CM KCR: సూర్యాపేటపై కేసీఆర్ వరాల జల్లు, పంచాయతీలకు రూ.10 లక్షలు, మున్సిపాలిటీలకు రూ.25 కోట్లు
CM KCR: సూర్యాపేట జిల్లాపై సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షలు, నాలుు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్ననట్లు చెప్పారు.
CM KCR: సూర్యాపేట జిల్లాలో సీఎం కేసీఆర్ ఆదివారం పర్యటించారు. కలెక్టరేట్, సమీకృత వ్యవసాయ మార్కెట్, జిల్లా ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీ, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ‘సూర్యాపేట ప్రగతి నివేదన’ సభలో సీఎం మాట్లాడారు. సూర్యాపేట జిల్లాపై వరాలు కురిపించారు. సూర్యాపేటలోని 475 గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రూ.10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నామన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ.50 కోట్లు ఇస్తామని ప్రకటించారు.
సూర్యాపేటలో 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, వాటి అభివృద్ధికి నిధులు డబ్బులు కావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు కోరినట్లు తెలిపారు. వారి వినతలను పరిగణలోకి తీసుకుని, ప్రజలకు సౌకర్యాలు కల్పించేందుకు ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల చొప్పున సీఎం నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. సూర్యాపేటకు కళాభారతి కావాలని మంత్రి జగదీశ్ రెడ్డి కోరారని, ఇందుకు రూ.25కోట్లు అవసరమవుతాయని మంత్రి చెప్పారని, వాటిని సైతం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసుకు దీటుగా కళాభారతిని నిర్మించాలని మంత్రి జగదీశ్ రెడ్డికి సీఎం సూచించారు.
సూర్యాపేట పట్టణం మరింత అభివృద్ధి చెందాలని, కొత్త రోడ్లు కావాలని మంత్రి జగదీశ్ రెడ్డి కోరారని కేసీఆర్ తెలిపారు. మంత్రి వినతి మేరకు కోదాడ, హుజూర్ నగర్, తిరుమలగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున, సూర్యాపేటకు ప్రత్యేకంగా రూ.50కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. మహిళా పాలిటెక్నిక్ కాలేజీ కావాలని కూడా మంత్రి అడిగారని, దాన్ని కూడా మంజూరు చేస్తామన్నారు. స్టేడియం, స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటుకు జీవో జారీ చేస్తామన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డి ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ అడిగారని, దానిని కూడా మంజూరు చేయాలని ఆ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి సూచించారు.
ప్రారంభోత్సవాల హోరు
సూర్యాపేట పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ మొదటగా రూ.156 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాలకు సంబంధించి ప్రధాన భవనాలను ప్రారంభించారు. మొత్తం రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మిస్తున్నారు. అనంతరం రూ.30.18 కోట్లతో పాత వ్యవసాయ మార్కెట్‌లో నిర్మాణమైన ఇంటెగ్రేటెడ్ మోడల్ మార్కెట్‌ను ప్రారంభించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి జగదీశ్ రెడ్డి, సూర్యాపేట జిల్లా ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, శాణంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, నేతలు ఉన్నారు. ఆ తరువాత 20 ఎకరాల్లో రూ.38.50 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా పోలీసు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఎస్పీ ఛాంబర్‌లో ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ను కూర్చొబెట్టి శుభాకాంక్షలు చెప్పారు.
అనంతరం సమీపంలోనే నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి పార్టీ జెండాను ఎగురవేశారు. జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో 21 ఎకరాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ ప్రత్యేక పూజలో పాల్గొని సర్వమత ప్రార్థనలు చేశారు. కలెక్టర్ వెంకట్రావును ఛాంబర్‌లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు చెప్పారు. జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.