Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
Tirumala Laddu Controversy | తిరుమలలో కల్తీ నెయ్యి వినియోగించారని, లడ్డూను అపవిత్రం చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వైఎస్ జగన్, టీటీడీ ఛైర్మన్ లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు.
Complaint against YS Jagan and TTD Chairman in Tirumala Ghee Controversy | హైదరాబాద్: తిరుమలలో కల్తీ నెయ్యి వాడకంపై హిందూ సంఘాలు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో అపచారానికి కారకులైన వైసీపీ అధినేత వైఎస్ జగన్, టీటీడీ చైర్మన్ లపై, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారని, అందుకు కారణమైన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కె కరుణసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి సైదాబాద్ పోలీసులకు శనివారం నాడు ఆయన ఫిర్యాదు చేశారు.
అడ్వకేట్ కరుణసాగర్ తన ఫిర్యాదులో ఏం పేర్కొన్నారంటే..
‘తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిపారు. తక్కువ నాణ్యత గల నెయ్యిని తిరుమల శ్రీవారి ప్రసాదాలలో వినియోగానికి అనుమతించినందుకు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు టీటీడీ ఛైర్మన్, బోర్డు సభ్యులు, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి. తిరుమల కొండపై వెలిసిన శ్రీ వేంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భక్తులు విశ్వసిస్తారు. మానవాళిని రక్షించడానికి భూమిపై అవతరించిన శ్రీమహావిష్ణువు స్వరూపమని శ్రీ వెంకటేశ్వరస్వామిని భక్తులు పూజిస్తారు. తిరుమలను కలియుగ వైకుంఠం అని చెబుతారు.
ఓ హిందువుగా నేను శ్రీ వేంకటేశ్వర స్వామిని భక్తితో పూజిస్తాను. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తాను. గత 300 ఏళ్లకుపైగా లడ్డూ ప్రసాదంలో భాగమై ఉంది. స్వామి వారికి నిత్యం నైవేద్యం సమర్పణ, లడ్డూ నివేదన చేస్తున్నారు. లడ్డూ ప్రసాదం స్వీకరించకపోతే స్వామి వారి దర్శనం అసంపూర్ణమే.
రిపోర్ట్ ఫలితాలు విని షాకయ్యాను..
పవిత్రమైన తిరుమల ఆలయంలో ప్రసాదాలకు జంతు కొవ్వు వినయోగించారని ఎన్‌డీడీబీ సంస్థ చేసిన పరీక్షలలో తేలిందని తెలిసి నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. ప్రపంచంలో ఫేమస్ అయిన తిరుమల శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు. ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో జంతువుల కొవ్వును వినియోగించిన తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. తక్కువ క్వాలిటీ నెయ్యి వినియోగించి తిరుమలలో పెద్ద అపచారం చేశారు. 300 ఏళ్ల సంప్రదాయానికి భిన్నంగా ఏపీ గత ప్రభుత్వం వ్యవహరించి కల్తీ నెయ్యితో ప్రసాదాలు చేసి భక్తులకు అందించింది. కోట్లాది శ్రీవెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. శాఖహారం తీసుకునే వారి బాధ వర్ణనాతీతం.
తిరుమలలో కల్తీ నెయ్యి అంశంపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలి. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, టీటీడీ ఛైర్మన్, బోర్డు సభ్యులు, అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యమైన కేసుగా పరిగణించి.. హిందువుల మనోభావాలు దెబ్బతీసినందుకు ఐపీసీ సెక్షన్లు 298, 299 కింద చర్యలు తీసుకోవాలని’ తెలంగాణ హైకోర్ట్ అడ్వకేట్ సైదాబాద్ పోలీసులకు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.