Telangana Elections 2023: 'కాంగ్రెస్ వల్లే కేంద్రానికి సింగరేణి వాటా' - తామే సంస్థను లాభాల్లోకి తెచ్చామన్న సీఎం కేసీఆర్
Telangana Elections 2023: కాంగ్రెస్ పాలనలో సింగరేణి సంస్థ నష్టాల్లోనే ఉందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఆ ఉద్యోగులకు 3 శాతం ఇంక్రిమెంట్ ఇచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు.
50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో సింగరేణి నష్టాల్లోనే ఉందని, తెలంగాణ వచ్చిన వెంటనే ఆ ఉద్యోగులకు 3 శాతం ఇక్రిమెంట్ ఇచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కొత్తగూడెం ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలు వస్తే గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయని, ఆగం కావొద్దని ప్రజలకు సూచించారు. చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసి పార్టీ, ఆ పార్టీ తరఫు అభ్యర్థికి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు.
'బీఆర్ఎస్ దే అధికారం'
ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 'కాంగ్రెస్ హయాంలో సింగరేణి టర్నోవర్ రూ.11 వేల కోట్లు మాత్రమే ఉండేది. సమైక్య రాష్ట్రం ఉంటే కొత్తగూడెం జిల్లా వచ్చేది కాదు. కొత్తగూడేనికి ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చింది. ఈ నియోజకవర్గంలో 13,500 ఎకరాల పోడు భూమికి పట్టాలిచ్చాం. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కానిది బీఆర్ఎస్ హయాంలో చేసి చూపించాం. సీతారామ ప్రాజెక్టు 70 శాతం పూర్తైంది. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. నేనే వచ్చి సీతారామ ప్రాజెక్టు పూర్తి ప్రారంభిస్తా.' అని కేసీఆర్ తెలిపారు.
ఎన్నికల సమయంలో కొన్ని పార్టీల నేతలు ప్రత్యర్థుల్ని విమర్శించేందుకు బూతులు తిడుతూ, అబద్ధాలు చెబుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. ఎన్నికల్లో అభ్యర్థి గుణగణాలు చూసి ఓటెయ్యాలని, అభ్యర్థి వెనుక ఏ పార్టీ ఉంటుంది, ఆ పార్టీ వైఖరి, చరిత్ర చూసి వారిని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ వల్లే కేంద్రానికి సింగరేణి వాటా
తెలంగాణకు కొంగు బంగారం మన సింగరేణి గనులు. 134 ఏళ్ల చరిత్ర గల సింగరేణి సంస్థ వందకు వంద శాతం మనకే ఉండేదని సీఎం కేసీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పాలకు కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి, 30 - 40 ఏళ్లు అవి తిరిగి చెల్లించలేదని అన్నారు. అందుకే సమైక్య రాష్ట్రంలో కేంద్రానికి 49 శాతం వాటా వెళ్లిందని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన వెంటనే సింగరేణి రూపురేఖలే మార్ఛేశామని, సంస్థ టర్నోవర్ రూ.33 వేల కోట్లకు తీసుకుపోయామని వివరించారు. రూ.419 కోట్లుగా ఉన్న సింగరేణి లాభాలను రూ.2,184 కోట్లకు తీసుకుపోయామని చెప్పారు. దసరాకు రూ.700 కోట్ల లాభాలు కార్మికులకు పంచామని, నూతన నియామకాల వల్ల సింగరేణి యువ కార్మికులతో కళకళలాడుతోందన్నారు.
తెలంగాణ రాక ముందు 6,400 ఉద్యోగాలు వస్తే, తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిదన్నరేళ్లలో 19,463 ఉద్యోగాలిచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. సింగరేణి అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో వనమా వెంకటేశ్వరరావును అత్యధిక మెజార్జీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
సీఎం ప్రచార వాహనం తనిఖీ
ఎన్నికల ప్రచారం సందర్భంగా కొత్తగూడెం చేరుకున్న సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతిపథం వాహనాన్ని విధి నిర్వహణలో భాగంగా ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలను అనుసరించి సీఎం కేసీఆర్ వారికి సహకరించారు. ఈ ప్రక్రియను అధికారులు వీడియో తీశారు. తనిఖీల అనంతరం సీఎం వాహనాన్ని పంపించారు. అటు కామారెడ్డిలోనూ హోం మంత్రి మహమూద్ అలీ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా ఆయన పూర్తిగా సహకరించారు.
'పువ్వాడ పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు'
కొత్తగూడెం సభ అనంతరం సీఎం కేసీఆర్ ఖమ్మంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. మంత్రి పువ్వాడ కృషితోనే ఖమ్మం అభివృద్ధి జరిగిందని, దాన్ని మీరూ ప్రత్యక్షంగా చూశారని ప్రజలనుద్దేశించి అన్నారు. 'ఖమ్మం చాలా చైతన్యవంతమైన ప్రాంతం. పువ్వాడను గెలిపిస్తే మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. పువ్వాడ పువ్వులు కావాలో తుమ్మల తుప్పలు కావాలో మీరే నిర్ణయించుకోండి. తుమ్మల నాగేశ్వరరావును గెలిపిస్తే తుమ్మ ముళ్లు గుచ్చుకుంటాయి. ఖమ్మం నగరంలో ఐటీ టవర్ కలలోనైనా ఊహించారా.?' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read: అందరికీ గవర్నమెంట్ జాబ్స్ తేలిక కాదు, అందుకే మేం ఇలా చేస్తున్నాం - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు