Breaking News Live Telugu Updates: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులు మేజర్లే-జువైనల్ కోర్టు తీర్పు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
AP Telangana Weather News: తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. కొన్ని చోట్ల భారీ వర్ష సూచనతో ఐఎండీ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ప్రస్తుతం కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి కోస్తా, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు మరొక ద్రోణి విస్తరించింది.
ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో పాటుగా కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లోని అనేకచోట్ల గురువారం (సెప్టెంబరు 29) ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో (సెప్టెంబరు 30) కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీగా, మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు.
ఒకటో తేదీన దక్షిణ కోస్తాలో అనేకచోట్ల, ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, ఇంకా కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెఅంచనా వేశారు. కాగా వాతావరణ పరిస్థితులు కాస్త గందరగోళంగా ఉన్నందున పిడుగులు, భారీ మెరుపులు కూడా సంభవిస్తాయని, ఆ సమయంలో బయట తిరగడం మంచిది కాదని వాతావరణ అధికారులు సూచించారు. చెట్ల కింద అసలు ఉండొద్దని హెచ్చరించారు. తాజాగా రాష్ట్రంలోని పల్నాడులో ధ్వజస్తంభంపై పిడుగు పడింది. పిడుగుపాటుకు ధ్వజస్తంభం రెండుగా చీలింది. జిల్లాలోని వెల్దుర్తి రాచమల్లపాడు సాయిబాబా గుడిలో ఈ ఘటన జరిగింది.
తెలంగాణలో ఇలా (Telangana Weather News)
హైదరాబాద్ లో ని వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల మేరకు.. తెలంగాణలో నేడు (సెప్టెంబరు 30) కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.
కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షం పడనుండగా, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. అన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపారు.
Hyderabad Rain Update: హైదరాబాద్‌లో ఇలా
ఇక హైదరాబాద్‌లో ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. ఓ మోస్తరు నుంచి భారీ వర్షం, ఉరుములు, మెరుపులు ఉండవచ్చు. నగరంలో ఉపరితల గాలులు ఉత్తర దిశ నుంచి పశ్చిమ దివవైపుకు వీస్తాయి. గాలి వేగం గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో ఉంటుందని అంచనా వేశారు.
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు నిందితులు మేజర్లే-జువైనల్ కోర్టు తీర్పు
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ట్రైల్ సందర్భంగా నలుగురు నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ తీర్పు ఇచ్చింది. నిందితులను మేజర్లుగా పరిగణించాలని పోలీసులు జువైనల్ కోర్టును కోరారు. ఎమ్మెల్యే కొడుకు మాత్రం జూవైనల్ గా పరిగణించాలని కోర్టు నిర్ణయించింది. నలుగురు నిందితులు తీవ్ర నేరానికి పాల్పడ్డారని కోర్టు భావించింది.
వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల వెబ్ సైట్ ను ప్రారంభించిన సీఎం జగన్
వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కార్యక్రమాల వెబ్ సైట్ ను సీఎం జగన్ ప్రారంభించారు. పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నివారించడం లక్ష్యంగా ఈ పథకాలను ప్రారంభిస్తున్నామని సీఎం తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఈ పథకాలు అమలులోకి రానున్నాయని ప్రకటించారు. వీటికి సంబంధించిన వెబ్ సైట్‌ను కూడా సీఎం జగన్ ప్రారంభించారు. ఆడబిడ్డల కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుందని తెలిపారు.
Konaseema District: యానాంలో భారీగా గంజాయి పట్టివేత
కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో యథేచ్ఛగా కొనసాగుతున్న గంజాయి అమ్మకాలకు అడ్డుకట్ట వేసేందుకు యానాం పోలీసులు నడుంబిగించారు. ఆంధ్రా నుండి అడ్డూ అదుపు లేకుండా గంజాయి తరలిస్తున్న ముఠాను గుట్టురట్టు చేశారు. ఇటీవల పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు వద్ద సమాచారం రాబట్టిన పోలీసులు.. వీరిని పట్టుకున్నారు.
యానాం SP భాలచంద్రన్ ఆదేశానుసారం ఆంధ్రా విశాఖ జిల్లా నర్సీపట్నంలో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని
వారివద్ద ఉన్న మూడు 500 గ్రాముల గంజాయి పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. యానాంలో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఈడీ నోటీసులు
- నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఈడి నోటీసులు
- పార్టీకి పార్టీ అనుబంద సంస్థలకు విరాళాలు ఇచ్చిన కొందరికి నోటీసులు
- ఈడీ నోటీసులు అందుకున్న వారికి కాంగ్రెస్ అధిష్టానం పిలుపు
- నిన్ననే ఢిల్లీ చేరుకున్న కొందరు నాయకులు
- ఈ రోజు ఉదయం బయలుదేరి వెళ్లిన మరికొందరు
- మధ్యాహ్నం ఢిల్లీలో ఆడిటర్లతో కాంగ్రెస్ నాయకుల సమావేశం
- నేషనల్ హెరాల్డ్ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ
- అదే కేసులో భాగంగా విరాళాలు ఇచ్చిన పలువురి కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు
- కేసు పూర్వాపరాలు గురించి తెలియచేయనున్న కాంగ్రెస్ అధిష్టానం
- ఆడిట్ పరంగా, న్యాయపరంగా చర్చించే అవకాశం ఉన్నట్లు నాయకుల వెల్లడి
- మాజీ మంత్రులు షబీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, గీతారెడ్డి , రేణుకాచౌదరి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, గాలి అనిల్ కుమార్ తదితరులు ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం
Minister Srinivas Goud: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ను కలిసిన శ్రీనివాస్ గౌడ్
జాతీయ క్రీడలు జరుగుతున్న అహ్మదాబాద్‌లో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్‌తో తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో క్రీడాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ప్రగతిపై ఆయన కేంద్ర మంత్రికి వివరించారు. రాష్ట్రంలో ప్రత్యేక క్రీడా పాలసీ తీసుకొచ్చి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం, ప్రతి నియోజకవర్గంలో స్టేడియం, ఉద్యోగాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ అందిస్తున్నట్లు కేంద్ర మంత్రికి చెప్పారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్న అంశంపై కేంద్రమంత్రి ఆశ్చర్యపోయారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కూడా వారి వెంట ఉన్నారు.
Interacted with Minister of Youth Affairs and Sports of India @ianuragthakur Ji over various flagship programs of Telangana Govt for the promotion of sports & also had a brief discussion over the construction of mini stadiums in every Assembly constituency in the State. pic.twitter.com/u4MwmVdu1f
— V Srinivas Goud (@VSrinivasGoud) September 30, 2022