KTR: 'సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురండి' - కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Telangana News: సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు శుభవార్త అందేలా చూడాలన్నారు.
KTR Letter To Central Minister Bandi Sanjay: ఈసారి కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకురావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను (Bandi Sanjay) కోరారు. ఈ మేరకు గురువారం ఆయనకు బహిరంగ లేఖ రాశారు. పదేళ్లుగా ప్రతి బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణకు మొండిచేయి చూపించిందని.. పవర్ లూమ్ క్లస్టర్ కోసం పదిసార్లు కేంద్రానికి లేఖలు రాశామని.. కేంద్ర మంత్రులను సైతం స్వయంగా వెళ్లి కలిశామని గుర్తు చేశారు. ఈ సారైనా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ తెప్పించాలని.. కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్లకు గుడ్ న్యూస్ అందేలా చూడాలని బండి సంజయ్‌కు విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిగా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
లేఖలో ఏమన్నారంటే.?
'కేంద్రంలో బీజేపీ సారధ్యంలోని ప్రభుత్వమే అధికారంలో ఉన్నందున ప్రధాని మోదీని ఒప్పించి సిరిసిల్లా మెగా పవర్ లూమ్ క్లస్టర్ తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. గత పదేళ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మీరు ఈ ప్రాంత ఎంపీగా ఐదేళ్ల క్రితం ఎన్నికయ్యారు. కానీ నేతన్నలకు ప్రతిసారి నిరాశే ఎదురైంది. గతంలో సుమారు పదిసార్లు కేంద్రంలో స్మృతి ఇరానీ, అరుణ్ జైట్లీ మంత్రులను నేను స్వయంగా కలిసినా దక్కింది శూన్యం. రెండోసారి మీరు ఎంపీ కావటం, కేంద్రంలో కూడా మంత్రిగా పదవి దక్కటంతో సిరిసిల్ల నేతన్నలకు సేవ చేసేందుకు మీకిది సరైన సమయం అని గుర్తించండి. ఈసారి కేంద్ర బడ్జెట్‌లో సిరిసిల్ల ప్రాంతానికి మెగా పవర్ లూమ్ కస్టర్ ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సిరిసిల్లలో మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు మొదలయ్యాయి. ఉపాధి లేక ఇక్కడి కార్మికులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న సంగతి గుర్తించండి. గత ప్రభుత్వం నేతన్నల కోసం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ సర్కారు పాతరేయడంతో చేనేత రంగం మరోసారి పదేళ్ల తర్వాత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.' అని లేఖలో పేర్కొన్నారు.
మెగా పవర్ లూమ్ ఏర్పాటు చేస్తే..
సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తే ఇక్కడి నేతన్నల కష్టాలు కొంతమేరకు తీరుతాయని, చేతినిండా పని దొరికి మళ్లీ ఆత్మహత్యలు లేని సిరిసిల్లను చూసే అవకాశం ఉంటుందని కేటీఆర్ లేఖలో తెలిపారు. 'క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యం కలిగిన కార్మికులు, వనరులు ఈ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయి. నేతన్నలు, చేనేతలను ఆదుకోవటానికి గత పదేళ్లుగా కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందకపోవటం దురదృష్టకరం. వనరులు లేని రాష్ట్రాలకు సైతం కేంద్రం అనేక రకాల ప్రాజెక్టులను మళ్లిస్తున్నందున, అన్నీ సానుకూలాంశాలున్న సిరిసిల్లాకు మేలు జరిగే దిశగా చొరవ చూపాలి. ప్రతి బడ్జెట్‌కు ముందుకు ఈ అంశంలో కేంద్రానికి విజ్జప్తి చేసేవాళ్లం. ఈ బడ్జెట్ పెట్టే నాటికే ఆర్థిక మంత్రిత్వ శాఖా మంత్రిని కలిసి సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ ప్రాధాన్యతను, దాని వల్ల జరిగే లబ్దిని, వారి దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలి. తెలంగాణ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని మన ప్రాంత ప్రయోజనాల కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నా. ఈ బడ్జెట్‌లో కచ్చితంగా సిరిసిల్లకు మెగా పవర్ లూమ్ క్లస్టర్ ప్రకటన చేయిస్తారని భావిస్తున్నా.' అంటూ కేటీఆర్ లేఖలో కోరారు.