Komatireddy Today : థాక్రేతో మరోసారి కోమటిరెడ్డి భేటీ - బీఆర్ఎస్‌తో పొత్తులపై మాట్లాడితే చర్యలు తప్పవన్న రేవంత్ !
కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి వ్యాఖ్యల వివాదం కొనసాగుతోంది. బీఆర్ఎస్‌తో పొత్తు గురించి మాట్లాడితే చర్యలు తప్పవని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Komatireddy Today : బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ భవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ధాక్రేతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యలను ప్రత్యేకంగా చూపిచిన ధాక్రే.. ఇది ఉద్దేశపూర్వకంగానే అన్నట్లుగా స్పష్టంగా ఉన్నాయని .. హైకమాండ్‌కు ఈ అంశంపై నివేదిక ఇస్తానని చెప్పినట్లుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి తీరుపై ఇప్పటికే హైకమాండ్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి. అయితే కోమటిరెడ్డి మాత్రం... పార్టీకి ఇబ్బంది కావాలన్న ఉద్దేసంతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని పదే పదే వివరణ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో హాత్ సే హాత్ జోడో యాత్రలను అందరూ చేస్తూంటే.. కోమటిరెడ్డి ఎందుకు చేయలేదని థాక్రే ప్రశ్నించారని అంటున్నారు.
తన వ్యాఖ్యలపై థాక్రేతో ఎలాంటి చర్చలు జరపలేదన్న కోమటిరెడ్డి
అయితే మాణిక్ రావు థాక్రేతో జరిగినభేటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుకు సంబంధించి తాను చేసిన కామెంట్స్ పై ఎలాంటి చర్చ జరగలేదని మీడియాకు ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలకు ఏ విధంగా సన్నద్ధం కావాలన్న దానిపైనే చర్చించినట్లు చెప్పారు. పార్టీ హైకమాండ్ ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించి టికెట్లు ఇవ్వాలని ఠాక్రేను కోరినట్టు వెంకట్ రెడ్డి చెప్పారు. గతంలో ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల గోల్కొండ హోటల్ లో గొడవలు జరిగిన విషయాన్ని గుర్తు చేశానని అన్నారు. తెలుగు దేశంతో పొత్తు వద్దని చెప్పానని ఆయన స్పష్టం చేశారు.
నెలాఖరు నుంచి నియోజకవర్గంలో పాదయాత్ర
మంగళవారం తాను చేసిన వ్యాఖ్యలను మీడియాలో తప్పుగా ప్రచారం చేశారని వెంకట్ రెడ్డి అన్నారు. ఓ సర్వే రిపోర్ట్ ఆధారంగానే తాను మాట్లాడినట్టు చెప్పారు. తన పాదయాత్ర ఈ నెలాఖరులో ఉంటుందన్న ఆయన.. భువనగిరి నుంచి దాన్ని మొదలుపెడతానని అన్నారు. ఉత్తమ్ కుమార్ నల్గొండలో మొదలుపెట్టి, ఖమ్మంలోనూ యాత్ర కొనసాగిస్తారని చెప్పారు. గ్రామాల్లో బైక్ యాత్రల ద్వారా రెడ్డి.. సర్కార్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్‌తో పొత్తులంటూ మాట్లాడితే చర్యలేననన్న రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రెేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీకి నష్టం కలిగించేలా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని ఎంత పెద్ద నాయకుడు మాట్లాడినా చర్యలు తప్పవని రాహుల్ గాంధీ గతంలోనే చెప్పిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. పార్టీకి నష్టం కలిగేలా ఎవరూ మాట్లాడవద్దని నాయకులకు ఆదేశించారు. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు.రేవంత్ రెడ్డి తీరుపై మాణిక్ రావు థాక్రే హైకమాండ్‌కు రిపోర్టు ఇస్తారని.. హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి వర్గీయులు అంచనా వేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

