Shabbir Ali: కామారెడ్డిని అమ్మేసేందుకు కేసీఆర్ ప్లాన్, అందుకే ఆ కొత్త ఎత్తుగడ - షబ్బీర్ అలీ
Shabbir Ali: కామారెడ్డిని అమ్మేసేందుకు కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారని మాజీ మంత్రి, టీపీసీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ అన్నారు.
Shabbir Ali: కామారెడ్డిని అమ్మేసేందుకు కేసీఆర్ ప్లాన్ వేస్తున్నారని మాజీ మంత్రి, టీపీసీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. భూములను అమ్ముకోవడాని కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డి నుంచే సీఎం కేసీఆర్ పతనం ప్రారంభం అవుతుందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలన్నారు.
హైదరాబాద్, గజ్వేల్ లో రింగ్ రోడ్డు పేరుతో భూములు అమ్ముకుని.. ఇప్పుడు కామారెడ్డి చుట్టుపక్కల విలువైన భూములు అమ్మేందుకు కేసీఆర్ వస్తున్నారని షబ్బీర్ అలీ దుయ్యబట్టారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకమే కేసీఆర్ చేసిన అభివృద్ధి అని విమర్శించారు. కామారెడ్డికి రింగురోడ్డు వేస్తామని కేసీఆర్ చెబుతున్నారని, కామారెడ్డిని అమ్మేసేందుకే రింగురోడ్డు ప్రస్తావనను కేసీఆర్ తీసుకువస్తున్నారని ధ్వజమెత్తారు. కమీషన్లు దండుకుని నాణ్యత లేకుండా డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టారని తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని మరిచిపోవద్దని ప్రజలను కోరారు. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటుందన్నారు. గల్లీ గల్లీకి లిక్కర్ షాపులను సీఎం కేసీఆర్ తెరుస్తున్నారని, రాష్ట్రంలో ఇసుక మాఫియాను మంత్రి కేటీఆర్ నడుపుతున్నారని, రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవిత లిక్కర్ రాణిగా కొనసాగుతుందని విమర్శించారు. గద్దర్ చనిపోయే ముందు చెప్పిన మాటను ప్రతి ఒక్కరు నెరవేర్చాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పోరాడాలని షబ్బీర్ అలీ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కేసీఆర్ అవినీతి సొమ్ము ప్రజలకు పంచుతామని.. కేసీఆర్ ను జైలుకు పంపుతామని షబ్బీర్ అలీ అన్నారు. కేసీఆర్ ఒక్కడితోనే తెలంగాణ రాలేదని, సోనియా గాంధీ ఇవ్వడం వల్లే తెలంగాణ కళ సాకారమైందని షబ్బీర్ అలీ తెలిపారు. కామారెడ్డిలో కల్వకుంట్ల కుటుంబానికి కాంగ్రెస్ సైనికులకు మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. కామారెడ్డిలో కౌరవ బీఆర్‌ఎస్‌కు - పాండవుల కాంగ్రెస్‌కు యుద్ధం జరగబోతోందన్నారు. పాండవుల లాంటి కాంగ్రెస్ కార్యకర్తలు కౌరవుల లాంటి బీఆర్‌ఎస్‌ను ఓడించాలన్నారు. రాష్ట్రంలో మార్పు రావాలంటే కేసీఆర్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.