CM Revanth Reddy: 'ఫిబ్రవరి మొదటి వారంలో మరో 2 గ్యారెంటీలు' - వారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్
Telangana News: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంలో మరో 2 గ్యారెంటీలు అమలు చేయబోతున్నట్లు చెప్పారు.
CM Revanth Reddy Comments on Another Two Guarantees: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే 2 గ్యారెంటీలను అమలు చేశామని.. ఫిబ్రవరి మొదటి వారంలో మరో 2 గ్యారెంటీలు అమలు చేయబోతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ (Hyderabad) ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ బూత్ లెవల్ లీడర్స్ సమావేశంలో గురువారం ఆయన కీలక ప్రకటన చేశారు. అలాగే, ఫిబ్రవరి నెలాఖరు వరుకూ రైతు భరోసా నగదు అందిస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు.
'తెలంగాణ పునఃనిర్మించే మేస్త్రీని'
కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు పడ్డ శ్రమ మరిచిపోలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రతోనే కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చినట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పామని.. రెండ్రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 50 రోజులైనా కాకముందే హామీల అమలు ఎక్కడా అని బీఆర్ఎస్ నేతలు అడుగుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన హామీలను అమలు చేశారా.? అని ప్రశ్నించారు. పదేళ్లలో కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దాలన్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ చేసినా, ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నామని చెప్పారు. కొందరు తనను మేస్త్రీ అంటూ విమర్శలు చేస్తున్నారని.. దానిపైనా కౌంటర్ ఇచ్చారు. 'అవును.. నేను మేస్త్రీనే. తెలంగాణను పునఃనిర్మించే మేస్త్రీని. ఇదే కాదు బిడ్డా. మిమ్మల్ని గోతిలో పాతిపెట్టి ఘోరీ కట్టే మేస్త్రీని నేనే. ఈ నెలాఖరులో ఇంద్రవెల్లి వస్తాను. కాస్కోండి.' అంటూ సవాల్ విసిరారు.
'బీఆర్ఎస్ ను తరిమికొడదాం'
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవినీతిపరులు, కోటీశ్వరులను రాజ్యసభకు పంపించారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బలహీన వర్గాల బిడ్డలు శామ్యూల్, వెడ్మ బొజ్జుకి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చి గెలిపించిందని అన్నారు. రైతు బిడ్డనైన తాను కాంగ్రెస్ లో సీఎంగా ఎదిగానని.. పార్టీలో అందరికీ అవకాశాలు ఉంటాయని చెప్పారు. లోక్ సభ ఎన్నికలు అత్యంత కీలకమని.. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించామని, పార్లమెంట్ ఎన్నికల్లో తరిమికొడదామని పిలుపునిచ్చారు. త్వరలో పులి వస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని.. పులి వస్తే బోనులో పెట్టి బొంద పెడతామని మండిపడ్డారు. అభ్యర్థులను మారిస్తే గెలిచే వారమని బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'మార్చాల్సింది అభ్యర్థులను కాదు.. కేసీఆర్ కుటుంబాన్ని' అంటూ ఎద్దేవా చేశారు. మోదీ, కేసీఆర్ ఒక్కటేనని రేవంత్ దుయ్యబట్టారు.
'రాహుల్ ను ప్రధానిని చేయాలి'
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని ఓడించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 18 ఏళ్లకే ఓటు, యువతకు కంప్యూటర్లు పరిచయం చేసింది రాజీవ్ గాంధీనే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాడినప్పుడు.. ఈ బీజేపీ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. దేశం కోసం కాంగ్రెస్ నాయకులు త్యాగాలు చేశారని గుర్తు చేశారు. బీజేపీ నాయకులు దేశం కోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు.