Congress Rajagopal Reddy issue: దూకుడు పెంచుతున్న రాజగోపాల్ రెడ్డి - కాంగ్రెస్ పెద్దలు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు?
Rajagopal Reddy : ముఖ్యమంత్రిపై పదే పదే ఆరోపణలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ హైకమాండ్ నియంత్రించడం లేదు. క్రమశిక్షణా సంఘం కూడా పట్టించుకోవడం లేదు.

Congress high command not controlling Rajagopal Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిత్య అసంతృప్తివాదిగా మారారు. రోజూ ఆయన ధిక్కర ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. తనకు పదవి రాకపోవడానికి సీఎంనే కారణమని అంటున్నారు. తాజాగా నిధులు కూడా ఇవ్వడం లేదని.. పదవులు, నిధులు అన్నీ మీకేనా అని కూడా ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి రానురాను తన అసంతృప్తి డోసుని పెంచుకుంటూ పోతున్నారు. కానీ ఆయనను ఆపేందుకు ఎవరూ ప్రయత్నించకపోవడం కాంగ్రెస్ పార్టీలోనే చర్చనీయాంశమవుతోంది.
క్రమశిక్షణా కమిటీ పరిశీలిస్తుందన్న పీసీసీ చీఫ్
రాజగోపాల్ రెడ్డి ఇష్యూని ఇంకా కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఇంకా పరిగణనలోకి తీసుకోలేదు. ఆయనకు నోటీసులు ఇవ్వడం కానీ.. హెచ్చరికలు జారీ చేయడం వంటి చర్యలు తీసుకోలేదు. మల్లు రవి నేతృత్వంలో క్రమశిక్షణా కమిటీ ఇటీవల ఓ సారి సమావేశం అయింది. కానీ అప్పుడు పూర్తిగా కొండా మురళీ అంశంపైనే చర్చించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి ఫిర్యాదులు లేవని మల్లు రవి తెలిపారు. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి మరింతగా విమర్శల ధాటి ప్రారంభించారు. ఆయనపై ఏ చర్యలు ఉండవా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఎదురవుతోంది. దీంతో కోమటిరెడ్డి రాజగోపాల్ వ్యవహారాన్ని క్రమశిక్షణా కమిటీ పరిశీలించాలని ఆదేశించామని ఆయన చెప్పుకొచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నారో తెలుసుకుంటామన్నారు.
రాజగోపాల్ రెడ్డి ఉద్దేశం పీసీసీ చీఫ్‌గా తెలియదా ?
రాజగోపాల్ రెడ్డి ఉద్దేశం ఏమిటో టీపీసీసీ చీఫ్ కు తెలియకుండా ఉండదు. తనకు మంత్రి పదవి రాకుండా రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. కానీ ఆయనపై చర్యల విషయంలో సీరియస్ గా తీసుకోలేకపోతున్నారు. ఆయన ఎమ్మెల్యే కావడం మాత్రమే కాదు.. ఆయన సోదరుడు మంత్రిగా ఉన్నారు. అయితే ఆయన సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నా ఆయన సోదరుడు వెంకటరెడ్డి కూడా ఆపలేకపోతున్నారు. ఆయన మద్దతు రేవంత్ కే ప్రకటించారు. పదవులు రేవంత్ ఇవ్వరని.. హైకమాండ్ ఇస్తే అడ్డం పడరని అంటున్నారు.
మీనాక్షి నటరాజన్ కూడా సైలెంట్
కర్ణాటకలో ఓ మంత్రి రాహుల్ గాంధీ చేసిన ఓట్ల చోరీ ఆరోపణలకు వ్యతిరేకంగా మాట్లాడారని గంటల్లోనే ఆయనను పదవి నుంచి తప్పించారు. కానీ రాష్ట్రస్థాయిలో ఓ ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యే బహిరంగంగా విమర్శలు చేస్తున్నా హైకమాండ్ ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. కానీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉంటారని చెబుతూంటారు. ఆమె కూడా రాజగోపాల్రెడ్డికి హెచ్చరికలు జారీ చేయకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఆయనపై చర్యలు తీసుకోకుండా వదిలేస్తే.. రోజు రోజుకు డోస్ పెంచుకుంటూ పోతారని అది పార్టీకే నష్టం కలిగిస్తుందని క్యాడర్ అంటున్నారు. రాజగోపాల్ రెడ్డిని సైలెంట్ చేయడానికి హైకమాంండ్ ఏం చేస్తుందో చూడాల్సి ఉంది.





















