Revant Comments On Modi : మహారాష్ట్ర, యూపీల్లో రాజీనామా చేస్తారా ? - మోదీకి రేవంత్ కౌంటర్
Telangana Politics : ప్రధాని మోదీకి సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్ర, యూపీల్లో బీజేపీకి తక్కువ సీట్లు వచ్చాయని మరి అక్కడ రాజీనామాలు చేస్తారా అని ప్రశ్నించారు.
CM Revanth countered PM Modi : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఎన్డీఏ సమావేశంలో కర్ణాటక, తెలంగాణల్లో తమకు ఎక్కువ సీట్లు వచ్చాయని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయాయన్నారు.అందుకే ఎన్డీఏ కూటమికి మెజార్టీ ఇచ్చారని ప్రకటించారు. దీనిపై రేవంత్ రెడ్డి ఊహించని విధంగా స్పందించారు. అలా అయితే మహారాష్ట్ర, యూపీలో బీజేపీకి ఏమైనా ఎక్కువ సీట్లు వచ్చాయా ? అక్కడ ఇంకా ఎందుకు బీజేపీ, మిత్రపక్షల ప్రభుత్వం నడుస్తున్నాయో చెప్పాలన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చారు.. ఈ ఎన్నికల్లో మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందని సెటైర్ వేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు రేవంత్ ఢిల్లీ వెళ్లారు.
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడిందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టంగా అర్ధమైందన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగిందని చెప్పారు రేవంత్. యూపీలో బీజేపీని ప్రజలు తిప్పికొట్టారని విమర్శించారు. 2023 శాసనసభ ఎన్నికల్లో 39.5శాతం ఓట్లతో ప్రజా పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారు. వందరోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగాం. ఈ ఎన్నికలు మా వంద రోజుల ప్రజా పాలనకు రెఫరెండం అని ముందే విస్పష్టంగా చెప్పాము. 17పార్లమెంట్ స్థానాల్లో 8 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో 41శాతం ఓట్లు కాంగ్రెస్‌కు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 39.5శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మా ఓట్ల శాతం పెరిగింది. మా పరిపాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ ఫలితాలతో అర్ధమవుతోంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిపించి ప్రజలు మాకు మరో సీటు అదనంగా ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టు భర్తీ, పీసీసీ చీఫ్ పదవుల నియామకం ఉంటాయని కాంగ్రెస్‌లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ అంశాల్లో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది ఆసక్తిగా మారింది. ఇక నేడు జరగబోయే సీడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షీ, సిఎం రేవంత్ పిసిసి చీఫ్ హోదాలో ఈ భేటీకి వెళ్తుండగా, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి, శాశ్వత ఆహ్వానితుడు దామోదర్ రాజనర్సింహాలు సైతం హాజరవుతున్నారు.
ఇప్పటికే కొత్త పిసిసి కోసం కసరత్తు చేస్తోంది. సీనియార్టీతో పాటు పార్టీకి విధేయంగా ఉన్న వారికే పార్టీ పగ్గాలు ఉంటాయని తెలుస్తోంది. నేడు ఢిల్లీలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశంలో పార్లమెంట్ ఫలితాలపై, ఈ ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల రాష్ట్రాలపై చర్చ జరుగనుంది. అదే విధంగా పలు రాష్ట్రాల పీసీసీ చీఫ్ ల మార్పుపై కూడా చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.