BJP MLAs Meet Revanth Reddy : రేవంత్ రెడ్డిని కలిసిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు - ఎందుకంటే ?
Telangana Politics : రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ అయ్యారు. రైతుల సమస్యల పరిష్కారం కోసమే సీఎంను కలిశామని వారు చెబుతున్నారు.
BJP MLAs met with Revanth Reddy : తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న బీజేపీ నేతలు హఠాత్తుగా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను కలిసేందుకు బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి,( Alleti Maheshwar Reddy ) ఎమ్మెల్యేలు రామారావు పటేల్,( MLA Ramarao Patel ) పైడి రాకేష్ రెడ్డిలు( MLA Paidi Rakesh Reddy ) వచ్చారు. వారితో రేవంత్ రెడ్డి అరగంటపాటు సమావేశం అయ్యారు. రైతు సమస్యలు అదేవిధంగా ధాన్యం కొనుగోలుపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని బీజేపీ నేతలు ప్రకటించారు. ఈ మేరకు వారు సమర్పించిన వినతి పత్రాన్ని మీడియాకు రిలీజ్ చేశారు.
బీజేపీలో చర్చనీయాంశం అయిన ఎమ్మెల్యేల భేటీ
ముఖ్యమంత్రితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ కావడంతో బీజేపీలోనూ చర్చనీయాంశం అయింది. మాములుగా అయితే వినతి పత్రం ఇవ్వడానికి ముఖ్యమంత్రిని కలిసేందుకు బీజేపీ శాసనసభాపక్షం మొత్తం కలిసి వెళ్తుంది. ప్రత్యేకంగా ముగ్గురు వెళ్లే అవకాశం ఉండదు. అయితే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ ఉద్దేశంతో వెళ్లారన్నదానిపైనా బీజేపీలో చర్చ జరుగుతోంది. బీజేపీ శాసనసభాపక్షం నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎన్నికల ముందు వరకూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. నిర్మల్ నియోజకవర్గం నుంచి ఆయన కాంగ్రెస్ తరపునే పోటీ చేయాల్సి ఉంది. కానీ ఎన్నికలకు ఆరు నెలల ముందట బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు.
ఇద్దరు కాంగ్రెస్ లో పని చేసి బీజేపీలో చేరిన వారే
ఇటీవల కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఆయనపై కీలక ఆరోపణలు చేశారు. మంత్రి పదవి ఇస్తే కాంగ్రెస్ లోకి వస్తానని తనతో చెప్పారని కానీ తాను పట్టించుకోలేదన్నారు. రామారావుపటేల్ కూడా కాంగ్రెస్ నేతనే. ఆయన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరి గెలిచారు. పైడి రాకేష్ రెడ్డి వ్యాపారవేత్తగా పేరు గడించి బీజేపీలో చేరారు. ఆర్మూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వీరు మగ్గురికీ బీజేపీతో అంతంతమాత్రంగానే అనుబంధం ఉండటం.. ప్రత్యేకంగా సీఎం రేవంత్ ను కలవడంతో గుసగుసలు ప్రారంభమయ్యాయి.
రాజకీయం ఏమీ లేదని అంచనా
అయితే ఎమ్మెల్యేలు ఏ పార్టీ వారన్నది సమస్య కాదని.. ఎవరు అడిగినా అపాయింట్ మెంట్ ఇస్తానని రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రేవంత్ రెడ్డిని కలిశారు. వారిలో చాలా మందిపై పార్టీ మార్పు ప్రచారం జరిగింది. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు భిన్నం. అందుకే వారిపై పెద్దగా ఇలాంటి చర్చలు జరగకపోవచ్చని అంచనా వేస్తున్నారు.