Telangana municipal elections 2026: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి - ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి - సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
CM Revanth Reddy : మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ పున్నమి నాగు జంటలా కలసిపోయారన్నారు.

CM Revanth Reddy calls voters: తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ప్రజలు తమ భవిష్యత్తును తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న రహస్య ఒప్పందాలు పున్నమి నాగు సినిమాలో నాగుపాము, పింజరలు కలిసి డ్యాన్స్ చేసినట్లుగానే.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలను పక్కనపెట్టి రాజకీయ లబ్ధి కోసం ఒక్కటయ్యాయి అని ఆయన ఆరోపించారు. పన్నెండేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏ ఒక్క జాతీయ ప్రాజెక్టును కూడా తీసుకురాలేదని, చివరికి తాము చెల్లించే పన్నుల వాటాలో కూడా అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
కేంద్రం నుంచి నిధులు తెస్తామని ప్రగల్భాలు పలుకుతున్న బండి సంజయ్, కిషన్ రెడ్డిల తీరును రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లే ప్రతి ఒక్క రూపాయిలో కేవలం 42 పైసలు మాత్రమే తిరిగి వస్తుంటే, ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్‌కు 6 రూపాయలు, యూపీకి 2.90 రూపాయలు ఇస్తున్నారని గణాంకాలతో వివరించారు. ఈ వివక్షపై బీజేపీ మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్ వరదల సమయంలో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని, గల్లీ ఎన్నికలకు మోదీకి ఏం సంబంధం.. మోదీ వచ్చి డ్రైనేజీ క్లీన్ చేస్తారా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై కూడా ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల్లో మళ్ళీ ఓట్లు అడగడానికి కేసీఆర్ కుటుంబానికి ఏం ముఖం ఉంది అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వందల కోట్లు వసూలు చేసిన ఉన్మాద పాలన వారిదని, విచారణకు పిలిస్తే ముసుగులు వేసుకుని తప్పించుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల అరెస్టు కాకుండా బీజేపీ వాళ్లను కాపాడుతోందని, యాసిడ్ పోసి కడిగితే తప్ప బీఆర్ఎస్ పట్టిన పీడ వదలదని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగబద్ధంగా వచ్చే నిధులను కూడా తామే తెచ్చామని గొప్పలు చెప్పుకోవడం అన్యాయమన్నారు.
అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి ఏకరువు పెట్టారు. మొదటి తారీఖునే జీతాలు ఇవ్వడం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంచడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం రూ.9 వేల కోట్లు కేటాయించడం వంటి విజయాలను ప్రస్తావించారు. కేవలం తొమ్మిది రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని, 70 వేల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని గుర్తు చేశారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులతో తెలంగాణ భవిష్యత్తును మారుస్తున్నామని చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల తీర్పులో పన్నెండేళ్ల మోదీ పాలన, పదేళ్ల బీఆర్ఎస్ అరాచకం,యు రెండేళ్ల కాంగ్రెస్ ప్రజాపాలనను బేరీజు వేసుకోవాలని ఓటర్లను కోరారు. ఈ ప్రభుత్వం మీది.. మీ కోసం పనిచేస్తుంది. తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్రంతో కొట్లాడడానికైనా సిద్ధం అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. మరో ఎనిమిదేళ్ల పాటు తామే అధికారంలో ఉంటామని, అభివృద్ధి చేసే బాధ్యతను ముఖ్యమంత్రిగా, మున్సిపల్ మంత్రిగా తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.























