KCR In Hyderabad : హైదరాబాద్ చేరుకున్న కేసీఆర్ - అందుబాటులో ఉన్న నేతలతో అత్యవసర సమావేశం !
హైదరాబాద్ తిరిగి వచ్చి పార్టీ నేతలతో అత్యవసరంగా సమావేశమయ్యారు సీఎం కేసీఆర్. మునుగోడు ఎన్నికల అంశంపై చర్చించారు.
KCR In Hyderabad : దాదాపుగా వారం రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. ఇలా హైదరాబాద్ వచ్చిన వెంటనే అందుబాటులో ఉన్న మంత్రులు, పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. మునుగోడు ఎన్నికలపై చర్చించారు. కారును పోలిన గుర్తులు ఇతరులకు కేటాయించవద్దని టీఆర్ఎస్ పదే పదే విజ్ఞప్తి చేసినా ఎన్నికల సంఘం పట్టంచుకోలేదు. అదే సమయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలో మంజూరు అయిన గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం అనుకుంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పంపిణీ చేయవద్దని ఈసీ ఆదేశించింది. వీటన్నింటిపై కేసీఆర్ పార్టీ నేతలతో చర్చలు జరిపారు.
మునుగోడులో గొర్రెల పంపిణీపై ఈసీ ఆంక్షలపై మంత్రులు, అధికారులతో చర్చలు
మునుగోడులో కేసీఆర్ ప్రచారంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఆయన ఒకటి, రెండు బహిరంగసభల్లో ప్రసంగిస్తారని గతంలో టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. అయితే ఎప్పుడు బహిరంగసభ పెట్టాలన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మునుగోడులో రాజకీయ పరిస్థితులపై ఓ అవగాహనకు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దసరా రోజున బీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు. ఆ తర్వాత రెండు రోజులకే మునుగోడు నోటిఫికేషన్ వచ్చింది. ఈ కారణంగా టీఆర్ఎస్ తరపునే మునుగోడులో పోటీ చేస్తున్నారు. జాతీయ రాజకీయాల సన్నాహాల్లో ఉన్న కేసీఆర్.. వారం రోజుల పాటు ఢిల్లీలో ఉండి...బుధవారమే తిరిగి వచ్చారు. అందుకే మునుగోడుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోయారు.
వారం రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చిన కేసీఆర్
వారం రోజుల వరకూ ఢిల్లీలో ఉన్న కేసీఆర్ అక్కడ అధికారంగా ఎవరితోనూ సమావేశం కాలేదు. పార్టీ కార్యాలయాల నిర్మాణాలను మాత్రం పరిశీలించారు. ఇటీవల కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీ పర్యటన నిర్వహించినా వారం , పది రోజుల పాటు ఉంటున్నారు. కానీ అన్ని రోజూలూ పెద్దగా ఎవరితోనూ భేటీ కారు. తెర వెనుక కార్యక్రమాలు చక్క బెడుతూ వస్తున్నారు. ఈ సారి కూడా.. జాతీయ పార్టీ విషయంలో కొన్ని కీలకమైన పనుల్ని చక్కబెట్టారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫలితాలు ముందు ముందు కనిపిస్తాయని చెబుతున్నారు. బీఆర్ఎస్ పై ఈసీ పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చిన తర్వాతే మీడియాతో మాట్లాడే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
మునుగోడు ఉపఎన్నికపై ప్రత్యేక దృష్టి
ప్రస్తుతం కేసీఆర్ మునుగోడు ఉపఎన్నికపై దృష్టి సారించారు. ఏడాది పదవీ కాలం ఉన్నప్పటికీ .. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. ఈ ఎన్నికలో బీజేపీ గెలిస్తే .. పూర్తిగా రాజకీయం మారిపోతుందన్న అంచనాల మధ్య .. కేసీఆర్.. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్వయంగా ఎన్నికను పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్ స్వయంగా తాను కూడా ఓ గ్రామానికి ఇంచార్జిగా ఉన్నారు. 86మంది ఎమ్మెల్యేలూ మునుగోడులో ప్రచారం నిర్వహిస్తున్నారు.
బీజేపీ గూటికి మాజీ ఎంపీ బూర నర్సయ్య, మరో 16 మంది కూడా కాషాయ తీర్థం