BRS Politics : ముందే టిక్కెట్లు ప్రకటించడం భారంగా మారిందా ? బీఆర్ఎస్ అభ్యర్థుల వేదన
బీఆర్ఎస్ అభ్యర్థులు ముందస్తు ఖర్చులు పెట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ముందే టిక్కెట్ల ప్రకటనతో ఖర్చులు పెరిగిపోతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
BRS Politics : రాజకీయాలంటే ఖర్చు. అది ఆషామాషీ ఖర్చు కాదు. ఊహించనంత ఖర్చు పెట్టుకోవాలి. అదీ ముందుగానే రంగంలోకి దిగితే ఇక చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ తరపున టిక్కెట్లు పొందిన వారి పరిస్థితి అంతే ఉంది. ఓ వైపు టిక్కెట్లు పొందిన ఆనందం ఉంటే మరో వైపు రోజువారీ ఖర్చులు పెరిగిపోవడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది.
మూడు నెలల పాటు ప్రజల్లోనే ఉండాలని కేసీఆర్ ఆదేశం
బీఆర్‌ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను సీఎం కేసీఆర్ ఆగస్టు 21న ప్రకటించారు. అది కూడా ఒకేసారి 115 మంది పేర్లతో కూడిన లిస్టును వెలువరించారు. ఆ జాబితాలో చోటు దక్కిన వారి ఆనందానిక ి అవధుల్లేవు. సీటు దక్కిన వారు వెనువెంటనే రంగంలోకి దిగి, క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని పార్టీ అధినేత ఆదేశించారు. ఇక మూణ్నెల్లపాటు హైదరాబాద్‌లో ఎవరూ ఉండొద్దు.. నియోజవర్గాలకు వెళ్లండి, జనంతో మమేకం కావాలని ఆదేశిచింది. దీంతో అభ్యర్థులందరూ ‘ఎలక్షన్ గ్రౌండ్’కి వెళ్లిపోయారు. కానీ రోజు రోజుకు నేతల్లో ఉత్సాహం తగ్గిపోతోంది. దీనికి కారణం ఖర్చులు . ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ‘అన్నీ చూసుకోవాలి.. అన్నీ భరించాలి…’ అంటే ఖర్చే తడిసిమోపెడవుతుందని ఆవేదన చెందుతున్నారు.
అలుగుతున్న ద్వితీయ శ్రేణి నేతలు - కోరికలు తీర్చలేక తంటాలు
ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు ఎన్నికల సమయం అంటే పండగే. వారి కోరికలను అభ్యర్థులు తీర్చాల్సిందే. ఏ మాత్రం కటువుగా మాట్లాడినా, వారు ‘అడిగిన దానికి నో చెప్పినా…’ అలకపాన్పు ఎక్కుతారామోనన్న భయం వెంటాడుతోంది. టిక్కెట్ దక్కిందనే ఆనందం కంటే… ఇప్పటి నుంచి పెట్టాల్సిన ఖర్చు చూస్తేనే నీరసం వస్తోందని నేతలు మథనపడుతున్నారు. జాబితా వచ్చి నెలరోజులు కాకముందే చోటా మోటా నేతలు, కార్యకర్తలను కాపాడుకునేందుకు, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడాల్సి వస్తుంటే..ఈనెలతోపాటు అక్టోబరు, నవంబరు నెలల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవటానికే కష్టంగా ఉందని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
పండగ సీజన్ కావడంతో ఇక ఊరూవాడా విరాళాలు పంచాల్సిందే!
వరసగా వినాయక చవితి, బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలు వస్తున్నాయి. వినాయక చవితి సందర్భంగా నియోజకవర్గాల్లోని ప్రతీ ఊరుకి గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పూజలు, ఊరేగింపులు, భజనల కోసం అధిక మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇదే ఇప్పుడు వారిని మరింత కలవరపాటుకు గురి చేస్తోంది. ‘ఎన్నికలు అయిపోయేంత వరకూ కార్యకర్తలు, నాయకులను చంటి పాపల్లా చూసుకోవాలి. ఏ ఒక్కరినీ చేజార్చుకోవద్దు. ఇగోలు, ప్రెస్టేజీలన్నింటినీ పక్కన పెట్టండి. అవసరమైతే మీకు వ్యతిరేకంగా ఉన్న వారి కడుపులో తలకాయపెట్టి మరీ బతిమాలుకోండి…’ అంటూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్… అభ్యర్థులకు మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు. దీన్ని పాటించడానికి కోట్లు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందన్న ఆవేదనకు గురవుతున్నారు.