.. వాహనం ముందు వెళ్లడం కష్టంగా మారింది. ఏంటింది...? ఏం జరిగింది అని డ్రైవర్ చుట్టూ గమనించాడు. కిందికి చూశాడు.. అప్పుడు దారితప్పామన్న విషయం అర్థమైంది. అప్పటికే డీసీఎం సగం వరకు ప్రాజెక్టు నీళ్లలో మునిగిపోయి ఉంది. వెంటనే.. నీళ్లలో నుంచి ఈదుకుంటూ బయటకు వచ్చేశారు డ్రైవర్, క్లీనర్. డీసీఎం మాత్రం నీళ్లలోనే ఉండిపోయింది.
సంఘటన జరిగిన తర్వాత రోజు ఆదివారం (డిసెంబర్ 10వ తేదీ) ఉదయం గ్రామస్తులకు విషయం చెప్పడంతో... అందరూ అక్కడికి వచ్చారు. డీసీఎంను బయటకు తెచ్చేందుకు సాయం చేశారు. జేసీబీ సాయంతో గౌరవెళ్లి ప్రాజెక్ట నీటిలో నుంచి డీసీఎంను బయటకు లాగారు. దీంతో... డ్రైవర్, క్లీనర్ హైదరాబాద్ బయల్దేరారు. చూశారుగా... గూగుల్ మ్యాప్‌ను నమ్ముకుంటే ఏమైంది. అన్నిసార్లు అలా కాకపోయినా.... మ్యాప్ చూపించిన దారిలో గుడ్డిగా వెళ్లకుండా... అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం.