Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Telangana News: మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్‌ను మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. మహిళలను గౌరవించడం అందరి బాధ్యతని.. ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామన్నారు.
Harish Rao Comments On Minister Konda Surekha Trolling: మహిళలను గౌరవించడం అందరి బాధ్యత అని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అన్నారు. మంత్రి కొండా సురేఖపై (Konda Surekha) సోషల్ మీడియాలో ట్రోలింగ్స్‌పై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు చెప్పారు. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఎవరూ సహించబోరని అన్నారు. 'బీఆర్ఎస్ అయినా, వ్యక్తిగతంగానైనా ఇలాంటి చర్యలు ఉపేక్షించబోం. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అందరినీ కోరుతున్నా.' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత. వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయినా, వ్యక్తిగతంగా నేనైనా ఉపేక్షించబోము. మీకు @IKondaSurekha గారికి కలిగిన అసౌకర్యానికి మీతో పాటు నేనూ చింతిస్తున్నాను. సోషల్ మీడియా వేదికగా జరిగే ఇలాంటి వికృత…
— Harish Rao Thanneeru (@BRSHarish) September 30, 2024
మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు
కాగా, సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణులు తనపై దారుణమైన పోస్టులు పెట్టారంటూ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. అధికారం పోయిందన్న బాధలో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదని.. ఆ పార్టీ మహిళా నాయకురాలు ఎమ్మెల్సీ కవిత పట్ల ఇలాంటి ట్రోలింగ్, కామెంట్స్ చేస్తే ఊరుకుంటారా.? అని ప్రశ్నించారు. ఓ మహిళా మంత్రి ఫోటోలను అసభ్యకర రీతిలో పోస్ట్ చేశారంటూ సోమవారం గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ మహిళను అవమానిస్తూ పోస్టులు పెట్టడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చి మరీ ట్రోలింగ్ చేయిస్తున్నారని భావోద్వేగానికి గురయ్యారు. చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి పద్మశాలి బిడ్డను ఇంత అవమానిస్తారా.? అంటూ నిలదీశారు. మహిళలంటే కేటీఆర్‌కు మొదటి నుంచీ చులకన అని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని.. ఇకపై ఇలా చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
ఇదీ జరిగింది
మెదక్ ఎంపీ, బీజేపీ ఎంపీ దుబ్బాక రఘునందన్ రావు.. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ మెడలో నూలు దండ వేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. దీనిపై కామెంట్స్ చూసి తాను ఆవేదన చెందానని అన్నం కూడా తినలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. మెడలో నూలు దండ వేస్తే చిల్లర కామెంట్స్ చేస్తారా.? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అని చూడకుండా బీఆర్ఎస్ నేతలు దారుణంగా ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు.
Also Read: Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, ఆకస్మిక పర్యటనకు అసలు కారణం ఇదేనా!