Telangana PCC Chief: టీపీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ ఖరారు! అధికారికంగా వెల్లడించనున్న హైకమాండ్
Telangana Politics | టీపీసీసీ చీఫ్ ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ముగిసింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
Mahesh Kumar Goud to be next TPCC Chief | హైదరాబాద్: పీసీసీ పగ్గాలు చేపట్టే విషయంలో రేవంత్ రెడ్డి వారసుడు ఎవరు అన్న ఉత్కంఠకు తెర పడింది. తెలంగాణ పీసీసీ నూతన అధ్యక్షుడిగా ప్రస్తుత వర్కింగ్ ప్రసిడెండ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసినట్లు సమాచారం. నేడు, లేక ఒకట్రెండు రోజుల్లో ఆయన పేరును కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా వెళ్లడించనుంది. పీసీసీ అధ్యక్షుడి రేసులో కాంగ్రెస్ మంత్రులు సహా ముఖ్యనేతలు కొందరు పోటీ పడ్డారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి, మధుయాష్కీ గౌడ్, బలరాం నాయక్, సీతక్క పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం సాగింది. అయితే చివరికి రేసులో మహేశ్ కుమార్ గౌడ్, బలరాం నాయక్ లు పోటీ పడ్డారు.
మహేష్ గౌడ్‌కు కలిసొచ్చిన అంశాలివే..
సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం, బీసీ నాయకుడు కావడం, ఎన్.ఎస్. యూ ఐ నుండి పార్టీలో ఎదిగిన నేతగా మహేశ్ కుమార్ గౌడ్ కు కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పాటు పీసీసీ చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్ కే సీఎం రేవంత్ రెడ్డి మద్ధతు తెలపడంతో పార్టీ, ప్రభుత్వం మధ్య సన్వయం చెడిపోకుండా ఇరువురు తమ బాధ్యతలను నిర్వరిస్తారన్న కారణంతో కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ మద్దతు ఇచ్చిన మహేశ్ కుమార్ గౌడ్ కే పట్టం కట్టినట్లు సమాచారం. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ఆ యా పార్టీల నుండి చేరికలు, పాత నాయకులు- కొత్తగా చేరిన నాయకుల మధ్య సమన్వయం సాధించడం కొత్త పీసీసీ చీఫ్ టాస్క్ గా అధిష్టానం సూచించినట్లు సమాచారం.
వచ్చే ఎన్నికలకు బలమైన శక్తిగా కాంగ్రెస్
అంతే కాకుండ రానున్న రోజుల్లో జరిగే సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించడం, వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ను బలమైన శక్తిగా రూపొందించడం ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడి కర్తవ్యం. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ - డీఎస్ ( డి. శ్రీనివాస్) హయాంలో ఓసీ- బీసీ ఫార్ములా లా ఇప్పుడు రేవంత్ రెడ్డి – మహేశ్ కుమార్ గౌడ్ ల జోడి కాంగ్రెస్ కు మహర్ధశ పట్టిస్తుందన్న ఆశాభావం ఢిల్లీ పెద్దలు వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే డీఎస్ సైతం నిజామాబాద్ జిల్లా నుండే పీసీసీ చీఫ్ గా రెండు పర్యాయాలు బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవలే ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే జిల్లా కు తిరిగి పీసీసీ పగ్గాలు దక్కడం విశేషం.
శాసన సభ ఎన్నికలు, పార్లమెంట్ఎన్నికలు ముగియడంతో ఇక సీఎం రేవంత్ రెడ్డి పాలనా పరమైన అంశాల్లో పట్టు సాధించడమే కాకుండా, ప్రజలు ఇచ్చిన వాగ్ధానాల అమలులో పని చేయాల్సి ఉంది కాబట్టి త్వరగా పీసీసీ బాద్యతలు మరొకరికి అప్పగించాలని హై కమాండ్ పార్లమెంట్ ఎన్నికలు ముగియగానే పార్టీకి కొత్త సారధిని ఎంపిక చేసేందుకు త్వరగా నిర్ణయం తీసుకుంది. ఆషాఢమాసం రాక ముందే పీసీసీ చీఫ్ ను అంటే ఇవాళ లేకపోతే త్వరలోనే అధికారకంగా వెళ్లడించనున్నట్లు తెలుస్తోంది.