Breaking News Live: విత్తన పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తగ్గడంతో వేడి ప్రభావం చూపుతోంది. పొడి గాలులు వీచడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తెల్లవారుజామున, రాత్రులు చల్లగా ఉంటున్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం వేడి, ఉక్కుపోత అధికంగా ఉంటున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల 25 డిగ్రీల మేర నమోదు కావడం వాతావరణంలో మార్పులను స్పష్టంగా సూచిస్తుంది.
ఏపీలో నైరుతి, దక్షిణ దిశల నుంచి వేగంగా గాలులు వీస్తున్నాయి. మరో మూడు రోజులపాటు ఏపీలో వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేడి గాలులు వీస్తాయి. వర్షాలు లేకపోవడంతో రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రలు భారీగా పెరుగుతున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వాతావరణం పొడిగా ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు కొన్నిచోట్ల 36 డిగ్రీలు నమోదు కానున్నాయి. వేటకు వెళ్లడానికి మత్స్యకారులకు ఏ ఇబ్బంది లేదు. అత్యల్పంగా జంగమేశ్వరపురం, బాపట్ల, నందిగామ, కళింగపట్నం, అమరావతి, విశాఖపట్నంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉంటుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 37-38 డిగ్రీలు చేరే అకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగానే పెరిగాయి. రాష్ట్రంలో పొడి గాలులు పెరగడం వల్ల అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ రోజు ఉష్ణోగ్రతలు ఎండలు ఎక్కువగా ఉండటంతో ఉక్కపోత తప్పదు. రాత్రులు మాత్రం చల్లగా ఉంటున్నా, మధ్యాహ్నాలు మాత్రం వేడిగా ఉంటుంది. ఆరోగ్యవరం, అనంతపురం లాంటి ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 25కి చేరువలో ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగున్నాయి. కొన్ని చోట్ల మాత్రమే వాతావరణం పొడిగా ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో మాత్రం 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా ఆదిలాబాద్ ఏజెన్సీలో 18 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఇతర జిల్లాల్లో కనీసం 20 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు అతి భారీగా ఎగబాకింది. గ్రాముకు ఏకంగా రూ.125 చొప్పున ఎగబాకిపోయింది. వెండి కూడా అదే దారిలో గ్రాముకు రూ.2.70 పెరిగి కిలోకు రూ.2,700 పెరిగిపోయింది. దీంతో తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.47,250 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,550 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.72,700 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,250 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,550గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.72,700 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,250 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,550గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.72,700 వేలుగా ఉంది.
డీసీసీబీ బ్యాంక్ లో 1.60 కోట్లు షేర్ కాపిటల్ పక్కదారి
తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం డీసీసీబీ బ్యాంక్ లో 1.60 కోట్లు షేర్ కేపిటల్ ను ప్రక్కదారి పట్టించారు. బ్యాంక్ లో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగే కీలక సూత్ర దారి అని భావిస్తున్నారు. కేవలం మూడు నాలుగు ఇంటి పేర్లతో ఉన్నవారిని ఎంపిక చేసుకొని షేర్ కేపిటల్ నుంచి సుమారు కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లు తెలిసింది. దీనిపై ఆప్కాబ్ అధికారుల బృందం అరా తీసింది. ఒక ఉద్యోగి ఐడీ ద్వారా షేర్ కేపిటల్ సొమ్మును దారిమళ్లించి డీసీసీబీ అకౌంట్ ల ద్వారా నగదును డ్రా చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై ఎంక్వైరీ అధికారి డీజీఎం వెంకటేశ్వరరావు రికార్డుల ను ,ఆన్లైన్ లావాదేవీలను పరిశీలించారు. బ్యాంక్ లో షేర్ కేపిటల్ గోల్ మాల్ చేసిన ఉద్యోగిని విధుల నుండి తొలగించారు.
కూకట్ పల్లిలో హైటెక్ పేకాట రాకెట్ గుట్టురట్టు
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో హైటెక్ పేకాట రాకెట్ గుట్టురట్టయింది. లోథా అపార్ట్‌మెంట్స్‌లో హైటెక్ పేకాట నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు.. మాదాపూర్ ఎస్వీటీ పోలీసులు దాడులు నిర్వహించారు. హైటెక్ పేకాట నిర్వహిస్తున్న మురళి అనే వ్యక్తిని పట్టుకున్నారుమరో 13 మందిని కూడా అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం రూ.లక్షన్నరకు లోథా అపార్ట్‌మెంట్‌లో మురళి ఫ్లాట్ రెంట్‌కు తీసుకున్నారు. సంపన్నులు నివసించే లోథా అపార్ట్మెంట్‌లో స్వేచ్ఛగా నిర్వహిస్తున్న పేకాట కేంద్రం కోసం వాట్సాప్ ద్వారా సమాచారం అందించి అందరద్నీ రప్పించేవాడు. వీరి నుంచి రూ.2.52 లక్షలతో పాటు 13 మొబైల్ ఫోన్స్, 10 సెట్ల పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
Jagityal News: తల్లిదండ్రులకి న్యాయం కావాలని రోడ్డెక్కిన పిల్లలు - కలెక్టర్, ఎస్పీని చేరాలని విజ్ఞప్తి
తన తండ్రికి అన్యాయం జరిగిందంటూ ఇద్దరు పిల్లలు రోడ్డెక్కడం.. చూసేవారిని కంటతడి పెట్టిస్తోంది. జగిత్యాల జిల్లాలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు అక్కా తమ్ముళ్లు తన తండ్రికి న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నారు. కొంత మంది తమ తల్లిదండ్రులను మోసం చేశారంటూ, వారిని గుర్తించి పట్టుకోవాలని వేడుకున్నారు. ఈ మేరకు ఆ పిల్లలు ఓ వీడియోను విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘‘జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి సార్ గారికి, జిల్లా ఎస్పీ సింధు శర్మ గారికి. సార్, మేడమ్ నా పేరు సాత్విక ఐదవ తరగతి చదువుతున్నాను. ఇతను మా తమ్ముడు. మా డాడీని కొందరు నమ్మించి మోసం చేశారట. మా డాడీకి న్యాయం చేయగలరు. మమ్మీ డాడీలను మమ్మల్ని కలిసే అవకాశం ఇవ్వండి బతికి ఉన్నప్పుడే న్యాయం చేయండి తర్వాత చేస్తే ఏమి లాభం. ఈ సమాచారం జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి దయచేసి చేరేలా చేయండి.’’ అంటూ ఆ పిల్లలు వేడుకున్నారు.
విత్తన పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి
రాజేంద్రనగర్ సర్కిల్ లో 6.5 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అగ్రికల్చర్ కమిషనర్ రఘునందన్ రావు, జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్ రావు, స్థానిక కార్పొరేటర్ అర్చన జయప్రకాష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ల్యాబ్ లో విత్తనాలను పరీక్షించారు. ఈ విత్తనాలను విదేశాలకు ఎగుమతి చేయాలంటే ఈ పరిశోధన కేంద్రంలో పరీక్ష చేసి ధృవీకరణ సర్టిఫికేట్ ఇవ్వవలసి ఉంటుంది. దేశంలోని ఈ పరీక్ష కేంద్రం రెండవ అతి పెద్ద పరీక్ష కేంద్రంగా పేరొందింది. అంతర్జాతీయ విత్తన పరిశోధనా సంస్థ అనుమతులతో ఈ పరీక్ష కేంద్రంలో నాలుగు రకాల పరీక్షలు నిర్వహించనున్నారు.
Earth Quake in Indonesia: ఇండోనేసియాలో భూకంపం
ఇండోనేసియాలోని వెస్ట్ సుమత్రా ద్వీపంలో భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పైన 6.2 తీవ్రత నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. బుక్కిటింగి ప్రాంతానికి 66 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా తెలిపింది.