'నాణ్యతా లోపం వల్లే మేడిగడ్డ కుంగింది' - బీఆర్ఎస్ ప్రభుత్వంపై లక్ష్మణ్ సెటైర్లు
MP Laxman on medigadda barrage: మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్ నాణ్యతా లోపం వల్లే కుంగిపోయిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. దీనిపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదిక సమర్పించిందని చెప్పారు.
నాణ్యతా లోపం వల్లే మేడిగడ్డ ప్రాజెక్టులోని పిల్లర్ కుంగిపోయిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ ఆరోపించారు. ప్లానింగ్, డిజైన్, నాణ్యత లేమి, నిర్వహణ లోపాలే దీనికి కారణమని ఆరోపించారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. పునాది కింద ఇసుక కొట్టుకుపోయి పిల్లర్లు బలహీన పడ్డాయని, ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టత తక్కువగా ఉండడం కూడా పిల్లర్ కుంగుబాటుకు కారణమని అన్నారు.
లక్ష్మణ్ ఏమన్నారంటే.?
'బ్యారేజీ ప్లానింగ్, డిజైన్ సరిగ్గా లేకపోవడం వల్లే ఇలా జరిగిందని, ఇది వైఫల్యమేనని నివేదిక చెప్పింది. డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల వంతెన బలహీన పడుతోంది. ఓ బ్లాకులోని సమస్య మొత్తం బ్యారేజీకే ముప్పు తెచ్చింది. సమస్య పరిష్కరించే వరకూ మొత్తం బ్యారేజీని ఉపయోగించే అవకాశమే లేదని కమిటీ నివేదికలో పేర్కొంది. మొత్తం బ్లాకును పునాదుల నుంచి తొలగించి తిరిగి నిర్మించాలని సూచించింది.' అని లక్ష్మణ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర అధికారుల బృందం 20 అంశాలపై సమాచారం కోరగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం 12 అంశాలకు సంబంధించి మాత్రమే సమాచారం ఇచ్చిందని కమిటీ తన నివేదికలో పేర్కొన్నట్లు లక్ష్మణ్ వెల్లడించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై సెటైర్లు
కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లలోనే హడావుడిగా నిర్మించారని, ఇప్పుడు దాని బండారం బయట పడిందని లక్ష్మణ్ వివరించారు. రూ.35 వేల కోట్లతో ప్రతిపాదించి రూ.లక్షన్నర కోట్లకు తీసుకెళ్లారన్నారు. ప్రాజెక్టు కుంగి లోపాలున్నప్పటికీ మంత్రులు నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారని మండిపడ్డారు. డీపీఆర్ కూడా ఇవ్వని ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పనిమంతుడు పందిరి వేస్తే.. కుక్క తోక తగిలి కూలింది.' అన్నట్లు తయారైందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల రూ.లక్షల కోట్ల సంపద వృథాగా ఆవిరైపోతుందని లక్ష్మణ్ ఆరోపించారు.
'సీబీఐ విచారణకు డిమాండ్'
మరోవైపు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. డిజైన్, నిర్వహణ లోపాలతో నాలుగేళ్లకే, ప్రాజెక్టు భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని మండిపడ్డారు. రూ.1.20 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులో చుక్క నీరు నిల్వ చేసే పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్ కు దమ్ముంటే సమగ్ర న్యాయ విచారణకు ముందుకు రావాలని సవాల్ విసిరారు.
Also Read: వైఎస్ షర్మిల ప్రకటనపై టీ కాంగ్రెస్ రియాక్షన్, ఏమందంటే?