Amit Shah Speech: సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే హైదరాబాద్ విముక్తి , సమరయోధులందరికీ వందనం - కేంద్రమంత్రి అమిత్‌షా
Amit Shah Speech: తొలిసారి అధికారికంగా ప్రభుత్వం తరపున తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతున్నామని కేంద్రమంత్రి అమిత్‌షా వెల్లడించారు.
Amit Shah Speech:
తెలంగాణలో తొలిసారి అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు అమరులకు నివాళులర్పించారు. భారత దేశ చరిత్రలో తెలంగాణ విమోచనానికి ప్రత్యేక స్థానం ఉందని అమిత్‌షా వ్యాఖ్యానించారు. తెలంగాణ విమోచనానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయనకు గౌరవ వందనం సమర్పించారు. ఆయన లేకపోయుంటే...తెలంగాణకు విముక్తి లభించటం ఇంకా ఆలస్యమై ఉండేదని అన్నారు. భారత సైన్యాన్ని ప్రవేశపెట్టి నిజాం సేనలు, రజాకార్లు వెనక్కి తగ్గేలా చేశారని, ఆయన వల్లే తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలిగారని చెప్పారు అమిత్‌షా. 1947 ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్య్ర ఉత్సవాలు జరుగుతుంటే...హైదరాబాద్ ప్రజలు మాత్రం నిజాం పాలనలో మగ్గిపోయారని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా దాదాపు 13 నెలల పాటు హైదరాబాద్ ప్రజలకు స్వేచ్ఛ లభించలేదని వెల్లడించారు. అప్పుడే సర్దార్ పటేల్ పోలీస్ యాక్షన్ అమలు చేశారని చెప్పారు. కొమురం భీం, రాంజీ గోండ్, చెన్నారెడ్డి లాంటి ఎంతో మంది స్వాతంత్య్ర సమరయోధులకు గౌరవ వందనం సమర్పించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఆ యోధులందరినీ స్మరించుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలన్న ఆకాంక్ష ఎప్పటి నుంచో ఉందని, కానీ 75 ఏళ్లుగా ఎవరూ పట్టించుకోలేదని మండి పడ్డారు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హైదరాబాద్ విమోచన దినోత్సవం జరపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో, ఉద్యమాల్లో హామీ ఇచ్చారని, కానీ అమలు చేయలేదని పరోక్షంగా కేసీఆర్ సర్కార్‌పై విమర్శలు చేశారు.
అప్పట్లో సైనిక చర్య 109 గంటల పాటు నిర్విరామంగా కొనసాగిందని కేంద్ర మంత్రి అమిత్ షా గుర్తుచేశారు. హైదరాబాద్ స్వాతంత్ర్యం కోసం ఎందరో సైనికులు ప్రాణాలు అర్పించారని వెల్లడించారు. రజాకార్లు ఎన్నో అన్యాయాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో హత్యలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని అన్నారు. నిజాం పాలనలో మహిళలపై లెక్కలేనన్ని అత్యాచారాలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. జలియన్‌వాలాబాగ్ తరహా ఘటన గుండ్రాంపల్లిలో జరిగిందని.. ఆ ఘటనలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారని గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రధాన మంత్రి మోదీ ప్రకటించిన తరవాతే మిగతా పార్టీలన్నీమేలుకున్నాయని విమర్శించారు. ఇన్నేళ్లలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించింది లేదని, ఆ సాహసం కూడా చేయలేదని మండి పడ్డారు. ప్రధాని మోదీ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని ఈ విమోచన దినోత్సవాన్ని జరుపుతున్నారని కొనియాడారు. సర్దార్ పటేల్ తెలంగాణ విమోచనం కోసం చొరవ చూపించకపోతే...అఖండ భారత్ కల సాకారమయ్యేది కాదని అన్నారు అమిత్‌షా. ఈ ప్రసంగం తరవాత అమిత్‌షా నేతృత్వంలో భాజపా కోర్‌కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పుల్లెల గోపీచంద్ షాను కలిశారు.