Sharmila : కాంగ్రెస్ వద్దన్నట్లే - ఇక షర్మిల ఏం చేయబోతున్నారు ?
షర్మిల చేరికను కాంగ్రెస్ వాయిదా వేస్తోంది. ఏ విషయం చెప్పడం లేదు. దీంతో ఆమె రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడింది.
Sharmila : కాంగ్రెస్‌లో చేరాలనే వైఎస్ షర్మిల ప్రయత్నాలు నిలిచిపోయాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనాన్ని ఏఐసీసీ అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. షర్మిల పార్టీని విలీనం చేసుకున్నా ఆమె నీడ మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పై వద్దంటున్నారు. షర్మిలను చేర్చుకోవడం అంటే.. కేసీఆర్ కు మరో అవకాశం ఇచ్చినట్లేనని వాదిస్తున్నారు. దీంతో హైకమాండ్ ఎటూ తేల్చుకోలేకపోతోంది.
డీకే శివకుమార్ ప్రయత్నాలూ విఫలం
మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా షర్మిలకు ఆదరణ లభించలేదు. పార్టీ బలపడలేదు. దీంతో వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే వైపు ఆమె అడుగులేశారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగానే డీకే శివకుమార్ ను కలిసి విలీన ప్రయత్నాలు చేశారు. ఆయన కూడా హైకమాండ్ తో మాట్లాడారు. అనేక ప్రయత్నాల తర్వాత షర్మిల ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్ లతో సమావేశం అయ్యారు. కానీ తర్వాత అంతా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు డీకే శివకుమార్ కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ తొలి జాబితా రెడీ - దసరా కల్లా పూర్తి లిస్ట్ ప్రకటించే చాన్స్ !
షర్మిల వల్ల మైనస్ అని తెలంగాణ నేతల రిపోర్టు
ఎన్నికల సమయంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరితే, అది బీఆర్‌ఎస్‌కు, సీఎం కేసీఆర్‌కు తెలంగాణ సెంటిమెంటు రెచ్చగొట్టడానికి అస్త్రంగా మారుతుందని టీపీసీసీ నేతలు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో పెత్తనం చేసేందుకు ఆంధ్రానేతలు వస్తున్నారంటూ కేసీఆర్ ప్రచారం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, వైఎస్ షర్మిల, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ గడ్డపై జమవుతున్నారంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్‌చేశారు. ఇప్పుడు షర్మిల కూడా చేరితే సమస్య అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పంపుహౌస్ ప్రారంభోత్సవంలోనూ సీఎం కేసీఆర్ పొతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకంతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన నేతల గురించి ప్రస్తావన చేయడం ద్వారా భవిష్యత్తులో వారి పెత్తనాన్ని సహించేది లేదంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారని చెబుతున్నారు.
కాంగ్రెస్‌లో ఎల్బీనగర్ రగడ - మధుయాష్కీకి టిక్కెట్ దక్కేనా ?
షర్మిల ఏం చేయబోతున్నారు?
ఇప్పటికైతే షర్మిల చేరికను తెలంగాణ నేతలు అడ్డుకున్నట్లే. ఆమె గురించి చర్చ కూడా డరగడం లేదు. అంటే కాంగ్రెస్ నుంచి ఆమెకు తలుపులు మూసుకుపోయినట్లేనని చెబుతున్నారు. ఏపీలో రాజకీయాలు చేయాలనుకున్నా.. పార్టీని విలీనం చేసుకుంటారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. దీంతో షర్మిల తన పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాల్సి ఉంది. కానీ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకత్వమే లేకపోవడంతో సమస్య అవుతోంది. విలీనం లేకపోతే షర్మిల అసలు ఎన్నికల్లో పోీట చేస్తారా లేదా అన్న సందేహం ప్రారంభమయింది.