Hyderabad News: పండుగ పూట విషాదం - పతంగి ఎగరేస్తూ విద్యుత్ షాక్ తో బాలుడు మృతి
Telangana News: పండుగ పూట రాజేంద్రనగర్ పరిధిలో విషాదం జరిగింది. ఓ బాలుడు పతంగి ఎగరేస్తుండగా విద్యుత్ తీగలకు తగిలి ప్రాణాలు కోల్పోయాడు.
Boy Died of Electric Shock While Flying a Kite: సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ (Hyderabad) లో విషాదం జరిగింది. గాలిపటం ఎగరేస్తూ ఓ బాలుడు విద్యుత్ షాక్ తో ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్ (Rajendra Nagar) పరిధి అత్తాపూర్ (Athapur)లో ఈ విషాద ఘటన శనివారం జరిగింది. ఇంటి మేడపై తన స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగరేయడానికి వెళ్లిన తనిష్క్ (11) పతంగి ఎగరేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి కుప్పకూలాడు. తల్లిదండ్రులు వెంటనే బాలుణ్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
ఇనుప రెయిలింగ్ ఇరుక్కుని
అటు, మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వెర ఐబి చౌరస్తా బ్రిడ్జి వద్ద హైవే ఇనుప రెయిలింగ్ లో తల ఇరుక్కుని ఓ బాలుడు నరకయాతన అనుభవించాడు. వట్పల్లి మండలం బూత్ కూర్ గ్రామానికి చెందిన దంపతులు తమ కుమారుడితో బస్సు ఎక్కేందుకు నారాయణఖేడ్ వెళ్లేందుకు ఆ చౌరస్తా వద్దకు శుక్రవారం వచ్చారు. ఈ క్రమంలో బాలుడు ఆడుకుంటూ.. రెయిలింగ్ మధ్యలో తల పెట్టాడు. ప్రయాణికులు, స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు ఇనుప చువ్వలు తొలగించి బాలుడి తలను బయటకు తీయడంతో తల్లిదండ్రులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
తల్లిదండ్రులూ జాగ్రత్త
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగకు ఉండే క్రేజే వేరు. పండుగ సందర్భంగా పిల్లలు, పెద్దలు సైతం సరదాగా గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. అయితే, పతంగి ఎగరేసేటప్పుడు చాలా మంది ధ్యాసంతా దానిపైనే ఉంటుంది. ఎంత ఎత్తులో ఎగురుతుంది.? దాన్ని ఏ వైపు తిప్పాలి.? అని పూర్తిగా ఆకాశంపైనే దృష్టి పెడతారు. కింద ఏం జరుగుతుందో.. అడుగులు ఎటు వైపు పడుతున్నాయో కూడా పట్టించుకోరు. దీంతో ఊహించని ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. పిల్లల విషయానికొస్తే కేరింతలతో పూర్తిగా లీనమైపోతారు. ఈ క్రమంలో పిల్లలు ఆడుకునేటప్పుడు పెద్దలు వారిని ఓ కంట కనిపెట్టాలి. పతంగులు ఎగరేసేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
- గాలిపటం ఎగరేసేటప్పుడు వేళ్లకు ప్లాస్టర్ చుట్టుకోవాలి. దీంతో మాంజా పూసిన దారం వల్ల వేలు తెగకుండా ఉంటాయి. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి గాయపడితే రక్తస్రావం ఆగేలా చేసి ఆస్పత్రికి తరలించాలి.
- ఎత్తైన ప్రదేశాల్లో గాలిపటాలు ఎగరేయడం మానుకోవాలి. పతంగులు బాగా ఎత్తుకు ఎగరాలని మిద్దెలు, డాబాలు, గోడలపై ఎక్కుతారు. దీని వల్ల ప్రమాదవశాత్తు జారి కింద పడే అవకాశం ఉంది. విశాలంగా ఉన్న ప్రాంతాలను గాలిపటాలు ఎగరేసేందుకు ఎంచుకోవడం మంచిది.
- ముఖ్యంగా విద్యుత్ తీగలున్న చోట గాలిపటాలు ఎగరేయవద్దు. అలా చేస్తే పతంగులు తీగల్లో చిక్కుకుని ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లలను ఓ కంట కనిపెట్టాలి.
- కొందర రోడ్ల మీద ఇష్టారీతిన గాలిపటాలు ఎగరేస్తారు. అలా చేస్తే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. కాస్త దూరంగా ఎవరూ లేని ప్రదేశాలు, మైదనాల్లో పతంగులు ఎగరేసుకోవడం ఉత్తమం.
- పతంగులను ఎక్కువ ఎత్తులోకి ఎగరేయాలనే ఉద్దేశంతో చాలా మంది చైనా మాంజాలను వాడుతారు. ఇది చాలా ప్రమాదం. గతంలో చైనా మాంజాలు కొందరి మెడకు చుట్టుకుని ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. చాలా పక్షులు కూడా చనిపోతున్నాయి. కాబట్టి ప్రమాదకర మాంజా బదులుగా సంప్రదాయ దారం వాడడం మంచిది.
Also Read: Bus Accident: గద్వాల్‌లో వోల్వా బోల్తా- పడిన వెంటనే దగ్ధం- మహిళ సజీవ దహనం