BRS MLC Kavitha: భయపడేది లేదు, దొంగ కేసులను చట్టం ప్రకారం ఎదుర్కొంటాం - ఈడీ అరెస్టుపై కవిత రియాక్షన్ ఇదీ
MLC Kavitha was arrested: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తున్నారు.
BRS MLC Kavitha responds over her arrest in Money Laundering Case: హైదరాబాద్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలిస్తున్నారు. పటిష్ట భద్రత మధ్య హైదరాబాద్ నుంచి కారులో ఆమెను శంషాబాద్ ఎయిర్ పోర్టుకు.. అక్కడినుంచి విమానంలో కవితను ఢిల్లీకి తరలిస్తున్నారు ఈడీ అధికారులు. శుక్రవారం సాయంత్రం 5.20గంటలకు కవితను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మనీలాండరింగ్ చట్టం ప్రకారం సెక్షన్ 3 కింద ఆమె నేరం చేశారని ఈడీ తెలిపింది.
అణిచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటాం
ఈడీ అధికారులు తనను అరెస్ట్ చేయడాన్ని కవిత తీవ్రంగా ఖండించారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, ఇలాంటి అణిచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామని కవిత అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు మనోధైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. అధైర్యపడొద్దని కుమారుడికి ధైర్యం చెప్పి ఆమె ఇంటి నుంచి ఈడీ అధికారులతో కారులో బయలుదేరారు. అరెస్ట్ అనంతరం పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. దొంగ కేసులను రాజకీయ కక్ష సాధింపు చర్యలను చట్టం ప్రకారం ఎదుర్కొంటామని కవిత అన్నారు.
అరెస్ట్ సమయంలో అధికారులతో కేటీఆర్ వాగ్వాదం
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అక్రమమని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఆరోపించారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని విచారణ అధికారిని కవిత అరెస్ట్ సమయంలో కేటీఆర్ ప్రశ్నించారు. అరెస్టు చేయకూడదంటూ సుప్రీంకోర్టుకు చెప్పిన ఇచ్చిన తర్వాత ఇప్పుడు అరెస్టు చేయడం అక్రమమని ఆరోపించారు. సుప్రీంకోర్టు చెప్పిన మాట వినలేదు కనుక, అధికారలుు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. శుక్రవారం వచ్చి కవితను ఉద్దేశపూర్వకంగా కేంద్రం అరెస్ట్ చేయించిందని కేటీఆర్ ఆరోపించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా కవిత ఇంట్లోకి రావద్దు అంటూ హుకూం ఎలా జారీ చేస్తారంటూ మండిపడ్డారు.