Bandi Sanjay Arrest: "బండి అడ్డంగా దొరికిపోయారు - పిచ్చోడి చేతిలో పార్టీ ఉంటే ప్రమాదం" హరీష్, కేటీఆర్ సీరియస్ కామెంట్స్
Bandi Sanjay Arrest: పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.దీనిపై కేటీఆర్, హరీష్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు.
Bandi Sanjay Arrest: పదో తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో తెలంగాణలో కుట్రలకు తెరలేపారన్న కారణంతో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై బీజేపీ, బీఆర్‌ఎస్ నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ నేతలు ముఖ్యంగా బండి సంజయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీఆర్‌ఎస్ లీడర్లు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. పిచ్చోడి చేతిలో రాయి వచ్చి పోయేటోళ్లకి ప్రమాదం అని.. అలాగే అదే పిచ్చోని చేతిలో ఓ పార్టీ జెండా ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్థుల, నిరుద్యోగులు జీవితాలతో బీజేపీ నాయకులు చెలగాటం ఆడుతున్నారని వివరించారు.
పిచ్చోని చేతిలో రాయి ఉంటే..
— KTR (@KTRBRS) April 5, 2023
వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం...!!
కానీ
అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే
ప్రజాస్వామ్యానికే ప్రమాదం...!!!
తమ స్వార్థ రాజకీయాల కోసం
ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు #BJPleaks https://t.co/8GFI6ups6v
మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ వెనుక ఉన్నత్రధారి బీజేపీ కరుడుకట్టిన కార్యకర్త అని, బండి సంజయ్ ముఖ్య అనుచరుడు అని తెలిపారు. పేపర్ లీకేజీకి పాల్పడిన ప్రశాంత్ బీజేపీ కార్యకర్త కాకపోతే.. అతడిని విడుదల చేయాలంటూ బీజేపీ ఎందుకు డిమాండ్ చేస్తోందని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ ఘటనపై బీజేపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందన్నారు. మధ్యాహ్నం పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయని ధర్నా చేసిన నాయకులు... సాయంత్రం పేపర్ల లీకేజీకి పాల్పడి అరెస్ట్ అయిన నిందితుడిని విడుదల చేయాలని కోరడం దారుణం అన్నారు. వాళ్ల ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ... బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావు బండి సంజయ్ కు కొన్ని ప్రశ్నలు వేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రం వాట్సాప్ చేసిన ప్రశాంత్ బీజేపీ కార్యకర్తనేనా కాదా అని ప్రశ్నించారు. నిందితుడు బండి సంజయ్ కు ప్రశ్నా పత్రాన్ని పంపింది కూడా నిజమా కాదా అని అడిగారు. రెండు గంటల్లోనే 142 సార్లు ప్రశాంత్ ఫోన్లు మాట్లడగా.. అందులో బండి సంజయ్ కు చేయడం కుట్ర కాదా అని నిలదీశారు.
పేపర్ లీకేజీలో బండి సంజయ్ ప్రధాన కుట్ర దారు : మంత్రి హరీష్ రావు.@BRSHarish pic.twitter.com/3K2Sm74GwY
— BRS Party (@BRSparty) April 5, 2023
పని గట్టుకొని ప్రశ్నాపత్రాలు లీక్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసింది బీజేపీ నేతలేనని... ఇదంతా బండి సంజయ్ ఆధ్వర్యంలోనే జరిగిందని అన్నారు. ప్రశ్నాపత్రం వ్యాప్తిలో బండి సంజయ్ ప్రమేయం లేకపోతే నిందితుడు ఇచ్చిన సమాచారాన్ని ఎందుకు దాచారో సమాధానం చెప్పాలన్నారు. అలాగే రోజుకో ప్రశ్నాపత్రం లీకేజీ పేరుతో కుట్రలు పన్నింది నిజమా కాదా అని నిలదీశారు. సోషల్ మీడియాలో ప్రశ్నాపత్రాల లీకేజీ అంటూ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా పోస్టులు పెట్టింది కూడా బీజేపీ కార్యకర్తలే అని చెప్పుకొచ్చారు.