Telangana Latest News: "రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వడం లేదు ఏం చేయమంటారు?" కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Telangana Latest News: సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి విమర్సలు చేశారు. పదవులతోపాటు నిధులు కూడా ఇవ్వడం లేదన్నారు.

Telangana Latest News: గత కొన్ని నెలలుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఎందుకు అలాంటి కామెంట్స్ చేస్తున్నారో చెప్పుకొచ్చారు. తన నియోజకవర్గానికి కావాల్సిన నిధులు విడుదలలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. నిధులు లేక, పదవులు లేక ఏ చేయడానికి ఎమ్మెల్యేగా ఉన్నామంటూ ప్రశ్నించారు.
కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఎల్లగిరిలో వల్లభ్‌భాయి పటేల్ విగ్రహావిష్కరణ సలో పాల్గొని రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపించారు. వలిగొండ- చౌటుప్పల్ రోడ్డు నిర్మాణ బిల్లు రావడం లేదని అందుకే కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదని ఆరోపించారు. దీనిపై మంత్రిని అడిగితే తన చేతుల్లో ఏమీ లేదని అంతా ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నట్టు చెబుతున్నారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ విమర్శించం లేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోడ్లకు, బిల్డింగ్‌లకు నిధులు రావడం లేదని చెప్పుకొచ్చారు. ఎన్నిసార్లు మంత్రులను కలిసినా ప్రయోజనం లేదని వాపోయారు. ముఖ్యమంత్రి వద్ద మొరెట్టుకున్న ప్రయోజనం లేకుండా పోయిందని ఆరోపించారు. నిధులు ఇవ్వడం లేదని పదవులూ ఇవ్వడం లేదని అన్నారు. అందుకే ప్రజల తరఫున ప్రశ్నించాల్సి వస్తోందని వాపోయారు. అలాంటి టైంలో పదవులు, పైసల గురించి అడగాలా వద్దా అని నిలదీశారు.
పదవులు గురించి అధినాయకత్వం చూసుకుంటుందని రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వచ్చినప్పుడు అది కచ్చితంగా వస్తుందని ఎవరు ఆపినా ఆగదని అన్నారు. చేసిన పనులకు మాత్రం కచ్చితంగా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని అన్నారు. అందుకే అడుగుతున్నానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం మంచి నాయకులను ఎన్నుకోవాలని అప్పుడే నిధుల కోసం కొట్లాడేందుకు వీలు కలుగుతుందని అన్నారు.
తనకు మంత్రి పదవి రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డుపడుతున్నారనే కోపంతో ఉన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ మధ్య కాలంలో వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తున్నారు. పది పదిహేనేళ్లు తానే ముఖ్యమంత్రిని అని చెప్పుకున్న రేవంత్‌రెడ్డిని తప్పుపట్టారు. అక్కడి నుంచి మొదలైన ఈయన విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి. దీనిపై క్రమశిక్షణ సంఘానికి పలువురు ఫిర్యాదు చేశారు. ఆయనతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కూడా ప్రయత్నిస్తున్నట్టు మల్లు రవి ఈ మధ్య కాలంలో ప్రకటించారు. ఇంత జరుగుతున్నా తగ్గేదేలే అన్నట్టు రాజగోపాల్ రెడ్డి విమర్శలు కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు నేరుగా సీఎంను టార్గెట్ చేస్తున్న రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే చర్చ కాంగ్రెస్‌లో నడుస్తోంది.





















