Sitarama Project Credit : సీతారామ ప్రాజెక్ట్ ఘనత మాదంటే మాది - కాంగ్రెస్, బీఆర్ఎస్ క్రెడిట్ వార్ షురూ !
Telangana Politics : సీతారామ ప్రాజెక్ట్ క్రెడిట్ మాదంటే మాదని కాంగ్రెస్, బీఆర్ఎస్ వాదులాటకు దిగుతున్నాయి. తాము చేసిన పనుల్ని కాంగ్రెస్ చెప్పుకుంటోందని బీఆర్ఎస్ మండి పడుతోంది.
Sitarama Project Politics : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమయింది. ఇప్పటికే ట్రయల్ రన్ విజయవంంగా నిర్వహించారు. ఈ పంప్ హౌస్ నిర్మాణం పూర్తి కావడంతో ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు. తర్వాత రేవంత్ రెడ్డి బహిరంగసభలో ప్రసంగించనున్నారు.
2026 నాటికి ప్రతీ ఎకరాకు సాగునీరిస్తామన్న మంత్రి ఉత్తమ్
2026 ఆగస్టు నాటికి సీతారామ ప్రాజెక్టు కింద ప్రతి ఎకరాకు సాగునీరు అందించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కాంగ్రెస్ చెబుతోంది. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన సీతారామ ప్రాజెక్టు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో పూర్తయ్యే దశకు చేరుకుందని మంత్రులు ప్రకటించారు. గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ద్వారా పూర్తి ఆమోదం పొందామని.. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గోదావరి నది నుండి 67 టిఎంసిల నీరు అందుతుందని స్పష్టం చేస్తున్నరు. బీఆర్‌ఎస్ పాలనలో అసమర్థత, వృథా ఖర్చులు ఉన్నాయని, రీడిజైనింగ్ ముసుగులో ప్రాజెక్టు వ్యయాన్ని రూ.2,400 కోట్ల నుంచి రూ.18,000 కోట్లకు పెంచారని అంటున్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేస్తోందన్నారు.
కేసీఆర్ విజయాలను కాంగ్రెస్ తనవిగా చెప్పుకుంటోందన్న హరీష్ రావు
సీతారామ ప్రాజెక్టు బీఆర్ఎస్ కష్టానికి ప్రతిఫలమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ సాధించిన విజయాలను మీవిగా చెప్పుకోవడానికి తాపత్రయం పడుతున్నారని మండిపడ్డారు. ఎనిమిది నెలల కాలంలో ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం కోసం మేం కృషి చేస్తుంటే ఇదే కాంగ్రెస్ నాయకులు కోర్టుల్లో కేసులు వేశారు... అప్పుడు బీఆర్ఎస్‌లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావు మాట మార్చారున్నారు. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం బీఆర్ఎస్ పార్టీ ఘనత కాదని తుమ్మలను గుండెల మీద చేయి వేసుకోని చెప్పాలని సవాల్ చేశారు. కేసీఆర్ లేకుండా ఉంటే అంత గొప్పగా సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగేది కాదని సీతారామ కేసీఆర్ కల.. ఇది ఆయన కృషి ఫలితం అని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ హయాంలోనే 90 శాతం ప్రాజెక్టు పని పూర్తి
బీఆర్ఎస్ హయాంలో 90 శాతం ప్రాజెక్టు పూర్తయిందని హరీష్ రావు లెక్కలు చూపించారు. పంపులు, మోటార్లు కూడా అప్పుడే పెట్టాం. సబ్ స్టేషన్ల నిర్మాణం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే జరిగింది. ఇది అందరికీ తెలుసు. ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లు ప్రజలను నమ్మించడం పొరపాటన్నారు. మీ పరిపాలనలో నిర్మించినప్పుడు మీ ఘనతగా చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు. ఇతరుల ఘనతను తమ ఘనతగా చెప్పుకునే దరిద్రం నుంచి బయటకు రావాలని హరీశ్‌రావు సలహా ఇచ్చారు.
మొత్తంగా పదిహేనో తేదీన రేవంత్ రెడ్డి ప్రారంభించనున్న సీతారామ ప్రాజెక్టు మరింత రాజకీయ దుమారం రేగడం ఖాయంగా కనిపిస్తోంది.