(Source: ECI/ABP News/ABP Majha)
Shah Security : అమిత్ షా కాన్వాయ్‌కు ఉద్దేశపూర్వకంగానే కారు అడ్డం పెట్టారా? రంగంలోకి ఇంటలిజెన్స్ !
అమిత్ షా పర్యటనలో సెక్యూరిటీ లోపంపై కేంద్ర హోంశాఖ ఇంటలిజెన్స్ ఆరా తీస్తోంది. టీఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
Shah Security : దేశంలో ప్రధాని తర్వాత రెండో పవర్ ఫుల్ వ్యక్తి కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆయనకు భద్రత కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ఆయన కాన్వాయ్ వస్తోందంటే ఏ రాష్ట్రంలో అయినా కనీసం పది నిమిషాల ముందు ట్రాఫిక్ క్లియర్ చేస్తారు. అలాంటిది. .. హైదరాబాద్‌లో అమిత్ షా కారు తాను పాల్గొన్సల్సిన కార్యక్రమం జరుగుతున్న హోటల్‌లోకి వెళ్లడానికి ఐదు నిమిషాలు రోడ్డుపైనే ఆగిపోయింది. బేగంపేట హరిత ప్లాజా హోటల్‌లో ఇది చోటు చేసుకుంది. టీఆర్ఎస్ నేత ఒకరు గేటుకు అడ్డంగా కారు పెట్టడం వల్లనే ఇలా జరిగింది. ఈ అంశం యాధృచ్చికంగా జరిగిందని కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులు అనుకోవడం లేదు. అందుకే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.
సెక్యూరిటీ వైఫల్యంపై ఇంటలిజెన్స్ ఆరా
గోసుల శ్రీనివాస్ అనే వ్యక్తి టీఆర్ఎస్ నేతగా గుర్తింపు పొందారు. ఆయన హరిత ప్లాజా హోటల్‌కు వచ్చారు. అమిత్ షా వచ్చే కొద్ది సేపు ముందే ఆయన తన కారుతో లోపలకు వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే కరెక్ట్ గా గేటు దగ్గరే ఆగిపోయారు. అదే సమయంలో అమిత్ షా కాన్వాయ్ వచ్చింది. ఐదు నిమిషాల సేపు ఆగిపోయింది. పోలీసులు ఎంత చెప్పినా తీయలేదు. చివరికి కారు అద్దాలు పగలగొట్టి బలవంతంగా దారికి అడ్డం తీయాల్సి వచ్చింది. ఈ ఘటన పూర్తిగా భద్రతా వైఫల్యమేనని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించుకున్నారు. దీంతో అమిత్ షా భద్రతా వ్యవహారాలు చూస్తున్న అధికారులతో వారు మాట్లాడారు.
ఉద్దేశపూర్వకంగానే కారు అడ్డం పెట్టారా ?
తెలంగాణలో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఈ కారణంగా టీఆర్ఎస్ నేత అమిత్ షా కాన్వాయ్‌ను ఐదు నిమిషాల సేపు ఆపేశారంటే దాన్ని యాధృచ్చికంగా జరిగిన ఘటనగా తీసుకోలేమని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర హోంశాఖకు చెందిన ఉన్నతాధికారులు.. ఇంటలిజెన్స్ అధికారులు కూడా ఈ అంశంపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. గోసుల శ్రీనివాస్‌ను..ఆయన కారును స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో గోసుల శ్రీనివాస్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని అనుమానాస్పదమైన అంశాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలిస్తున్నట్లుాగ తెలుస్తోంది. ఉద్దేశపూర్వకంగా చేశారా.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే వచ్చారా అన్నది తేల్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
గోసుల శ్రీనివాస్‌ను ప్రశ్నిస్తున్న పోలీసులు
హరిత ప్లాజా హోటల్‌లో బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా భేటీ అవుతున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ముఖ్య నేతలు వస్తున్నందున.. హోటల్‌లో ఇతర కార్యక్రమాలకు అనుమతి ఇవ్వలేదు. మరి టీఆర్ఎస్ నేత హోటల్‌కు ఎందుకు వచ్చారన్నది ఇప్పుడు పోలీసులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో అడ్డుకోవడం అనేది కామన్. అయితే ఇలా కార్లు పెట్టి అమిత్ షా టూర్‌ను అడ్డుకుంటారని ఎవరూ ఊహించలేదు. ఇది యాధృచ్చికంగా జరిగింది కాదని.. ఉద్దేశ పూర్వకంగానే గోసుల శ్రీనివాస్ కారు అడ్డుపెట్టినట్లుగా తేలితే కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.