BL Santosh Visit Hyderabad : బీఎల్ సంతోష్ హైదరాబాద్‌కు వస్తున్నారు - కానీ విచారణకు కాదు ! అసలు ట్విస్ట్ ఏమిటంటే ?
28వ తేదీన హైదరాబాద్‌కు వస్తున్నారు బీఎల్ సంతోష్. అయితే విచారణకు హాజరవడానికి మాత్రం కాదు. ఎందుకంటే ?
BL Santosh Visit Hyderabad : తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు.. బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ ప్రయత్నించారని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఫామ్ హౌస్ కేసులో ఆయనే సూత్రధారి అని చెబుతోంది. ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే బీఎల్ సంతోష్ న్యాయస్థానాలకు వెళ్లి నోటీసులపై స్టే తెచ్చుకున్నారు. ఈ కేసుల్లో ఇంకా విచారణలు జరుగుతున్నాయి. ఇప్పుడు బీఎల్ సంతోష్ హైదరాబాద్ రాక ఖరారయింది. అయితే.. ఆయన విచారణ కోసమో.. కోర్టు పనుల మీదో రావడం లేదు. భారతీయ జనతా పార్టీ పని మీదనే వస్తున్నారు.
రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో బీజేపీ శిక్షణా కార్యక్రమాలు
హైదరాబాద్ లో 28,29 తేదీలలో రెండు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ నియోజకవర్గాల పూర్తి స్థాయి కార్యకర్తల శిక్షణ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, బీఎల్ సంతోష్, సునీల్ బన్సల్ వస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని 60 లోక్ సభ నియోజక వర్గాలకు చెందిన కార్యకర్తలు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ బలోపేతం, ప్రచారశైలిపై కార్యకర్తలకు నేతలు శిక్షణ ఇవ్వనున్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను అధికారం నుంచి దూరం చేసేందుకు తెలంగాణ వ్యూహరచనలు చేస్తోంది. దీంతో ఆ పార్టీ తెలంగాణ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడే పార్టీ కీలక సమావేశాలను నిర్వహిస్తోంది. గతంలో ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగ్గా.. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కార్యకర్తల సమావేశం హైదరాబాద్ లో నిర్వహిస్తోంది.
టీఆర్ఎస్‌ను ఓడించేందుకు కీలక వ్యూహాలు సిద్ధం చేస్తున్న బీఎల్ సంతోష్
బీజేపీ వ్యూహకర్తగా పేరున్న బీఎల్ సంతోష్.. టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కీలక సూచనలు చేయనున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ , బీజేపీ పార్టీల మధ్య నెలకొన్న వార్ కారణంగా ఆయన రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. నోటీసులు ఇచ్చామని అయినా హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని గతంలో నోటీసుల్లో పేర్కొన్నారు. ఆ కేసు కాకపోయినా ఇతర కేసుల్లో అయినా నిందితునిగా చూపించి హైదరాబాద్‌కు వస్తే బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. నిజానకి ఫామ్ హౌస్ కేసు బయటపడిన తర్వాత కొంపల్లిలో జరిగిన ఓ పార్టీ శిక్షణా కార్యక్రమంలో బీఎల్ సంతోష్ పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయన రాలేదు.
హైదరాబాద్‌లో సిట్ అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే చాన్స్ ఉందా ?
ముందస్తుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని క్లారిటీ రావడంతో అలర్ట్ అయిన బీజేపీ కీలక నేతలు తెలంగాణ పై మరింత ఫోకస్ ను పెంచారు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీఎస్ సంతోష్ తో పాటు అమిత్ షా పేరు కూడా వినిపించింది. అమిత్ షాకూ నోటీసులిస్తారన్న ప్రచారం జరగుతోంది.ఈ క్రమంలో వారి హైదరాబాద్ కు వీరి రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పట్లోపు న్యాయస్థానాల్లో ఈ కేసు విషయంపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.