Telangana Official Symbol: తెలంగాణ అధికారిక చిహ్నం మార్పు - గ్రూప్-1 అభ్యర్థులకు వయో పరిమితి పెంపు, అసెంబ్లీలో సీఎం రేవంత్ కీలక ప్రకటన
Telangana Assembly Session: ప్రజాస్వామ్యంలో రాచరికం ఉండకూడదని భావిస్తున్నామని.. అందుకు అనుగుణంగానే చిహ్నం, పేరు మార్పు వంటి నిర్ణయాలు తీసుకున్నామని సీఎం రేవంత్ అన్నారు.
CM Revanth Reddy Speech in Telangana Assembly Budget Session 2024: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం మారుస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శుక్రవారం అసెంబ్లీలో (Telangana Assembly) కీలక ప్రకటన చేశారు. ప్రజాస్వామ్యంలో రాచరికం ఉండకూడదని భావిస్తున్నామని.. అధికారిక చిహ్నంలో రాచరిక ఆనవాళ్లు ఉన్నాయని అందుకే చిహ్నం మార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 'తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం టీడీ అని రాసుకునేవాళ్లం. వాహనాలు, బోర్డులపై అంతా టీజీ అని రాసుకున్నారు. కొందరు యువకులు తమ గుండెలపై పచ్చబొట్టు కూడా వేసుకున్నారు. కేంద్రం సైతం తమ నోటిఫికేషన్ లో టీజీ అనే పేర్కొంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేము రాష్ట్ర అక్షరాలను టీజీగా మార్చాలని నిర్ణయించాం. జయజయహే గీతం తెలంగాణ ఉద్యమ సమయంలో అందరికీ స్ఫూర్తి ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక ఆ పాట రాష్ట్ర గీతం అవుతుందని అంతా భావించినా.. ఆ పాటను నిషేధించినంత పని చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పాటను రాష్ట్ర గీతంగా గుర్తించాం. తెలంగాణ తల్లి అంటే మనకు అమ్మ, అక్క, చెల్లి గుర్తు రావాలి. తెలంగాణ ఆడబిడ్డలు కిరీటాలు పెట్టుకుని ఉండలేదు. తెలంగాణ తల్లి శ్రమజీవికి ప్రతీకగా ఉండాలి.' అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంలో చార్మినార్, కాకతీయుల ఆనవాళ్ల వంటి రాచరిక పోకడలు ఉన్నాయి - సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/C6O4H5SsSv
— Telugu Scribe (@TeluguScribe) February 9, 2024
గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్ న్యూస్
గ్రూప్ 1 అప్లికేషన్ వయోపరిమితి 46కు పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం pic.twitter.com/ENekINkd97
— Telugu Scribe (@TeluguScribe) February 9, 2024
తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులకు అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచి త్వరలోనే గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. కొన్ని నిబంధనల వల్ల TSPSC ప్రక్షాళన ఆలస్యమైందని.. నలుగురి ఉద్యోగాలు పోయిన దుఃఖంలో విపక్ష నేతలు 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసే వాళ్లం కాదని, ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్లం కాదని అన్నారు.
'కేసీఆర్ అసెంబ్లీకి రావాలి'
తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్ష బాధ్యత అప్పగించారని.. అయినా ఆ పార్టీ అధినేత అసెంబ్లీకి రాకపోవడం దురదృష్టకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. '80 వేల పుస్తకాలు చదివిన మేధావిని అని కేసీఆర్ పదే పదే చెప్పుకొంటారు. ఆ మేథస్సును 4 కోట్ల మంది ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగిస్తారనుకున్నాం. ప్రభుత్వ నిర్ణయాలపై సలహాలు, సూచనలు ఇస్తారని అనుకున్నాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి కుర్చీ ఖాళీగా ఉండటం సమాజానికి మంచిది కాదు.' అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ శాసనసభకు వచ్చి తమ ప్రభుత్వానికి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 9 నాటికి తమ ప్రభుత్వం 2 నెలలు పూర్తి చేసుకుందని.. ఈ కాలంలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు వంటి గ్యారెంటీలు అమలు చేశామని చెప్పారు. త్వరలోనే మరో 2 గ్యారెంటీలు అమలు చేస్తామని అన్నారు. ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు వేశామని.. ప్రతిపక్షం సహకరించకున్నా ప్రజా పాలన అందిస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
'త్వరలోనే 15 వేల ఉద్యోగాలు'
ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలకు ఆందోళన అవసరం లేదని.. ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల కల్పన ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 'త్వరలోనే పోలీస్ శాఖలో 15 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. యూనివర్శిటీల వీసీల నియామకం కోసం సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశాం. వర్శిటీల్లో ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తాం. ఇప్పటికే 80 శాతం పెన్షన్లు అందించాం. మిగతా 20 శాతం కూడా 15 రోజుల్లో ఇచ్చి పెన్షనర్లను ఆదుకుంటాం. నియోజకవర్గ సమస్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నన్ను కలిస్తే వారిని అనుమానిస్తున్నారు. సీఎంగా అందరినీ కలవడం, వాళ్ల సమస్యలు పరిష్కరించడం నా బాధ్యత. బీఆర్ఎస్ పద్ధతిలో నేను చేయను. గతపు ఆనవాళ్లను సమూలంగా ప్రక్షాళన చేసే బాధ్యత నాది.' అని పేర్కొన్నారు.
'ఆ బాధ్యత కేసీఆర్ దే'
2014 నుంచి 2018 వరకు బీఆర్ఎస్ ఒక్క ఆడబిడ్డకు మంత్రి పదవి ఇవ్వకపోయినా ఎవరూ ప్రశ్నించలేదని సీఎం రేవంత్ గుర్తు చేశారు. 'తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో కాళోజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి చేయలేదు?. ఆ కళా క్షేత్రాన్ని పూర్తి చేసి వారి గౌరవాన్ని కాపాడుతాం. రూ.97,500 కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరంతో 90 వేల ఎకరాలు కూడా నీళ్లు అందలేదన్నది వాస్తవం కాదా?. కృష్ణా ప్రాజెక్టులను మేం కేంద్రానికి అప్పగించామని బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారు. పునర్విభజన చట్టంలో అభ్యంతరం పెట్టకుండా వారి సూచనతోనే చట్టం చేసినట్లు కేసీఆర్ చెప్పుకున్నారు. అందులో లోపాలకు బాధ్యత కేసీఆర్ దే. ఆ పార్టీ వాళ్లు ధర్నా చేయాల్సింది నల్గొండలో కాదు. చేతనైతే జంతర్ మంతర్ లో కేసీఆర్, హరీష్, కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయండి.' అంటూ హితవు పలికారు.
ఏపీ సీఎంపై విమర్శలు
కృష్ణా నదీ జలాలను ఏపీకి ధారాదత్తం చేసింది వారు కాదా? అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం నీళ్లు తరలించుకుపోతుంటే కేసీఆర్ సీఎంగా ఉండి ఏం చేశారని నిలదీశారు. 'శ్రీశైలం నుంచి రోజుకు సుమారు 13 టీఎంసీల నీటిని ఏపీ ప్రభుత్వం తరలించే ప్రయత్నం చేస్తోంది. మనకు రోజుకు 2 టీఎంసీలు తరలించే ప్రాజెక్టు కూడా లేదు. వీళ్లు జగన్ ను పిలిచే పంచభక్ష పరమాన్నం పెడితే ఆయన బొక్క పెట్టిండు' అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మేలు కోసం ప్రతిపక్షం పని చేయాలని.. తెలంగాణ పునఃనిర్మాణంలో అందరి సహకారం ఉంటుందని భావిస్తున్నట్లు సీఎం చెప్పారు.